లక్నో : ఒక పదో తరగతి విద్యార్థి అదే తరగతికి చెందిన మరో విద్యార్థిని కాల్చి చంపివేశాడు. ఒక సీటులో ఎవరు కూర్చోవాలన్న వివాదంపైన ఒక విద్యార్థి ఆగ్రహించి రివాల్వర్ తీసి తోటి విద్యార్థిని నిర్దాక్షిణ్యంగా కాల్చివేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లాలో జరిగింది. బుధవారంనాడు ఒక సీటు కోసం ఇద్దరు 14 ఏళ్ళ విద్యార్థులూ వాదులాడుకున్నారు. ఇళ్ళకు వెళ్ళిపోయారు. కానీ ఆగ్రహం వీడని ఒక విద్యార్థి తన బాబాయి గన్ తీసుకొని గురువారం ఉదయం స్కూల్ కి వెళ్ళి తనతో ఘర్షణపడిన విద్యార్థిపైన మూడు విడతల కాల్పులు జరిపాడు. సైన్యంలో పని చేస్తున్న తన బాబాయి సెలవులలో ఇంటికి వచ్చాడు. ఆయన రివాల్వర్ ను దొంగిలించి స్కూలుకు తీసుకొని వెళ్ళి అఘాయిత్యం చేశాడు.
కాల్పులకు గురైన విద్యార్థి అక్కడిక్కక్కడే మరణించాడు. కాల్పులు జరిపిన విద్యార్థిని వెంటనే అరెస్టు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి సంతోష్ కుమార్ సింగ్ తెలియజేశారు. హంతక విద్యార్థి సంచీలో మరో నాటు పిస్తోలు దొరికింది. అంటే, తనతో ఘర్షణపడిన విద్యార్థిని చంపివేయాలన్న గట్టి పట్టుదలతో అతడు స్కూలుకు వెళ్ళినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఉదయం రెండు క్లాసులు అయిపోయిన తర్వాత 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హంతక విద్యార్థి మరో విద్యార్థిని తలమీదా, ఛాతిమీదా, కడుపుపైనా మూడు విడతల కాల్చాడు. కాల్పులు జరిపిన తర్వాత అక్కడి నుంచి పారిపోవడానికి విద్యార్థి ప్రయత్నించాడు. పై అంతస్తు నుంచి కింది అంతస్తుకు వచ్చాడు. తనను వెంబడించవద్దని హెచ్చరిస్తూ గాలిలో కాల్పులు కాల్చాడు. అయితే, కొందరు ఉపాధ్యాయులు అతడిని పట్టుకొని చేతిలోనుంచి పిస్తోల్ ని లాక్కున్నారు. అప్పటికీ విద్యార్థి బలంకొద్దీ గింజుకున్నాడనీ, పోట్లాడాడనీ పోలీసులు వివరించారు. ఉపాధ్యాయులు పోలీసులను స్కూలుకు పిలిచి విద్యార్థిని అప్పగించారు. రజ్జూభయ్యా సైనిక్ విద్యామందిర్ లో ఈ ఘటన జరిగింది.