వోలేటి దివాకర్
దేశ రాజధాని దిల్లీలో అధికార బీజేపీని దీటుగా ఎదుర్కొవడంతో పాటు ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ఆద్మీ పార్టీ అదే ఉత్సాహంతో ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రంపై కన్నేసినట్లు కనిపిస్తోంది.
Also read: ఈ వీరమహిళ చెప్పేది వాస్తవమేనా?!
ఆప్ అధినేత , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ,పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చేసిన రోడ్‌షో ప్రజలను ఆకట్టుకుంది. అ వెంటనే కేజ్రీవాల్ గుజరాత్ లో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు సర్వే జరిపించారు. ఈ సర్వేలో గుజరాత్‌లోని 182 సీట్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ కి 58 సీట్లు సాధించవచ్చు అని తేలింది. దీనితో గుజరాత్ రాష్ట్రంలో అధికారాన్ని సాధించేందుకు ఇప్పటినుంచే ఊహాత్మకంగా కేజ్రీవాల్ పావులు కదుపుతున్నారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే గుజరాత్‌లో ఎన్నికల వరకు ఈ జోరును కొనసాగించడమే ఆప్‌కు సవాలుగా మారుతుంది.
Also read: పోటీకి మేం రెడీ … మరి సీట్లు ? వచ్చే ఎన్నికలకు సిద్ధమైపోయిన గోరంట్ల , ఆదిరెడ్డి
గుజరాత్‌లో 1998 నుంచి 27 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కొనసాగిస్తోంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు కొనసాగుతోంది. మధ్యలో ఆప్ దూరి అధికారం కైవసం చేసుకోవాలని ఆశ పడుతోంది. చివరి సారిగా 1995 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2017 అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ తన సీట్లు, ఓట్ల షేరును గణనీయంగా పెంచుకోవడమే కాకుండా, 22 సంవత్సరాలలో మొదటిసారిగా 182 మంది సభ్యుల అసెంబ్లీలో బిజెపిని మూడు అంకెల సంఖ్య కంటే తక్కువగా పరిమితం చేసింది. కాంగ్రెస్ 41.4 శాతం ఓట్లతో 77 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 99 సీట్లు సాధించి 49.1 శాతం ఓట్లను సాధించింది.
Also read: అప్పుడే చుట్టాలైపోయారా? ! …… టిడిపిలో పవనోత్సాహం!
ఈనేపథ్యంలో కాంగ్రెస్‌లోని ఈ లోపాలను అనుకూలంగా మలుచుకొని, బీజేపీకి ప్రధాన సవాల్ విసిరేందుకు ఆప్ గట్టిగా ప్రయత్నిస్తోంది. గత సంవత్సరం సూరత్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆప్ 28శాతం ఓట్లు,27 సీట్లు సాధించి ఉత్సాహంగా ఉంది. కాంగ్రెస్ స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడం విశేషం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను తీసుకోవాలా వద్దా అనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఇతర రాష్ట్రాలపైనా, 2024 సార్వత్రిక ఎన్నికలపైనా ప్రభావం చూపనున్నాయి.
Also read: రాజమహేంద్రవరం జిల్లా తొలి మంత్రి ఎవరు ?!