సంస్కృత మూలం
“భో! పాంథ! పుస్తకధర! క్షణ మత్ర తిష్ఠ!
వైద్యోసి వా? గణితశాస్త్ర విశారదోసి?
కేనౌషధేన మమ పశ్యతి భర్తురంభా?
కింవా గమిష్యతి పతిః పరదేశవాసీ?
ఆంధ్రానువాదం
“పాంథకిశోర! నీ చిరుత ప్రాయము తెల్పెడి మోము; చేతి ఉ
ద్గ్రంధము చూడ వైద్యుడవు గావలె! జ్యోతిష పండితుండవో!
అంధత మూల్గు అత్త గృహమందు; నవోఢను; వార్ధి దాటి సౌ
గంధిక వర్తకుండగు మగండరు దెంచు దినమ్ము లెల్పుమీ!”
గాథాసప్తశతి నుండి
అనువాదకర్త – అజ్ఞాతం
ఈ మాటలు చెబుతున్నది నవయవ్వనంలో ఉన్న నూతన వధువు. ఆమె భర్త ఒక సుగంధ వర్తకుడు. నవోఢయైన పత్నిని వీడి సముద్రాలు దాటి వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళిపోయినాడు. ఆ ఒంటరి దానికి మిరుమిట్లు గొలిపే సుందరాంగుడొకడు తటస్థపడినాడు. అతని చేతిలో ఉన్న బృహత్ గ్రంధం అతని విద్వత్తును తెలుపుతున్నది. ఆ నవయవ్వనవతి అందగాడైన విద్వాంసునితో ఏమి చెబుతున్నదో చూడండి:
“పాంథకిశోర! నీ ముఖం చూస్తే పసినిగ్గులు విరజిమ్ముతున్నది. నీ చేతిలోని ఉద్గ్రంధం చూస్తే, వయస్సుకు మించిన నీ పాండిత్యాన్ని స్ఫురింపజేస్తున్నది.”
“నీవు వైద్యుడవా లేక జ్యోతిష్కుడవా? వైద్యుడవైతే, అంధురాలైన మా అత్తగారు మూలన మంచంలో పడివుంది. ఆమెకు వైద్యం చెయ్యి!.జ్యోతిష్కుడవైతే వాణిజ్యం కోసం సముద్రాలు దాటి వెళ్లిన నా మగడు ఎప్పుడు తిరిగి వస్తాడో చెప్పు!”
ఈ పలకరింపులో గర్భితమైన ఆహ్వానం అర్థం కాని వారుంటారా?
“మగడు ఇంటనే కాదు, దేశంలోనే లేడు. అత్తగారు అంధురాలు. మంచంలో మూలన పడి వున్నది. ఇంతకు మించిన సమయం, సందర్భం లేవు. నేను లే జవరాలను! నీవో నవయవ్వనుడవు!”
నివర్తి మోహన్ కుమార్