- బీజేపీ 15 ఏళ్ల పాలనకు గండి
- కాంగ్రెస్ పరిస్థితి దారుణం
దిల్లీ మునిసిపల్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)ఘనవిజయం సాధించింది. పదిహేనేళ్ళుగా మునిసిపాలిటీని పాలిస్తున్న బీజేపీని తోసిరాజన్నది. ఎగ్జిట్ పోల్స్ ఊహాగానాల కంటే మంచి రసపట్టులో సాగిన కౌంటింగ్ ప్రారంభ దశలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. చిట్టచివరకు ఆప్ నే బీజేపీ కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకొని విజయం సాధించింది. అయితే, బీజేపీ అంత దరిద్రంగా ఓడిపోలేదు. ఆప్ కు 134 వార్డులు వస్తే బీజేపీకి 104 వార్డులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితే కష్టంగా ఉంది. ఆ పార్టీ మొత్తం తొమ్మిది వార్డులు గెలుచుకున్నది.
బీజేపీ అన్ని ఎన్నికలలాగానే ఈ ఎన్నికలను కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ప్రధానినరేంద్రమోదీ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేసింది.
కేజ్రీవాల్ గుజరాత్ లో ప్రచారం చేస్తూనే దిల్లీ ప్రచారం సైతం చూసుకున్నారు. 2017లో జరిగిన ఎమ్ సిడీ ఎన్నికలలో బీజేపీ 181 వార్డులు గెలుచుకోగా ఆప్ 48 వార్డులకు పరిమితమైతే కాంగ్రెస్ 30 వార్డులతో సరిపెట్టుకుంది. ఇంతవరకూ బీజేపీని ఆప్ నేరుగా ఎన్నికలలో ఓడించింది లేదు. ఇప్పుడే. ఇంతవరకూ 2015లో కాంగ్రెస్ ను ఓడించి దిల్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అనంతరం జరిగిన ఎన్నికలలో నిలబెట్టుకున్నది. దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలోనే ప్రప్రథమంగా ఆప్ నేరుగా బీజేపీపైన విజయం సాధించింది. ‘‘మీరు కాంగ్రెస్ మీదనే కానీ మామీద విజయం సాధించలేదు, సాధించలేరు’’ అంటూ బీజేపీ నాయకులు చేసిన ఎద్దేవాకు ఈ ఎన్నికలలో ఆప్ సమాధానం చెప్పింది.
ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ ఇలా అన్నారు: ‘‘ఆప్ కాంగ్రెస్ ని మాత్రమే ఓడించింది అంటూ బీజేపీ నాయకులు ఎప్పుడూ అంటూ ఉంటారు. ఈ రోజు వారికి కేజ్రీవాల్ సరైన సమాధానం ఇచ్చారు.’’ అవును. నిజమే. కాంగ్రెస్ పైనే ఆప్ గెలిచింది. దిల్లీలో గెలుపొందడమే కాకుండా మొన్న పంజాబ్ లో సైతం కాంగ్రెస్ ను ఓడించి అధికారం కైవసం చేసుకున్నది. గుజరాత్ లో కూడా కాంగ్రెస్ ఓట్లను మాత్రమే చీల్చబోతున్నది కానీ బీజేపీ ఓట్లను కాదని ఎగ్జిట్ పోల్స్ తీరుతెన్నులు చూస్తే అనిపిస్తోంది.
కాంగ్రెస్ గుజరాత్ లోనూ, దిల్లీలోనూ ఎన్నికల ప్రచారంపైన ఈ సారి దృష్టి పెట్టలేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కేజ్రీవాల్ దిల్లీ ప్రజలకు కృత్ఞతలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులూ అవసరమని అన్నారు. ‘‘దిల్లీ ప్రజలు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయమంటే చేశాం. పాఠశాలలూ, విద్యావ్యవస్థ బాగు చేయమని కోరారు ఆ పని కూడా చేశాం. ఉచిత విద్యత్తు కావాలన్నారు. నాణ్యమైన విద్యుచ్ఛక్తి సరఫరా కావాలన్నారు. ఆ పనులు కూడా శక్తివంచన లేకుండా చేశాం. ఇప్పుడుమునిసిపల్ వ్యవహారాలు చూడమని చెప్పారు. చూస్తాం,’’ అని కేజ్రీవాల్ అన్నారు.