వోలేటి దివాకర్
అద్దాల మేడలో ఉన్నవారిపై రాళ్లు వేయడం చాలా సులువు . రాజకీయ నాయకులు , సినిమా స్టార్లు లాంటి వారిపై బురద జల్లి ప్రయోజనాలు , ప్రచారం పొందిన వారు ఎంతో మంది ఉన్నారు . అయితే అందర్నీ ఒకే గాటన కట్టలేము . కొంతమంది వారి చేతుల్లో మోసపోయిన వారూ ఉంటారు . అలాంటి వారు మీడియాను , పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగదు . తాజాగా సినీ ఆర్టిస్టు నుంచి జన సేన వీరమహిళగా మారిన సునీత బోయ విషయంలో న్యాయాన్యాయాలను పోలీసులు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది . ఆమె సినీ నిర్మాత ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్నీ వాసు , పవన్ కల్యాణ్ పై ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు , సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది . విలేఖర్ల సమావేశానికి వచ్చిన ఆమె వేశభాషలు చూస్తే సునీత చెప్పేది వాస్తవమో … అబద్దమో అర్థంకాని పరిస్థితి . తన వద్ద ఉన్న ఆధారాలను కూడా గీతాఆర్ట్స్ సంస్థ వారు లాగేసుకున్నారని సునీత ఆరోపిస్తుండటం గమనార్హం . దీనిపై బన్నీ వాసు స్పందించి వాస్తవాలు వెల్లడిస్తే కాస్త క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి .
ఆర్టిస్టు నుంచి వీరమహిళగా ….
అనంతపురంనకు చెందిన సునీత బోయ సినీ జూనియర్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి ప్రవేశించారు . ఈక్రమంలో జనసేన ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేశారు. మూడేళ్ల క్రితం రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభల సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గ జన సేన ఇన్చార్జిగా ఉన్న నిర్మాత బన్నీ వాసుతో పరిచయం సాన్నిహిత్యానికి దారితీసినట్లు సునీత చెబుతున్నారు . డ్రగ్స్ , ఇంజక్షన్లు ఇచ్చి తనపై వాసు అఘాయిత్యానికి పాల్పడ్డాడని , ఆయన చేతులో పలువురు ఇలాగే మోసపోయారని ఆమె ఆరోపించారు .
ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ , ఆయన సోదరుడు నాగబాబుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా మూడేళ్ళుగా అడ్డంకులు సృష్టిస్తూ అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అన్యాయానికి గురైన సుగాలి ప్రీతి వంటి బాధితులకు అండగా నిలుస్తున్న పవన్ కల్యాణ్ తన విషయంలో స్పందించి తగిన న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు .
రెండు రోజుల్లో స్పందించకుంటే…జనసేన నాయకులకు అల్టిమేటం
మంగళగిరిలోని డిజిపి కార్యాలయంలో సునీత ఫిర్యాదుచేశారు . అక్కడే విలేఖర్ల సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించిన ఆమె తనకు బన్నీ వాసు పరిచయమైన రాజమహేంద్రవరంను పోరాట కేంద్రంగా ఎంచుకున్నారు . జనసేన నాయకులు కందుల దుర్గేష్ , గంటా స్వరూప వంటి వారు స్పందించాలని డిమాండ్ చేశారు . రెండురోజుల్లో దీనిపై స్పందించకపోతే రాజమహేంద్రవరం నుంచే పోరాటం చేస్తానని , ఆ తరువాత గత ఎన్నికల్లో తాను పనిచేసి గెలిపించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆధ్వర్యంలో అధికార వైసిపిలో చేరిపోతానని వెల్లడించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా తిరిగి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని సునీత చెబుతున్నారు. సునీత ఆరోపణలు వాస్తవమేనా … ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా, తదితర అంశాలు పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది