ఆయన ఒక ఫాక్టరీ, కలం కార్మికుడు. జీతాలు, పదవులు లెక్కలు మరిచిపోతారు. ఎన్నోసార్లో రాజీనామా చేశారే గాని రాజీపడలేదు.
తెలుగు నేలపై జర్నలిజానికి కలం కార్మికుడు. దశాబ్దాలు దాటిపోతున్నాయి, కలం రాస్తూనే ఉంటుంది. పాత్రికేయ కార్మికులను తయారు చేస్తూ ఉంటారు. ఏబికె అసలు ఫాక్టరీ. రచయితలు అవుతారు. కాలమిస్టులు అవుతారు. కాల ఇష్టులు అవుతారు. ఎబికె గురించి రాయాలంటే చాలా కాలం పడుతుంది. వరంగల్లులో మా నాన్నగారు ఎం ఎస్ ఆచార్య నన్ను పాత్రికేయుడిని సృష్టిస్తే నన్ను మళ్లీ రిపోర్టర్ గా పుట్టించిన వాడు ఎబికె.
టిటిడి లో కుంభకోణాలతో నేను, మరో మిత్రునితో కలసి పని చేస్తే నన్ను టిటిడి కుంభకోణాల శ్రీధర్ అన్నారు. తొమ్మిది వ్యాసాలు వరసగా రాస్తే, టిటిడి అవినీతి నీడ మమ్మలిని వెంటాడుతు ఉంటే నాకు అండగా నిలబడ్డారు. మరోవైపు ‘ఉదయం’ పత్రిక తొలి సంపాదకుడిగా ఏబీకే ఉంటే దాసరి నారాయణ రావు సారథి గా నడుపుతూ ఉంటే, ఇద్దరూ కృష్ణార్జునులుగా అవినీతిని సంహరించే కలం ధరించి కురుక్షేత్రంలో సవ్యసాచిగా విజృంభిస్తూ ఉంటే మహారథిగా ఉండే అవకాశం ఇచ్చారు ఎబికెకి దాసరి నారాయణ రావు. ఇప్పుడు దాసరి లేకపోవడం చాలా పెద్ద లోటు.
‘ఉదయం’ తరువాత ఉదయం వంటి పత్రికలు లేవు, ఎబికె తరువాత, ఆ తరువాత కె రామచంద్రమూర్తిని మరిచిపోవడం సాధ్యం కాదు. (స్వర్గీయ పొత్తూరి వేంకటేశ్వర రావు, గజ్జల మల్లారెడ్డి ఉదయాన్ని నిలిపించారు) కాని ఉదయం పొద్దున్న వస్తే మళ్లీ కొత్త ఉదయం వచ్చే దాకా ఉదయం కోసం ఎదురుచూస్తూ ఉండేవారం. ఉదయం ఆగిపోయినట్టు ఉదయం పోయిందే అని బాధపడుతున్నా ఇప్పడికీ.
జర్నలిజంలో తన ఆరు దశాబ్దాల ప్రయాణాన్ని ఒక్కో ఆర్టికిల్ గా రాసుకుంటూ ఆ రోజు కొత్తగా ఒక వ్యాసానికి పుట్టిస్తున్నాడు ఏబీకే.
పాత్రికేయ వృత్తిలో దాదాపు 60 సంవత్సరాలు సబ్-ఎడిటర్, ఎడిటర్, కరస్పాండెంట్, పర్సనాలిటీలను ఇంటర్వ్యూ చేయడంలో స్పెషలిస్ట్‌గా వివిధ హోదాల్లో గడిపారు. చివరికి ఐదు తెలుగు దినపత్రికలకు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఎదిగారు. కొత్త వార్తా దినపత్రికను ప్రారంభించారు. ఆశ్చర్యమేమంటే కృష్ణాజిల్లా పునాదిపాడులో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడైనాడు. నాగపూర్‌లో ఎం.ఎ చదువుతూ అక్కడ తెలుగువారు జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమాలను ‘విశాలాంధ్ర’ పత్రికకు రిపోర్ట్ చేస్తూ పాత్రికేయుడైనాడు. విచిత్రమేమంటే ఇది తనకు కావలసిందేమీ కాలేజ్ లో ఉండదని వదులుకున్నాడు. ఉద్యోగం విజయవాడ (1958) విశాలాంధ్రలో సబ్‌ఎడిటర్. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త వంటి అనేకానేక తెలుగు పత్రికలకూ పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీ కోసం, మార్క్సిస్టు పార్టీ పత్రిక ‘జనశక్తి’ని నడపడంలో 15 ఎకరాల పొలాన్ని కరిగించేశారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని కళ్లారా చూశారు. ‘జనశక్తి’ సంపాదకుడిగా ఆయనపైన అనేక కేసులు నమోదయ్యాయి. జైలుకెళ్లారు.
ఏ బీ కే కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన రోజు… అని మిత్రుడు అంటూ మహమ్మద్ గౌస్ అన్న ఈ మాటలు ముఖ్యం. ‘‘ఈనాడులో అత్యవసర ప్రకటన రోజు (జూన్ 25, 1975) పని చేస్తున్నప్పుడు ఎదుర్కొన్న ముఖ్యమైన క్లిష్టమైన దశ. ఆ సమయంలో భారతదేశంలోని ఏ బీట్-కానిస్టేబుల్ అయినా వార్తాపత్రిక లేదా సంపాదకులు/కరస్పాండెంట్లను సెన్సార్‌షిప్ వేధింపులకు గురి చేయవచ్చు. ఎమర్జెన్సీకి నిరసనగా రెగ్యులర్ ఎడిటోరియల్‌ని తాత్కాలికంగా నిలిపివేసి, ఠాగూర్ రాసిన ‘వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్’ అనే పద్యాన్ని తెలుగు అనువాదంలో ప్రచురించారు. ఆ సమయంలో జయభారత్ రెడ్డి విశాఖపట్నం కలెక్టర్‌గా ఉండేవారు ( ఈనాడు మొదటి సంచిక విశాఖ నుంచే తెచ్చారు). అతను ఏబీ కే ను పిలిచి, అటువంటి విషయాలను పేపర్‌లో పెట్టకుండా ఉండండి అంటూ మెల్లగా హెచ్చరించాడట. తెలుగు భాషకు ప్రాచీనహోదా దక్కించటంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా ఏ.బీ.కే. ప్రసాద్ చేసిన కృషి ప్రశంసనీయం. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడంలో కీలక పాత్ర వహించారు. ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు. తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు’’ అని.
ఎన్నో పత్రికలకు పురుడుపోసిన సంపాదకుడు ఎబికె ప్రసాద్ (అన్నె భవానీ కోటేశ్వర ప్రసాద్). వారి జన్మదినం ఎన్నో ఉదయాలు చూడాలని ఆశిస్తూ శుభాకాంక్షలు. ఆగస్టు 1, 1935న ఆయన జన్మించారు. ఆయన అసలైన సిసలైన సంపాదకుడు. అంటే సంపాదించే ఎడిటర్ కాదు. ఫోర్త్ ఎస్టేట్ కే మిగిలిపోయాడు. నిజమైన పత్రికలే నిజమైన రియల్ ఎస్టేట్ అనీ, డబ్బులు సంపాదించే సంపాదకుల ఎస్టేట్ కాదని అనుకునే మంచి రోజులు అవి.
ఎంతో రాయవలసింది కాని ఇప్పటికింతే.
(ఆగస్తు 1 ఏబీకే జన్మదినం)