Tuesday, January 21, 2025

చంద్ర అపరిచితుడు

కందుకూరి రమేష్ బాబు

కళాకారుడితో సంభాషణ అంటే పరిచితుడు తప్పిపోవడమే!

“మీ ఇంట్లో ఎవరన్నా ఆర్టిస్టు ఉన్నారా?”

“లేరు.”

“మీ తాత ముత్తాతలకు కళతో ఏమైనా సంభంధం ఉన్నదా?”

“లేదు. నాకు తెలిసినంతవరకు లేదు. మా నాన్నే తొలితరం విద్యావంతుడు.”

“మరి కళ?”

“ఏమో!…అయితే ఒక మాట. ఓ సారి ఇల్లు కడుతుంటే మా మేనమామకు లంకెబిందె దొరికిందట. ఆ లంకేబిందేతో పాటు దానిమీద  పెట్టిన గండ్ర గొడ్డలి దొరికిందట. దానిపై నాకు వ్యామోహం” చిన్నగా చిలిపిగా నవ్వి చెప్పాడు చంద్ర.

“మామా, నాకా గొడ్డలి కావాలి” అని అడిగాను.

“సరేలేరా. ఈ సారి ఊరికి వచ్చినప్పుడు ఇస్తాను” అన్నాడు. అంటూ..“దానిమీద ఎదో తెలుగువలే ఉంటుంది. కానీ తెలుగు కాదు. ఎదో భాషలో గెలికారురా. ఏవో బొమ్మలు కూడా ఉన్నాయి” అన్నాడు మా మామ.

ఆ మాట విన్నప్పుడు ఆ గండ్ర గొడ్డలి నాదే అనిపించింది. బహుశా నేను కాకతీయుల కాలం నాటి కళాకారుడినేమో అనిపించింది. ఇంతకు మించి  నాకూ కళకూ ఏ సంబంధమూ లేదు.

కాకతీయుల రాజధాని ఓరుగల్లులో జన్మించి, భాగ్య నగరంలో సేద తీరిన ఓ చిత్రకారుడు, చంద్ర తన కళా వారసత్వం గురించి చెప్పిన ఉపోద్ఘాతం ఇది.

ఓ మూడు సాయంత్రాలు సుదీర్ఘంగా వారిని విన్నాక, కళాకారుడితో సంభాషణ అంటే పరిచితుడు తప్పిపోవడం లేదా అపరిచితుడు పరిచయం కావడం అనిపించింది. ఎందుకో వారిపై నేను రచించిన ఈ చిన్న లఘు చిత్రం చూస్తే మీకే భోధపడుతుంది.

…..                                   ……                          ……

చంద్ర పూర్తి పేరు మైదం చంద్రశేఖర్. ఇతడు తండ్రి రంగయ్య పోలిక. రంగయ్యకు ముక్కు మీద కోపం.

మన హైదరాబాదీ చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ తండ్రి వలే చంద్ర తండ్రి రంగయ్య కూడా ఆజంజాహి మిల్లులో పని చేసేవాడు. 

పనిచేసేవాడు. అది వృత్తి. అందరి తలలో నాలికలా మెలిగేవాడు. అది ప్రవృత్తి. అతడంటే అందరికీ గౌరవం, ప్రేమ, ఆప్యాయత. అతడికి చేతులెత్తి మొక్కేవారు. కానీ అతను కోపగొండి.

కోపం. వ్యవస్థ మీద కోపం. చేయవలసినదేమిటో తెలిసిన కోపం. చేస్తూ చేయకుండా మిగిలిపొయిందేమిటో తెలిసిన కోపం. రంగయ్య వలే అతడి కొడుక్కీ కోపం. రంగయ్యకు అబద్దం అంటే గిట్టదు. కొడుక్కీ అంతే. అబద్దం గిట్టదంటే గిట్టదు.

అతడు సిగేరేట్ నుసిని యాష్ ట్రే లో దులిపేటప్పుడు ఆ సిగరెట్ చెంపపై చూపుడు వేలుతో తాటిస్తే చూడాలి, అబద్దాల రాయుళ్ళను కొట్టినట్టే అనిపిస్తుంది. భ్రుకుటి ముడివేసి విసుక్కుంటే చూడాలి, బొమ్మ ముడుత పడ్డట్టే అనిపిస్తుంది. అది చంద్ర స్వభావం. కోపగొండి అయిన ఒక చిత్రకారుడి చిత్త ప్రవృత్తే అది. 

