బీజేపీ జైత్రయాత్ర సాగిస్తోంది. యూపీలో విజయ దుంధుభి మోగించింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలలో 274స్థానాలను బీజేపీ గెలుచుకోగా, 124 స్థానాలను సమాజ్ వాదీ పార్టీ కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ రెండు, బీఎస్పీ ఒక స్థానం గెలుచుకున్నాయి. ఒక్క పంజాబ్ లో మినహా తక్కిన నాలుగు రాష్ట్రాలలో బీజేపీ ఘనవిజయం సాధించింది. పంజాబ్ లో మాత్రం కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సునామీ సృష్టించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఉత్తరాఖండ్ లోనూ, మణిపూర్ లోనూ బీజేపీ అగ్రగామిగా నిలిచింది. గోవాలోసైతం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 40 స్థానాలలోనూ 20 స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది.
పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉంటే 92 స్థానాలను ఆప్ గెలుచుకోగా, కాంగ్రెస్ 18 స్థానాలను నిలబెట్టుకున్నది. అకాళీదళ్ నాలుగు స్థానాలనూ,బీజేపీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీలు కలిసి రెండు స్థానాలనూ గెలుచుకున్నాయి.
ఉత్తరాఖండ్ లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48 స్థానాలనూ, కాంగ్రెస్ 18 స్థానాలనూ గెలుచుకోగా, బీఎస్ రెండు స్థానాలు గెలుచుకున్నది. ఇక్కడ ఆప్ పోటీలో ఉన్నా ఒక్క నియోజకవర్గంలో కూడా ముందంజలో లేదు.
మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 32 స్థానాలు, కాంగ్రెస్ 5, ఎన్ పీపీ 7, జేడీయూ ఆరు స్థానాలనూ గెలుచుకున్నాయి.
40 అసెంబ్లీ స్థానాలు కలిగిన గోవాలో బీజేపీ 20 స్థానాలనూ, కాంగ్రెస్ 12 స్థానాలనూ, త్రిణమూల్ కాంగ్రెస్ రెండు స్థానాలనూ, ఆప్ మూడు స్థానాలనూ కైవసం చేసుకున్నాయి.
ఈ ఎన్నికల కారణంగా ఆప్ జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు పొందింది. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు మినహా ఇంతవరకూ మరో పార్టీ ఏదీ రెండో రాష్ట్రంలో గెలుపొందిన దాఖలా లేదు. ఆ ఘనత ఆప్ కు దక్కింది. దిల్లీలో రెండు విడతల ఘనవిజయం సాధించి మంచి పాలన అందిస్తున్న ఆప్ పంజాబ్ లో గెలుపొందడం విశేషం. ఈ కారణంగా ఇది జాతీయపార్టీ స్థాయి సంపాదించింది. ఇక్కడి నుంచి గుజరాత్ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ కు గట్టిపోటీ ఇచ్చే ప్రయత్నాలను ఆప్ ఆత్మవిశ్వాసం తో చేయవచ్చు. 2015 నుంచి దిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ కి ఒక సమగ్రమైన రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం పంజాబ్ తోనే వస్తుంది. దిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదు. శాంతిభద్రతలు కేంద్ర దేశీయాంగశాఖ చేతుల్లో ఉంటాయి. పంజాబ్ లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. మాదకద్రవ్యాల సమస్య కూడా విస్తారంగా ఉంది. వేర్పాటువాదుల బెడద ఇప్పటికీ ఉంది. పాకిస్తాన్ తో సరిహద్దు కలిగిన కీలకమైన రాష్ట్రం, దిల్లీలో విద్య, ఆరోగ్య రంగాలలో చేసిన మంచిపనులను ఆప్ పంజాబ్ లో కూడా సమర్థంగా అమలు చేయగలిగితే పంజాబ్ లో పాగా వేసే అవకాశాలు బలంగా ఉన్నాయి.