గాంధీకి నివాళి అర్పిస్తున్న అబ్దుల్ కలాం
గాంధీయే మార్గం-6
1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 దాకా 24 రోజులపాటు 240 మైళ్ళు నడిచి దండి చేరడం దండి సత్యాగ్రహం. ఇది జరిగిన నాలుగున్నర సంవత్సరాలకు చైనాలో లాంగ్ మార్చ్ 1934 అక్టోబరు 16 నుండి 1935 అక్టోబరు 11 దాకా అంటే 370 రోజులలో 5,600 మైళ్ళు సాగింది. వీటిని ఈ శతాబ్ద కాలపు అద్భుతాలుగా చరిత్రలో చదువుకుంటాం. వీటి ప్రభావాల గురించి చర్చిస్తాం. ఈ రెండింటికి మించిన మహానడక 2020లో భారతదేశంలో సంభవించింది. దీనికి గాంధీజీ, మావో వంటి నాయకులు లేరు. ఎవరు ఎంత దూరం నడిచారని కూడా చెప్పేవారు లేరు. ఎందుకంటే ఇది ఆ రెండింటిలాగా ముందే నిర్ణయించుకున్నది కాదు. అలాగే ఈ రెండు యాత్రల లాగా ఒకే దిశలో కూడా సాగలేదు. 2 కోట్లమంది మహాపాదయాత్ర గడచిన 75 సంవత్సరాల కాలంలో ఉత్తరాది రాష్ట్రాల నుంచీ, ఈశాన్య రాష్ట్రాల నుంచీ దక్షిణాది రాష్ట్రాలకూ, పశ్చిమ భారత రాష్ట్రాలకు ఎంతోమంది ఉపాధికోసం తరలి పోయారు. వారు ఊరు, పేరూ, సరైన గూడూ, తగిన ఆహారం లేకుండా నగరాలు, నగరాల చుట్టుపక్కల ఉండే పరిశ్రమలు, షాపులు, ఇళ్ళు, వీధులు, నిర్మాణాలకు, మెయింటెనెన్స్ వంటి ఎన్నో పనులకు తోడ్పడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా, నగరాలు, పట్టణాలు, ఉపాధులు, ఊడిగాలు, జీవితాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఎప్పుడు పునఃప్రారంభమవుతాయో బోధపడలేదు. ఇలాంటి విషమ పరిస్థితి వందేళ్ళలో సంభవించలేదు. ఫలితంగా ఎవరికివారు తమ సొంత ఊళ్ళవైపు నడక ప్రారంభించారు. ఇలాంటి వారు రెండు కోట్లు అని అంచనా! ఈ రెండు కోట్లమంది వేలాది కిలోమీటర్లు కాదు గానీ, వందలాది కిలోమీటర్లు తిరువనంతపురం, మద్రాసు వైపు నుంచి అలహాబాదు దరిదాపుల దాకా; అహమ్మదాబాదు, బొంబాయి వైపు నుంచి ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలవైపు ఉన్న చిన్నపాటి లగేజీతో ఊరిలోని కుటుంబాల కోసం అలాగే నడిచారు. ఆకలి, దప్పులు, శ్రమ, బడలిక, అనారోగ్యం, చావు వంటివాటిని లెక్కచేయకుండా అలాగే మహానడకగా మారిపోయారు. వీరికి ఒక నాయకుడు లేడు. అభివృద్ధి అనే ఆశ తోడ్పడుతుందని కొంత ప్రణాళికతో వచ్చి నగరాలు చేరినవారు – ఆ నగరాల మీదా, నగరవాసులతో ముడిపడిన అహంకారం, అజీర్తి, అపరిశుధ్యం మీద నిరసనగా అసంతృప్తితో వెనుదిరిగారు. వీరి సేవలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రతి నగరవాసి వినియోగించుకున్నాడు. ఏ నాయకుడూ, ఏ అధికారీ వీరి సమస్యలను పూర్తిగా గమనించలేదు, పరిష్కరించలేదు. మౌనంగా, విషాదంగా మూటముల్లెతో సాగిన మనుషుల బారును చూసిన తర్వాత నగరాల మానవత్వం నాలిక్కరుచుకుంది, మన ప్రణాళికలు తల వంచుకున్నాయి. అంతే! ఏ రాజకీయపార్టీ వీరిని పట్టించుకోలేదు. వీరు మహాప్రయాణాలు చేస్తున్నప్పుడే కాదు, కనీసం ఇప్పుడు కూడా ఏ మేథావీ ఆలోచించిన పాపాన పోవడం లేదు. మనం ఒక విపత్తు నుంచి మరో విపత్తుకు సాగుతున్నామా అని భావించక తప్పదు. రాజకీయ నాయకుల దృష్టిలో రైతులు లేరు ‘స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే రీతిలో అందంగా అనలేదుగానీ గాంధీజీ కనీస జీవన అవసరాలతో కక్కుర్తి పడకుండా జీవించడం నేర్చుకోమని తన జీవితం ద్వారా చెప్పాడు. మూర్ఖంగా బతవద్దు అన్నారు. గ్రామాలకు తరలి వెళ్ళండి, కాయకష్టం చేయండి. దుబారా చేయవద్దు. ప్రకృతితో జీవించండి అని గాంధీ మహాశయుడు విద్య, వైద్యం, సేద్యం, ఆహారం, ఉపాధి ఇలా చాలా విషయాల గురించి చెప్పారు. గాంధీజీ మీద గౌరవం అధికమై, ఆయన చెప్పిన సూక్ష్మాలను ఆలోచించకుండా మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి సాగుతూ వచ్చాం. గాంధీ మార్గం సాధ్యం కాదు, అర్థరహితం అనేంత గడుసుదనం సంతరించుకున్నాం! అందుకే ఇలా బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాం. గ్రామస్థులుగా సహజంగా జీవించండి అని ఆయన పలువిధాలుగా చెబుతూ వచ్చారు. అయితే మన ప్రణాళికలు, ఆలోచనలు, విధానాలు అటువైపు సాగలేదు. రైతులు మన రాజకీయపార్టీల అజెండాలో వాస్తవానికి లేరు. ఒకవేళ ఉన్నావారు ఎన్నికల సమయానికే పరిమితం! కనుకనే అన్ని పార్టీల నాయకులకూ, వారి విధానాలకూ వలస కార్మికుల తిరుగు ప్రయాణాలు కనబడలేదు. వారి భవిష్యత్తు గురించి నేటికీ పట్టలేదు. గాంధీ ఈ దేశ సంస్కృతిని దాటి ఆలోచించలేదు. నేల విడిచి సాము చేయలేదు. ఆయన ఆలోచనలలో ఇంగితం, వర్తమానపు అవసరాలకు సంబంధించిన స్పృహ పుష్కలంగా ఉంటాయి. గాంధేయవాది అబ్దుల్ కలాం 2015 జూలై 27న 85 సంవత్సరాల వయసులో కనుమూసిన మహాశాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం మౌలికంగా గాంధేయవాది. 1931 అక్టోబరు 15వ తేదీన జన్మించిన కలాం చాలా సామాన్యంగా జీవించాడు. రాష్ట్రపతి స్థాయికి ఎదిగాడు. కానీ ఆయన గాంధేయవాదిగా చెప్పుకోలేదు. కలాం జీవితాన్ని, జీవనశైలిని పరిశీలిస్తే సిసలైన గాంధేయవాది అని సులువుగా బోధపడుతుంది. బాల్యంలో రామేశ్వరం ఒడ్డులో ఎగిరే రాకెట్లను చూసి, అలాంటి వాటిని తయారు చేయాలనే ఆశకలిగిన అహింసావాది అబ్దుల్ కలాం. రోజూ నమాజు చేస్తూనే – భగవద్గీతనూ, కర్ణాటక సంగీతాన్ని, మిస్సైల్స్ పరిశోధననూ ప్రేమించిన ఆజన్మ బ్రహ్మచారి. రెండు, మూడు జతలకంటే ఎక్కువ గుడ్డలుండేవి కావు. టెలివిజన్ అసలు లేదు. రెండు సూటుకేసులతో ఆయన రాష్ట్రపతి నిలయం నుంచి పదవీవిరమణ చేశారు. కొన్ని పుస్తకాలు, ఒక వీణ, గుడ్డలు, సిడిప్లేయర్, లాప్ టాప్. ఇంతే వీరి లగేజి. 2002లో గోధ్రాసంఘటనల్లో 1200 మంది మరణిస్తే అక్కడికి వెళ్ళారు. అలా వెళ్ళడం తన బాధ్యత అనీ, వారికి కలిగిన గాయాలను కొంత మాన్పించడానికీ, పునరావాస సహాయ కార్యక్రమాలు వేగిరపరచడానికి వెళ్ళడం అవసరం అని ఆయన భావించారు. ఈ విషయాలను అప్పటి ప్రధాని వాజ్ పాయి గారికి వివరించినట్లు ‘టర్నింగ్ పాయింట్’ అనే పుస్తకంలో కలాం పేర్కొంటారు. అబ్దుల్ కలాం 2003 జనవరి 25న రాష్ట్రపతిగా జాతికి సందేశమిస్తూ ‘పుర’ అనే భావనకు ప్రతిపాదించాడు. ‘పుర’ (PURA) అనే నాలుగు అక్షరాల సముదాయం – ప్రొవిషన్ ఆఫ్ అర్బన్ అమెనిటీస్ టు రూరల్ ఏరియాస్ (Provision of Urban Amenities to Rural Areas). 1990ల నుంచి ఈ భావన గురించి ఆ దిశలో కొంత కృషి జరుగుతోంది. ‘Target 3 billion’ అనే పుస్తకంలో అబ్దుల్ కలాంగారు పూర్తిగా వివరించారు. ఆయన చెప్పింది ఏమిటంటే, నాలుగు రకాల అనుసంధానం గ్రామాలకు ఒనగూడాలి అని – అని ఫిజికల్ కనెక్టివిటి, ఎలెక్ట్రిక్ కనెక్టివిటి, నాలెడ్జి కనెక్టివిటి, ఎకనామిక్ కనెక్టివిటి! రోడ్లు పారిశుధ్యం మొదటి వర్గం కాగా; ఫోన్లు, నెట్, విద్యుత్ వగైరా ఎలెక్ట్రికల్ కనెక్టివిటి. సంస్థలు, కళాశాలలు వగైరాలు కలిస్తే నాలెడ్జి కనెక్టివిటి; ఎకనామిక్ కనెక్టివిటి అంటే ఆర్థికపరమైన సంబంధాలు. వీటిని గ్రామాల్లో కల్పించమని అబ్దుల్ కలాం వాంఛించారు. ప్రభుత్వాలకు హితబోధ చేశారు. గాంధీ బోధనలలోని స్ఫూర్తిని విస్మరించరాదు కోవిడ్ కారణంగా చిన్నపట్టణాలు, గ్రామాలు చేరిన దిగువ తరగతి వర్గాల గురించి తప్పక ఆలోచించాలి. వీరు సుమారు రెండుకోట్లమంది దాకా వుంటారు, వీరి ఉపాధి గురించి అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనే పద్ధతులకు సాఫ్ట్ వేర్ కంపెనీలు మారిపోయాయి. గ్రామాలలో అబ్దుల్ కలాం ఆశించిన ‘పుర’ అనే నాలుగు రకాల అనుసంధానాలు కల్పిస్తే నగరాలకూ, గ్రామాలకు తేడా ఉండదు – ఒక్క పర్యావరణం, అనారోగ్యం విషయాలలో తప్పా. గాంధీ భావనలను కేవలం మాటలుగా స్వీకరించి, స్ఫూర్తిని కోల్పోతే మన ఏడు దశాబ్దాల అనుభవం లాగా ఉంటుంది. అబ్దుల్ కలాం సిసలైన గాంధియన్ లాగా యోచన చేసి పరిష్కారాలు సూచించారు. వీటినందుకుని అవసరమైతే మెరుగుపరచుకున ముందుకు పోవడం అవసరం. ఆలోచనల విశ్లేషణలో, అనువర్తన ప్రణాళికలో సృజన జోడించి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. గాంధీ మహాశయుడి కాలానికి హెచ్ ఐవి, కోవిడ్ వంటి మహా అంటు వ్యాధులు తారసపడలేదు. గాంధీ ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, ఈ సంస్కృతులను గమనించి అధ్యయనం చేసి తగిన పరిష్కారాలు సూచించారు. ఆ సూచనలలోని స్ఫూర్తిని అందుకుని వర్తమానాన్ని విశ్లేషించాలి. అబ్దుల్ కలాం గ్రామాలలో సంభవించిన పరిణామాలను అధ్యయనం చేసి ఏ రకంగా గ్రామాలు కాలుష్యానికి దూరంగా అర్థవంతమైన ఆరోగ్యకరమైన దారిచూపగలవో ప్రతిపాదించారు. డా. నాగసూరి వేణుగోపాల్ మొబైల్ : 9440732392 |
v