……                                      …….                                     ……

కోపం అతడి దృక్పథం. కోపం అతడి నిజాయితీ. కోపం అతడిని  కాపాడే చింతన, స్వాంతన. ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి చేసే ప్రయత్నమే కోపం.

59 ఏళ్ల మైదం చంద్రశేఖర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆర్టిస్టుగా పదవీ విరమణ చేసి, బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీ సమీపంలో నివసిస్తున్న చిత్రం. తన కోపమే తన శత్రువుగా, బలిమిగా కలిగిన మనిషి అతను.

అతడి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూడండి.

సంబాషణ మధ్యలో పెట్ట్రోమాక్స్ లైట్ గురించిన ప్రస్తావన వస్తే, అందులో ‘మెంటల్’ ఉంటుంది తెలుసా అని నవ్వాడు.

మెంటల్! బహుశా ‘మెటల్’ అన్న పదం రాను రాను ‘మెంటల్’ గా మారిందేమో! ‘మెంటల్’ అంటే తెలుసుగా, ‘పిచ్చి’.

అలా ఓ వస్తువును, దాని పదాన్ని, అర్థంతో సహా చూస్తాడు.

ఓ చూపు చూస్తాడు. కానీ, అలాగే వ్యక్తం చేస్తాడా అంటే లేదు. దాన్ని డైజెస్ట్ చేసుకుంటాడు. మరి చెప్పేటప్పుడు ఎలా చెబుతాడు? ‘అది తెలుపును పాలతో కడిగిన వెన్నెల్లా ఉంటుంది’ అంటాడు.

చూశారా? తన చూపు నిశితం. వ్యక్తీకరణ బ్యూటిఫుల్. అందులో అతిశయోక్తి ఉన్నట్టు అనిపించే గుణం ఉంటుంది. అది అందుకునే శక్తి లేకపోతే కోపం చేస్తాడనిపించే తత్వం ఎదో ఉంటుంది. అదే అతడు. అందమైన మెటల్. అతడే మైదం చంద్రశేఖర్. ముద్దుగా ‘చంద్ర’ అంటే అందరికీ అర్థం అవుతాడు. అయితే, రెండే రెండు ముక్కలో తనని  చెప్పాలంటే…అతడు అక్షరం. అతడు చిత్రం.

అతడి అక్షరం ఎంత బాగుంటుందో మోహన్ గారిని అడగాలి. అతడి బొమ్మ ఎంత బాగుంటుందో బాపు గారినే అడగాలి.

…….                                             …….                            ……

ఆర్టిస్టుగా అతడిని లికేట్ చేయాలంటే కొన్ని వరసలు చూడాలి. వరసలు? అవును వరసలే.

మొదటి వరస బాపు. బాపు స్వయాన ఒక వరస.

వడ్డాది పాపయ్య, కేశవరావు, చందమామ చిత్ర, శంకర్, బుజ్జాయి  ఉండొచ్చుగాక, కానీ బాపు ఒక వరస.

గంగాధర్, రామారావు, శీలా వీర్రాజు, సత్యమూర్తి- ఇదొక వరస. ఈ వరసలో చివరివాడు చంద్ర.

చంద్రతో పాటు బాలి, మోహన్, గోపి…ఇలా మరికొందరు ఉంటారు. కానీ అది వేరే వరస.

కరుణాకర్, ఉత్తమ్, ఇంకొందరు. ఇదొక వరస.

ఇలా వరసలు. బొమ్మల వరసలు. ఆ వరసల్లో గీతల్లో బాపు ఒక పెద్ద గీత. మిగతావన్నీ చిన్న గీతాలు. అందులో ‘చంద్ర కళ’ ఒక చక్కటి వెన్నెల రేఖ. అది పండింది. అదే అద్భుతం. బాపు దగ్గర బయలుదేరిన చంద్ర, చంద్రను చేరుకున్నారు. అదే విశేషం.

తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. అదే చిత్రం.

బాపు లైన్ కు డిఫరెంట్ గా గీసిన గీత ఇతడి సొత్తు. బొమ్మను ఎంత మోడర్నైజ్ చేయాలో అంత చేసిన గర్వం ఇతడి సొత్తు.

ఒక ఉధ్రుతికి, సంప్రదాయ ఒరవడికి అడ్డంగా…పదో ఇరవయ్యో రాళ్ళేసి నిలువరించాలన్న ప్రయత్నం ఇతడి సొత్తు. అందుకు కూడా కాస్తంత గర్వం. అదే చంద్ర.

మరికొన్ని విషయాలు. కథను గ్లోరిఫై చేసే విధంగా బొమ్మ వేయడం ఒక పద్ధతి. తక్షణం ఆ కథను చదవాలనిపించేలా కుతూహలాన్ని రేకెత్తించడం మరో పద్ధతి. ఈ రెండో పద్ధతి చంద్ర అవలబిస్తాడు. అదే చంద్రకళ. అయితే ఇక్కడో తిరకాసు ఉంది. కథకు తగిన బొమ్మ వేస్తాడన్న మాటే గానే ఆ బొమ్మలో సొగసు, లావణ్యం, దారుడ్యం మటుకు పూర్తిగా తనది. అందుకే ఆయన బొమ్మ అంత అందంగా ఉంటుంది.

మరో మాటలో చెప్పాలంటే, సుందరుడు, చందురుడు, చమత్కారుడు, కోపగొండి అయిన మగవాడి బొమ్మలా ఉంటంది చంద్ర బొమ్మ. కాకపోతే, ఎవరికీ ఏది కావాలంటే అది వడ్డిస్తాడు. అంతెందుకు, వాత్సాయన కామ సూత్రాలు చూశారా? అందులోని బొమ్మలు చూశారా? అవెవరివి? ఏమిటవి? చంద్ర చెప్పిన అనాటమీ క్లాస్ లు అవి.

ఇవన్నీ ఉండగా, ‘ఐ వాంట్ టు బి చంద్ర. ది ఫాలోవర్ ఆఫ్ బాపు’ అని వినమ్రంగా చెబుతాడు. సంతృప్తిగా చెబుతాడు. హుందాగా చెబుతాడు. అదీ చంద్ర.

బొమ్మల విషయానికి వస్తే అది చంద్ర. మరి రచయితగా?

రచయితగా చంద్ర్ర న్యూ వేవ్ రైటర్.

అప్పట్లో అంటే డెబ్బయ్యవ దశకంలో నారాయణ గూడ రైటర్లంటే హడల్. వీరి సంకలనాలు ఓ సంచలనం. జనం హోరు ఆ కథల సంపుటులు.

…….                                                      …….                                     …….

తాను స్వయంగా నూటా యాభై కథలు రాశాడు.

అన్నట్టు, కథలు రాసేటప్పుడు ఇతడిదొక ప్రత్యేక త్రోవ. హెడ్డింగ్ పెట్టి కథ రాస్తాడు.

మరి ఆ కథల్లో ఎం ఉంటుంది? కోపం, అందం రెండూ ఉంటాయి. కోపం అందం తప్పా మరేవీ కనిపించని చంద్రలో అందం గురించిన మీమాంస, కోపం గురించిన మీమాంస రెండూ ఉంటాయ్.

కోపం, అందం కలగలపు చంద్ర. అదే అతడి దృక్పథం. అదే అసలు కథ. అదే అసలు బొమ్మ. అదే ‘అక్షరాలా’ కూడా చంద్ర.

తన చిరకాల వాంచ కూడా అదే. అతడు రాసిన ఒక కథ పేరు అందం. అప్పుడెప్పుడో అచ్చయిన కథ అది.

ఆ కథలో ఒక ఆర్టిస్టు ఉన్నాడు. అతడిని ఒకరు అందానికి పరాకాష్ట ఐన చిత్రాన్ని గీయమంటాడు. ‘సరే’ అంటాడు ఆర్టిస్టు. అధ్బుత లావణ్యవతిని గీస్తాడనుకుంటాం. కానీ ఏదీ గీయడు. ఏది అందమో ఏది అందానికి పరాకాష్టో అంతుపట్టదు. ఆరు నెలల మథనం తర్వాత, సకల శాస్త్రాలు చదివి మథించి. అందం అంటే ఏమిటో తెలియని వైరాగ్యంలో పడతాడు.

