Thursday, November 21, 2024

మానవ జీవితమే ఒక సముద్ర ఘోష!

• ఆనందాలకు విషాదాలకు ఆటుపోట్లే నిదర్శనాలు!
• ప్రతి కన్నీరు ఉప్పు నీరే!

సంపూర్ణమైన జీవితం అంటే ఒక సముద్ర ఘోష లాంటిది! ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నిలదొక్కుకొని నిలకడగా సంసారం బండిని లాగేవాణ్ణి సముద్రునితో పోలుస్తారు. భూగర్భ వాతావరణాన్ని బట్టి, తుఫానులు, సైక్లోన్లు, హరికెన్లు, తీవ్ర కెరటాలు, వాయుగుండాలు, ఉప్పెనలు ఎన్ని వచ్చినా, ఆకాశం ఎంత గర్జించినా తట్టుకొని తన మనో నిబ్బరాన్ని సముద్రం చూపినట్టే, మనుషులు కూడా రక్త సంబంధీకులనే సంసార చక్రబంధంలో అన్నీ “ఎమోషన్స్” తట్టుకొని నిలబడి తనువు చాలించినప్పుడు సముద్రం అనే సంసార సాగరాన్ని ఈదిన సంపూర్ణ వ్యక్తిగా ఆయన్ను/ ఆమెను ప్రశంసిస్తారు.

స్మశానవైరాగ్యం:

అప్పుడే స్మశాన వైరాగ్యాలను ప్రదర్శించే వ్యక్తులు చాలా మంది నిజ జీవితంలో మనకు తారస పడతారు! ‘ఏమీ తీసుకు రాలేదు…ఏమీ తీసుకుపోలేదు” అనే మాట వారి నుంచి వినిపిస్తుంది! సముద్రానికి మనిషికి ఎన్నో పోలికలు ఉంటాయి. సముద్రం తనంతట తాను ఆవిరై వాతావరణంలోకి మేఘంగా మారుతుంది. ఆ మేఘం భూమి మీద వర్షంగా మారుతుంది. అదే నీరు హిమాయలయాల్లో ఘనీభవిస్తుంది…మంచుగా మారుతుంది…తరువాత హిమానీనదం అవుతుంది. ఆ పై అది కరిగి గంగ యమునా అవుతుంది! మనిషి జీవితం కూడా అంతే! ఈ సాపేక్ష ప్రపంచంలో భ్రమ అయిన జీవితంలో తాను పొందిన భౌతిక జ్ఞానాన్ని తన వారసులకు పంచాలి… అది సన్మార్గం వైపు నడిపించాలి… పవిత్ర నదులు అన్ని సాగరంలో కలిసే ముందు పంటలను, భూమిని సస్యశ్యామలం చేసి సిరులు పండించినట్టే మనిషి జీవితం కూడా ఒక విజ్ఞాన ఖని… తనలోని మేదస్సును ఒక దీపంగా పంచి పరులకు వెలుగు నిచ్చినప్పుడే సంపూర్ణ మానవుడు అవుతాడు అదే సముద్ర పాఠం.

Also Read: అమ్మ జోల పాటలో ఉన్న నిద్ర ఇప్పుడేది?

మహాసముద్రంలాగే…

సముద్రం భూమి యొక్క ఉపరితలంలో 70 శాతం ఉంటుంది! సముద్ర జీవులకు నిలయంగా కాకుండా, ఈ విస్తారమైన అస్తిత్వం మానవుడి మనుగడకు అవసరమైన ప్రతిదాన్నీ అందిస్తుంది. మహాసముద్రాలు మానవులకు ఎలా ఉపయోగపడతాయో మనిషి జీవితం కూడా కుటుంబానికి అదే విధంగా తోడ్పడాలి. సముద్రం ప్రపంచంలోని ఆక్సిజన్‌లో 60 శాతం ఉత్పత్తి చేస్తుంది. 20 శాతం అమెజాన్ అడవుల్లో నుంచి, మిగతా 20 శాతం భూమండలం నుండి వస్తుందని మాస్టార్లు బోధించే వారు. ప్రాణ వాయువు లేకుంటే ప్రాణాలు హరీ మంటాయి!! సముద్రం లోని పగడపు దిబ్బ కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది! పగడపు దిబ్బ అంటే ఇంగ్లీషులో “కోరల్ రీఫ్’ అంటారు! పగడపు దిబ్బ అనేది రీఫ్-బిల్డింగ్ పగడాలచే నీటి అడుగున పర్యావరణ వ్యవస్థ. కాల్షియం కార్బోనేట్ చేత కలిసి ఉంచబడిన పగడపు పాలిప్స్ యొక్క కాలనీల నుండి దిబ్బలు ఏర్పడతాయి. దీని వల్ల పర్యవరణ సమతూల్యత ఏర్పడుతుంది.

పగడపుదిబ్బ:

ఒక్కమాటలో చెప్పాలంటే, సముద్రం లేకపోతే ఊపిరి పీల్చుకోలేము! ప్లాస్టిక్ మరియు కర్మాగారాల నుండి వచ్చే అన్ని విషపదార్ధాలు గాలిని కలుషితం చేయడంతో, పగడపు దిబ్బ ఎంతో పనిచేస్తుంది, ఇది అదనంగా, మానవులు వాతావరణ నియంత్రణ కోసం సముద్రంపై మానవుడు ఆధారపడతాడు! ఎందుకంటే ఇది భూమధ్యరేఖ నుండి వ్యతిరేక ధ్రువాలకు వేడిని రవాణా చేస్తుంది. ఇక సముద్రం లోతు కనుక్కోవడం కష్ట మయినట్టే ఆడవారి మనసు ఆగాదమంత లోతు అంటారు! ఇంట్లో ఆడవారు ఆచి తూచి తీసుకునే నిర్ణయాలు కుటుంబంలో ఉపద్రవాలు రాకుండా ఉపయోగపడతాయి!

ఆమెకే కోపం వచ్చిందంటే ఉపద్రవాలు ముదిరి సంసారంలో ఉప్పెనలా చెలరేగుతాయి…అందుకే ఆడవారిని గంగమ్మలా సహనం పాటిస్తారు అంటారు! ఆమె హోరెత్తిందా నదులే జన ప్రవాహాన్ని ముంచెత్తుతాయి…!

Also Read: సర్వసంగ పరిత్యాగం అంటే పెళ్ళాం పిల్లలను వదిలి వెళ్లడం కాదు

సముద్రం, మానవ జీవిత మనుగడ:

వాణిజ్యంలో, వ్యాపారం, రవాణా ఒక్కటేమిటీ అన్నీ మానవ అవసరాలకి సముద్రాన్ని ఉపయోగిస్తాం! ఫిషింగ్, కయాకింగ్, చేపల వేట, ప్రాణాంతక వ్యాధులతో పోరాడే పదార్థాలతో కూడిన ఔషధ ఉత్పత్తులు జరుగుతున్నాయి…ఇలా సముద్ర మథనం అంతా ప్రజలతో మమేకమై ఉంది. సముద్రం ఆర్థిక ప్రయోజనాల కోసం మనిషి ఆలోచనలకు ఉపయోగించబడుతుంది. మూడు మిలియన్ల మందికి ఉపాధి కల్పించే సముద్ర-ఆధారిత వ్యాపారాల ద్వారా వందల బిలియన్ డాలర్లు ప్రపంచ మనుగడలో ప్రధాన పాత్ర గా నిలుస్తున్నాయి.

ముఖ్యం గా మానవ ఎమోషన్స్ కు సముద్రమే కారణం!! ఉప్పు నీరు వల్ల వచ్చే ఫ్యూర్ సాల్ట్ వల్లే ప్రతి నిమిషం మనకు ఊపిరి అందుతోంది. ఆ ఉప్పు బిపిలు పెంచుతుంది… తగ్గిస్తుంది! అందుకే ఆడ – మొగను “సముద్రంలో ఉప్పులా… చెట్టు మీది కాయలా కలిపావని’ మానవ జీవితాన్ని సముద్రం తో పోల్చాడు ఒక కవి! క్షీర సాగర మథనం కూడా మానవ జీవిత మనుగడకు స్ఫూర్తి దాయకం.

విశ్వోద్భవ శాస్త్రం:

హిందూ విశ్వోద్భవ శాస్త్రంలో, పాల సముద్ర ప్రస్తావన కూడా సముద్ర జీవితానికి తార్కాణం. ఇది హిందూ గ్రంథాల ప్రకారం, సురులు, అసురులు కలిసి ఒక సహస్రాబ్ది పాటు సముద్రం చిందరవందర చేసి అమరతే అమృతాన్ని అమర జీవితం విడుదల చేశారు. భారతీయ ఆధ్యాత్మిక, మానసిక జీవితాన్ని ప్రభావితం చేసిన దశవతారాలు మానవ మార్గ దర్శకాలు. విష్ణువు తన భార్య లక్ష్మితో పాటు శేష నాగపై పడుకునే ప్రదేశం కూడా సముద్రమే. ఆయన ఉద్బోధించిన జీవిత సత్యాలే మనకు ఆదర్శ దీపాలు. ఇలా జీవితం అనే అంతర్మథనం లో ఆచితూచి అడుగెయ్యకుంటే చరిత్ర హీనులు అవుతారని పురాణ కథల సారాంశం. భవిష్యత్తులో పెరుగుతున్న జనాభాకు తగిన ఆహార పదార్థాల కొరతను కూడా సముద్రమే తీర్చనుంది… సముద్రంలో నాచు ద్వారా తినుబండరాలు తయారు చేయడానికి ఆస్ట్రేలియా బృహత్తర సముద్ర పథకానికి స్వీకారం చుట్టింది. లవణం వల్ల లావణ్యం, మనో నిబ్బరం పెరుగుతుందని పుణ్యదినాల్లో సముద్ర స్నానం చేయాలని అందువల్ల పుణ్యం, పురుషార్థం కలుగుతాయని పూర్వీకులు చెబుతారు. పూర్ణిమ, అమావాస్యలల్లో సముద్ర స్నానం చేయడం వల్ల శరీరం లోని బ్యాక్టీరియా ఎక్కువ లేకుండా, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి సముద్రంలో ఇప్పుడు మానవ మనుగడకు విఘాతం కల్పించే జలాంతర్గాములు పొంచి ఉన్నాయి. ఈ యుద్ద మేఘ ఘట్టంలో ముప్ఫయి శాతం భూమిని కబళించే ఉప్పెనలు రావడానికి మానవ బాంబులు గా మనమే తయారుకావడం దురదృష్టకరం. ‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో” అని అరవై ఏళ్ల క్రితమే వాపోయారు దాశరథి గారు!

Also Read: అహంకారం ఒక అంధకారం… అదే పతనానికి హేతువు

Ramprasad Rao Bandaru
Ramprasad Rao Bandaru
Mr. Bandaru Rama Prasad has been a journalist since his 21st year. Starting with Andhra Bhoomi as a sub-editor he became desk in-charge at Andhra Prabha before becoming a freelancer and a script writer in electronic medium. Did his MA from Osmania University. He founded Amrita Tele Films..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles