నల్లగొండ జిల్లా కనగల్ మండలం జి యడవల్లి గ్రామానికి చెందిన చొప్పారి శ్రీను తెలంగాణ మునిసిపల్ వ్యవహారాల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రార్థించారు. ఆ లేఖను ట్విట్టర్ ద్వారా జనవరి 19న కేటీఆర్ కూ, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె. పాటిల్ కూ పంపించాడు. ఇంతవరకూ తనకు కెటీఆర్ నుంచి కానీ కలెక్టర్ నుంచి కానీ అధికారపార్టీ నాయకుల నుంచి గానీ ప్రభుత్వాధికారుల నుంచి కానీ ఎటువంటి స్పందనా అందలేదని శ్రీను విలేఖరులతో అన్నాడు.
ఇంజనీరింగ్ పట్టభద్రుడైన శ్రీనుకు 25 సంవత్సరాలు. అతను వ్యవసాయం చేసుకుంటూ జీవితం వెళ్ళదీస్తున్నాడు. తన పొలం నుంచి తనను అధికారులు గెంటివేశారనీ, పల్లె ప్రకృతి వనం కోసం తన భూమి తీసుకుంటున్నారనీ శ్రీను ఫిర్యాదు చేశారు. భూమి ప్రభుత్వానిదనీ, శ్రీనుది కాదనీ శ్రీనుకు అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తమ పూర్వీకులు తమ భూములను 2010లో శ్రీశైలం ఎడమ కాలువ తవ్వుతున్న సమయంలో అమ్మివేసి సర్వేనంబర్ 354లో కొత్తగా కొనుక్కున్నారనీ, ఇది తమ భూమి కనుకనే రెవెన్యూ శాఖ తనకు 2016లో సమగ్రభూసర్వే జరిపిన తర్వాత పట్టా ఇచ్చిందనీ, డిజిటల్ పాస్ బుక్కు ఇచ్చిందనీ శ్రీను చెబుతున్నాడు. తన కొడుకును దున్నుకుంటున్న పొలం నుంచి అధికారులు గెంటి వేశారని శ్రీను తల్లి ఫిర్యాదు చేసింది.