చివరకు చిత్రిస్తాడు. పూర్తి చేసిన చిత్రాన్ని అతడికి చూపిస్తాడు. ‘అపురూపమైన సౌందర్యం కావాలన్నావు కదా, చిత్రించా’నని చూపుతాడు. చూసి అదిరిపోతాడు ఇవతలి వ్యక్తి. ‘ఇదేనా?’ అంటాడు అతను. ‘అవును ఇదే’. అంటాడు. ‘చెత్తకుండి, పిచ్చి కుక్క, మనిషి. ఇదేనా? అని విస్మయంగా అడుగుతాడు. ‘అవును. అదే. అన్నం మెతుకు కోసం పెనుగులాడుతున్న కుక్క మనిషి, అదే’ అంటాడు.  ఆచ్చర్యం. అవును. మనుగడ కోసం పోరాటం! అదే అందం.

సర్వైవల్. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్.

పరిణామం, వికాసం, సర్వైవల్. అదే అందం.

అందమైన డార్విన్ చంద్ర. అదే అతడు. అతడి రియలిస్టిక్ అనాటమి.

…….                                     …….                                     ……..

ఇట్లా చాలా చిత్రిస్తున్నాడు చంద్ర.

అప్పుడు డెబ్బయ్యవ దశకం. ప్రజాతంత్రలో చిత్రిస్తున్నాడు. “గీసిన వాటికి డబ్బులు కావాలా? తన పేర చిట్టీ వేయమంటావా?” అని ఎడిటర్ అడిగాడు. స్కూటర్ కొనుక్కోవాలన్నది చంద్ర చిరకాల వాంచ. అందుకే చిట్టీ వేస్తానన్నాడు. రెండు మూడేళ్ళు గడిచాయి. చిట్టీ డబ్బులు రాలేదు. ఆ కంపెనీ బోర్డు తిప్పేసి వెళ్లిపోయింది.

‘నా కవన్నీ తెలియవు. డబ్బులు కావాల్సిందే. గొడవ పడుతాడు చంద్ర. “ఇదిగో… అదిగో” అని ఎడిటర్ తిప్పిస్తుంటాడు. విసిగిపోతాడు చంద్ర. “చివరకు పెట్రోల్ పోసి ఆఫీసు తగల బెట్టమంటవా, డబ్బులు ఇస్తావా?” అంటాడు. అని ఊరుకోడు. తగలబెట్టడానికి సిద్దమవుతాడు. అందం తిరగబడుతుంది. అలా స్కూటర్ సంపాదించుకున్నాడు చంద్ర.

స్కూటరే కాదు, తాను గీసిన లక్షలాది బొమ్మల్లో ఒక వంతు మాత్రమే సంపాదనగా చేతికి వచ్చింది. అయినా దాంతోనే ఏదైనా సమకూర్చుకోవడం. అలానే ఇల్లు.. గిల్లు.. కారూ.. గీరూ – ఏదైనా…

“నాకు నడకంటే ఇష్టం. స్కూటరంటే మరీ ఇష్టం. అదిప్పటికీ ఉంది. కారు నాకు నెస్సిసిటీ. అవసరం”

“ఇవ్వాళ డ్రైవర్ రాలేదు. ఎం చేయలేని పరిస్థితి. బద్దకంగా పడుకున్నాను. అనుకోకుండా ఒక సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా ఒప్పుకున్నాను. డ్రైవర్ రాలేదు. ఎం చేయాలి?” లౌడ్ థింకింగ్.

ఆర్ట్ డైరెక్షన్? కళా దర్శకత్వం!

అవును. బొమ్మవలె అదీ పాతదే. కోపం వలే పాతదే. కాకతీయుల తోరణమంత పాతది.

చిల్లర దేవుళ్ళు. ఊరుమ్మడి బతుకులు. చలి చీమలు. ఛాయ. ఓ అమ్మ కథ. తరం మారింది. మంచు పల్లకి – ఇలా ఇదీ ఒక వరస.

ఇక వేషం అంటారా?

‘రంగుల కల’లో ఒకసారి వేషం కట్టాడు. అంతే.

…….                                             …….                                     ……

“మరి ఇప్పుడేం చేస్తున్నారు?” అంటే…”ఏముంది. బొమ్మలే” అంటాడు. “బొమ్మ తప్ప నాదగ్గర ఏముంది” అంటూ చిరునవ్వు నవ్వుతాడు.

