- బాలు-2 అక్షరాలు
- గాన ప్రస్థానం-50 సంవత్సరాలు
- పాటల పందిరి -40 వేలు
కొందరి గురించి ఉత్సాహంగా వ్రాయచ్చు. మరికొందరి గురించి వుద్వేగంగాను వ్రాయచ్చు. అయితే ఇప్పుడు ఉప్పెన లాంటి బాధని ఉగ్గపట్టుకొని వ్రాయడం- విషాదం – అన్న మూడు అక్షరాలతో సరిపోయేది కాదు. ఎందుకంటే మరో సందర్భంలో అయితే “బాలు” గురించి వుత్సాహంగాను, వుద్వేగంగాను వ్రాసే అవకాశం ఉండేది.
బాలుడుగా, మూర్తీభవించిన హరికథామూర్తి “శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి గారి తనయుడుగా”, “సింహపురి జిల్లా” వాసులకు పరిచయమై అక్కడికే పరిమితం కాకుండా, గాన ప్రభతో, గంధర్వ గాయకుల అంశతో, “శ్రీపతి పండితారాధ్యుల” వంశానికి వసివాడని వన్నేలద్దినవాడు.
సన్నిహితులు “మణి” అని పిలుచుకునే “బాలు”ను “మధురగాయకమణి” అంటే పాటకు పరువు, మనకు మర్యాద. ఎన్నో వేదికలమీద, మరెన్నో వేడుకలలో, ఎన్నెన్నో ప్రశంసలు, ఎందరెందరో ప్రముఖులతో గౌరవం పొందిన “బాలు” — త్రివిక్రముఁడు..!
గాత్రధారి – పాత్రధారి- ఎన్నెన్నో కార్యక్రమాల సూత్రధారి…! మరి “పెన్న నీరు” తాగి పెరిగినవాడు కదా. నిజానికి ఇప్పుడు “బాలు” గురించి కొత్తగా చెప్పేది ఏది లేదు. ఇదంతా ఆ “స్వరరూపసి” గురించి తలుచుకోవడమే. అయన పాటవిని ఆనందించే లక్షలాది మందిలో, లక్షో వంతు మందికి మాత్రమే, ” సంగీతం” గురించి తెలుసు. కానీ వారితో పాటు, అందరందరు పరవశించడం “బాలు” ప్రతిభకు, ముక్కంటికి మూడు కళ్ళు అన్నంత నిఖార్సైన నిజం.
మహా కవి “శ్రీ శ్రీ ” గీతం విని, ఒక అతను జీవితం విలువ తెలుసుకొని ఆత్మహత్య ప్రయత్నం మానాడు. – అది- కలం, బలం..! “బాలు” పాటలు రోజూ వింటూ (వినబడని గంట లేదు) తాముకూడా “బాలు” అంతటి వాళ్ళం కావాలని, స్ఫూర్తినింపుకున్న వారు ఎంతో మంది వున్నారు. ఇది- “గళం- బలం,” త్రేతాయుగం లో “కోదండపాణిని” నడిపించినవాడు విశ్వామిత్రుడు. యుగం మారింది. ఈ కలియుగంలో,” కోదండపాణి”, ఈ “బాలు”కి గాన చూర్ణం అద్ది, గాయక జీవితానికి శ్రీకారం దిద్దాడు. “ఓంకారం” చతుర్దశభువనాలను అలరించినట్టు, “బాలు” గానం అఖిల భారతం అంచులు దాటి, అంతర్జాతీయంగా అగణిత సత్కారాలను అందుకుంది.
“బాలు” ఎన్ని పాటలు పాడాడో అయనకి, పక్కవాళ్ళు చెప్పాలి. కానీ అయన ఎంత మందికి, ఎన్ని రకాలుగా సహాయంచేసారో, పక్కనున్న వారికి కూడా తెలియదు. బహుశ ఏ గాయకుడికి ఇన్ని లక్షల మంది అభిమానులు, గతంలో కానీ ఇప్పుడు కానీ ఉండి ఉండరు. ఆయనే ఒక సందర్భంలో చెప్పినట్టు, ” సంగీతంతో”పాటు, “ఇంగితం” కూడా తెలియడం వల్ల, అంతమంది అభిమానం దొరికింది అనుకోవాలి. పాటలో స్వరపరిమళం..!, మాటలో సుమ మృదుత్వం..! – నడతలో వినయం ..! వెరసి, అన్ని కలిసిన త్రిగుణాత్మకమైన వ్యక్తిత్వం..!
“సంగీతం” మహాసాగరం…! “బాలు” గానం అజరామరం….!