‘నాతో ఒక బాల వలంటీరు కొంత దూరం నడిచాడు’ అని ప్రముఖ సినీ నటుడు, పొట్టిశ్రీరాములు సంస్మరణార్థం చైన్నై నుంచి కాలినడకదీక్ష అమలు చేస్తున్న సాయిచంద్ వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం కందుకూరు వైపు ప్రస్థానం సాగించిన సాయిచంద్ తో ఒక బుడతడు పొట్టి శ్రీరాములు ఫొటోపట్టుకొని సాయిచంద్ తో కలసి నినాదాలు చేస్తూ నడవటం కనిపించింది.
దారిలో ఏబీఎన్ చానల్ తో మాట్లాడుతూ సాయిచంద్, తనకు చిన్నప్పటి నుంచీ పొట్టి శ్రీరాములంటే ఆరాధనాభావం ఉన్నదనీ, ఆయనకు ఏదైనా ఘన నివాళి ఇవ్వాలన్న కోర్కె ఉన్నదనీ చెప్పారు. డిసెంబర్ 15న శ్రీరాములు ఆత్మార్పణ చేసుకొని మహాత్యాగం చేసి 70 సంవత్సరాలైన సందర్భంగా చైన్నైలోని మైలాపూర్ లో పొట్టిశ్రీరాములు స్మారక మందిరం నుండి నడకదీక్ష ప్రారంభించారు. తనది పాదయాత్ర కాదనీ, కాలినడక దీక్ష అనీ, తాను నడుస్తుంటే తనతో పాటే పొట్టిశ్రీరాములు ఆత్మ కూడా ప్రయాణం చేస్తున్నదనే భావన తన మదిలో ఉన్నదనీ చెప్పారు.
చెన్నైలో తాను బయలుదేరినప్పుడు చాలామంది మిత్రులు తన వెంట నడవడానికి సిద్దపడ్డారనీ, తానే వారిని వారించి ఈసారికి తనను ఒంటరిగా నడవనివ్వమని చెప్పాననీ, ఈ సంవత్సరం అంతా చాలా కార్యక్రమాలు చేయవలసి ఉన్నదనీ, ముఖ్యంగా మార్చి 16న ఆయన జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామనీ, అప్పుడు అందరూ సహకరించవచ్చునని చెప్పాననీ సాయిచంద్ అన్నారు. ‘తెలుగు జాతిలో మీకు ఇష్టమైనవారి పేరు చెప్పమని నన్ను ఎవరైనా అడిగితే పొట్టిశ్రీరాములుగారి పేరే చెబుతాను’ అని సాయిచంద్ అన్నారు. పొట్టిశ్రీరాములు చేసిన మహాత్యాగం గురించి చాలామందికి అవగాహన లేదనీ, దాన్ని ప్రముఖంగా తెలియజేయడమే తన కాలినడక దీక్ష ఉద్దేశమనీ, ఆయనకు మహానివాళి అర్పిండంలో లక్ష్యం అదేననీ ఆయన తెలియజేశారు. ఆహార నియమాలు పాటించడం, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం తనకు చిన్నప్పటి నుంచీ అలవాటేననీ, ఈ నడకదీక్ష వల్ల తన ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ లేదనీ, రోజుకు 30 కిలోమీటర్ల దాకా నడుస్తున్నాననీ సాయిచంద్ చెప్పారు..
మార్గమధ్యంలో మాడభూషి సంపత్ కుమార్, పొట్టిశ్రీరాములు ఆంతరంగికుడు కెవి చలమయ్య, తదితరులు సాయిచంద్ ను సత్కరించారు. చలమయ్య నివాసానికి సాయిచంద్ వెళ్ళారు. నెల్లూరులోనూ, గూడూరులోనూ పొట్టి శ్రీరాములు విగ్రహాలకి పూలమాలలు వేశారు. పొట్టిశ్రీరాములు పూర్వీకుల స్వస్థలమైన ప్రకాశంజిల్లా పడమటిపల్లె గ్రామానికి శనివారంనాటికల్లా చేరుకుంటానని సాయిచంద్ చెప్పారు.