అనారోగ్యం వల్ల బద్దకంగా మారుతున్న ఒళ్ళు. టివి ముందు వేసిన చద్దరపై మోకాళ్ళ మీద కూచొని చిన్నపాటి ఎక్సర్ సైజ్ చేస్తున్న కాయం.  వయసు మీద పడింది. అయినా అందం, కోపం కలగలసిన చిద్విలాసం.

నెమ్మదిగా లేచి సిగరెట్టు ముట్టిస్తాడు చంద్ర. కూతురు మేఘన డాడీ సిగరెట్టూ ముట్టిస్తుంటే వద్దంటుంది. శ్రీమతి అనిత “ఈ సోఫా ఎలా కాలింది?” అంటూ సిగరెట్టూ వైపు గరంగా చూస్తారు. చిరునవ్వు నవ్వుతాడు చంద్ర. తనతో కలిసి అతడి కనుబొమ్మలూ నవ్వుతాయి. నవ్వుతూనే ఈ మధ్య స్నేహితులకు చూపడానికి గీసిన చిత్రాలు చూపుతాడు. రహస్యంగా ఉంటాయవి. అందులో నిర్మొహమాటంగా రేఖలు… చంద్ర లావణ్యం… చంద్ర భీకరత్వం…వాటిని చూపుతూ “నాకు  కొన్ని నిర్దిష్ట అభిప్రాయాలున్నాయి” అన్నడు చంద్ర.

……                                      ……                                              ……

“కళ ఏనాటికీ సంపూర్ణం కాదు” చెప్పడం ప్రారంభించాడు. “సృజనకు అంతులేదు” అంటూ గంభీరంగా చెప్పసాగాడు.

“ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏదైనా, ఇక చాలు అని – అప్పటికి సంతృప్తి పడటంతోనే బొమ్మ పూర్తవుతుంది గానీ నిజానికి అదెప్పటికీ పూర్తి కాదు” అన్నారు చంద్ర.

“…అందువల్లే…అప్పటి వరకు చేసిన పని… గీసిన బొమ్మ…అది అంతం కానట్టే అని అర్థం చేసుకోవాలి. అది సంపూర్ణం కానట్టే ననీ గ్రహించాలి” అర్థమయ్యేలా చెప్పసాగారు.

“ఆర్ట్ ఈజ్ ఇంకంప్లీట్. ఇక గొప్పలు పోవడమెందుకు” అంటూ తానా ఇంకొకరా అన్నది కాదు, కళలో ఎవరికైనా అదే యాతన…అన్నట్టు చెప్పి, సున్నితంగా మందలించినట్లు చెప్పి, మరింత వివరంగా చెప్పమని అడిగితే, వెనకి నడిచి త్రోవ చూపాడు.

…….                                                      ……..                                    ……

అది ఎనభయ్యవ దశకం. అప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆర్టిస్టుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఓ లాల్చి పైజమా వేసుకున్న బుద్ది జీవి వచ్చాడు. జె ఎన్ టి యు, డిల్లీలో చదువుకుంటూ తూర్పు దక్షిణ దేశాల కళలో మౌలిక తేడాల గురించి కంపారిటివ్ స్టడీ చేస్తున్న యువకుడు. సెంట్రల్ యూనివర్సిటిలో ప్రొ హరగోపాల్ చెబితే వచ్చాడట.

బొమ్మల గురించి అడిగితే ‘నా బొమ్మల గొప్పతనం ఎందుకు గానీ మీకేం కావాలో చెప్ప’మని అడిగాడట. ఆ అబ్బాయి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇతడు సిగరెట్టు వెలిగించాడు.

“ఇంతమందిని కలిశారు కదా. వారు చెప్పింది మీకు అర్థమైందా?” అడిగాడు చంద్ర. “వారు చెప్పిన దాంట్లో నిజముందని నమ్ముతున్నారా?” అని కూడా మళ్ళీ అడిగాడు చంద్ర. “మీరు స్వయంగా చిత్రకారులు కాదు. కానీ మీరు చిత్రకళ గురించి చదివారు, అధ్యయనం చేశారు. ఆ జ్ఞానంతో చెప్పండి. వారు చెప్పిందాంట్లో అబద్దం ఉందని గమనించారా లేదా?” మళ్ళీ అడిగాడు.

అతడు వింటూ ఉన్నాడు. ఆలోచనల్లో పడ్డాడు. నిజమే. తాను గొప్ప గొప్ప భావాలు విన్నాడు. కానీ వారు చెప్పింది తనకు చాలా వరకు అర్థం కాలేదు. తనకు అర్థం కానిదే ఎక్కువ. అదే సంగతి ఆ అబ్బాయి చంద్రకు చెప్పాడు. “అర్థం కానిది నిజం” అని అంగీకరించాడు.

“అదే నిజం. ఆర్ట్ గురించి  చాలా అబద్దం ప్రచారంలో ఉంది. ఆర్ట్ సంపూర్ణం కాదు. అది అసంపూర్ణం. ఆగిన ఒక దశను, ఒక వైఫల్యాన్ని, ఒక పరిమితిని చిత్రించి హమ్మయ్య అనుకోవడమే వ్యక్తమైన కళ. అది కాకుండా చాలా చెబితే అది అబద్దం”

“ఇక దీని గురించి అంత ఘనంగా, గంభీరంగా, ఉన్నతంగా మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉన్నదా?” అని ముగించాడు చంద్ర.

ఈ మాటకు అతడు అచ్చెరువొందాడు. కాసేపాగి నోట్ బుక్ మూసేసి, పెన్ను జేబుకు పెట్టుకున్నాడు. ఆ ఆరోజంతా చంద్రతోనే గడిపి సాయంత్రం తిరిగి వెళుతూ “నా తులనాత్మక అధ్యయనం ముగిసింది” అన్నాడు యువకుడు. “ఏం లేదు. నా చదువును ఇంతటితో నిలిపి వేస్తున్నాను” అని స్పష్టంగా చెప్పి వెళ్ళిపోయాడు.

…….                                             …….                                     ……

చంద్ర వద్ద నుంచి సెలవు తీసుకోవడానికి నేనూ లేచాను.

నాతో పాటు గోడకు వేలాడుతున్న చిత్రం ఒకటి లేచి నిలబడి కనిపించింది.

“అదేమిటి?” అంటే “అమ్మవారు. శక్తి” అన్నాడు చంద్ర.

పది చేతులు. ఒకటే తల.

బొమ్మ గోడమీద నిలవనంటోంది. చెంగున గెంతుతుందా అనిపించింది.  అలాగే చూస్తుంటే, అతడి గొంతు వెనక నుంచి వినిపిస్తోంది.

“ఎప్పుడో డ్రా చేశాను” గొంతు లోతుల్లోంచి వినిపించింది.

“మరేప్పుడో రంగులు వేశాను” గొంతు చాలా బలంగా వినిపించింది.

“ఆ తర్వాత ఫ్రేం చేయించాను” గొంతు కోపంగా వినిపించింది.

“ఓ రోజు గోడకు తగిలించాను” అందంగా వినిపించింది.

“ఒక్క క్షణం ఆగి, “పూర్తి కాలేదు. ఇంకంప్లీట్” చెప్పాడు.

ఇన్ కంప్లీట్!

అవును. చల్లగా నవ్వాడు చంద్ర.

తలుపు దాటి మెట్ల మీద దాకా వచ్చి సాగనంపాడు, మైదం చంద్రశేఖర్ సన్నాఫ్ రంగయ్య.

‘బై’ అంటే చేతులు ఊపాడు.

పది చేతులు కదులుతున్నట్టే అనిపించింది. కాకతీయుల కాలం నాటి గండ్ర గొడ్డలి తన చేతుల్లో మెరుస్తున్నట్టు అనిపించింది.

కళాకారుడితో సంభాషణ అంటే పరిచితుడు తప్పిపోవడమే కాదు, అపరిచితుడిని కలుసుకోవడం కూడా అనిపించింది.

PS: చంద్ర గారు నిన్న అంటే 30 ఏప్రిల్ 2021 న కాలం చేశారు. వారి స్మృతిలో… పదహారేళ్ళ క్రితం..ఆగస్టు 2005…తెలుగునాడి సంచికలో అచ్చయిన ఈ వ్యాసం తిరిగి పంచుకోవడం ఒక ఆత్మీయ నివాళి. కడపటి వీడ్కోలు. చంద్ర గారే అన్నట్టు కళ ఎలా అసంపూర్నమో వారితో మనకున్న జ్ఞాపకాలూ ఇన్ కంప్లీట్!  సెలవు అన్నా.

(‘తెలుగునాడి’వ్యాసం, నివాళిగామరోసారి బాధాతప్త హృదయంతో…)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles