రైటప్: కొత్తవీధి గ్రామంలో ఆదివాసీ ప్రతినిధులకు ఉత్తర్వు అందజేస్తున్న అజయ్ కుమార్
కోనాం రెవిన్యూ సర్వేనెంబర్ 289 లో ఆదివాసీల సాగు అనుభవంలో ఉండగా పట్టాదారు పాస్ పుస్తకాల చట్టానికి విరుద్ధంగా భూమి రికార్డుల్లో గిరిజనేతరుల పేరుతో మ్యూటేషన్ చేశారని, కనుక వాటిని రద్దు చేయాలని గత ఏడాది, 2022 జూన్ నెల నుండి మేము చేస్తున్న పోరాటంలో ఒక చిరు విజయాన్ని సాధించాం.
ఈ సంవత్సరం 5వ నెల 22వ తారీఖున గిరిజనేతరుల పేరుతో చేసిన 1B ఎంట్రీలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం నిన్న బయటపడింది. రద్దుకు సంబంధించిన ఆదేశాల నఖలు చేతికి అందింది.
ఈరోజు అనగా డిసెంబర్ 23, 2023న కొత్తవీధి గ్రామ ఆదివాసి ప్రతినిధులకు ఆ ఉత్తర్వులను అందజేసాము.
Also read: టైటిల్ గ్యారెంటీ యాక్ట్: జగనన్న భూరక్ష, అది రక్షా లేక శిక్షా?
గిరిజనేతరుల పేరున గత ఏడాది మే నెలలో జరిగిన రిజిస్ట్రేషన్ లపై కమీషనర్, స్టాoప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ విచారణ ప్రారంభించింది. ఆనాడు మాడుగుల సబ్ రిజిస్టార్ గా పనిచేస్తూ, నేడు విజయనగరం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అధికారిపై చర్యలు తీసుకోమని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. అంతేగాక ప్రభుత్వ భూముల సర్వే నెoబర్ తో, ప్రభుత్వ భూములను కలిపేసి ఆనాటి సబ్ రిజిస్టార్ చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రద్దుకు చర్యలు తీసుకోమని జిల్లా రిజిస్టార్ నూ, రీజనల్ రిజిస్టార్ నూ కమిషనర్ ఆదేశించారు.
అయితే, వ్యక్తిగతంగా నాకు ఇంకా పూర్తి సంతృప్తి లేదు. ఎందుకంటే పట్టాదార్ పాస్ పుస్తకాలు రద్దు చేస్తూ ప్రభుత్వ అధికారి ఇచ్చిన ఆదేశాలలో ఆదివాసీలు సాగులో ఉన్న విషయాన్ని గాని, అదే భూముల్లో వారు గ్రామాన్ని నిర్మించుకొని స్థిర నివాసం ఉంటున్న విషయాన్ని గానీ ప్రస్తావించకుండా దాటవేశారు. అంటే పట్టాలు రద్దు అయినాయి గాని కారణం ఆదివాసీలు సాగు అనుభవంలో ఉండడం కాదు. ప్రభుత్వ సీలింగ్ మిగులు భూమిని ప్రైవేటు భూమిలో కలిపేసి మ్యూటేషన్ చేశారన్నది ప్రధానమైన కారణంగా ప్రభుత్వం చూపించింది. దీని అర్థం ఏమిటంటే, ఇంత జరుగుతున్నా ఆదివాసీలు సాగులో ఉన్నారని చెప్పడానికి రెవిన్యూ అధికారులు సిద్ధంగా లేరు.
నిన్న అనగా శుక్రవారం డిసెంబర్ 22వ తేదీన జిల్లా రెవెన్యూ అధికారి సమక్షంలో జరిగిన విచారణలో ఈ విషయాన్ని బలంగా ముందుకు తీసుకురావడం జరిగింది. 2024 జనవరి మొదటి వారంలో రీ సర్వేలో భాగంగా ఎంజాయ్మెంట్ సర్వే జరుపుతామని హామీ ఇచ్చారు. ఆదివాసీలే సాగు అనుభవంలో ఉన్నారన్న విషయాన్ని ప్రభుత్వం ఒప్పుకునేంతవరకు మా పోరాటం కొనసాగుతుంది.
Also read: నేను ఎత్తుకున్న బుడ్డోడు!
ఇప్పటివరకు జరిగిన పోరాటంలో అనేకమంది వ్యక్తులుగా, సంస్థలు, సంఘాలుగా ఆదివాసీలకు అండగా నిలిచారు. ఇందులో కొన్ని ముఖ్యమైన వాటిని ప్రస్తావిస్తాను.
మానవ హక్కుల వేదిక (HRF):
ఆదివాసీల అభ్యర్థనపై మానవ హక్కుల వేదిక బృందం కొత్తవీధి గ్రామాన్ని సందర్శించి జిల్లా కలెక్టర్ కి తన నివేదిక ఇచ్చింది
BBC తెలుగు విభాగం:
BBC జర్నలిస్టులు, కెమెరామెన్ కొత్తవీధి గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను ఒక స్టోరీగా ప్రపంచం ముందు ఉంచారు.
లిబరేషన్ పార్టీ CCM ‘s :
లిబరేషన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ బుగతా బంగారురావు, కామ్రేడ్ నాగమణి నాయకత్వంలో కామ్రేడ్ హరినాథ్ , ఈశ్వర రావు, రాందేవ్ , కళ్యాణ కృష్ణ గార్లు ఒక బృందంగా రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆ వినతిపత్రంపై విచారణ ప్రారంభమై చివరి దశకు చేరుతున్నది. లిబరేషన్ పార్టీ యువ నాయకుడు కామ్రేడ్ ఉదయ్ రెండు, మూడు సార్లు ప్రయత్నం చేసి చివరికి భూమి రికార్డులు & భూమి సర్వే కమిషనర్ ను స్వయంగా కలిసి వినతిపత్రం ఇచ్చారు.
రామచంద్ర మూర్తి గారి ” సకలం” :
సీనియర్ పాత్రికేయులు రామచంద్ర మూర్తి గారు నేతృత్వంలో నడుస్తున్న ‘వెబ్ పోర్టల్ ” సకలo ” లో ఆదివాసీల సమస్యను ప్రచురించి బయటి ప్రపంచానికి వారి గోడు చేరడానికి సహకరించారు.
ది హిందు:
సుప్రసిద్ధ హిందూ దినపత్రిక పలుమార్లు ఈ సమస్యను ప్రముఖంగా ప్రచురించడంతోపాటు, ఆ దినపత్రిక సంపాదక బాధ్యతలు చూస్తున్న సీనియర్ పాత్రికేయులు స్వయంగా గ్రామాన్ని సందర్శించి ” స్పాట్ లైట్ ” పేరుతో ఈ సమస్యను ప్రచురించారు. ఇది ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టిని ఆకర్షించి దానిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వమని CM కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజన సంక్షేమ శాఖ వారిని ఆదేశించింది.
లీడర్, రమణ మూర్తి గారు:
ఈ సమస్య తన దృష్టికి వచ్చిన దగ్గరి నుండి ” లీడర్ ‘ మధ్యాహ్న దినపత్రిక వారి సమస్యలపై కథనాలను ప్రచురిస్తూ వచ్చింది.
దినపత్రిక ప్రధాన సంపాదకులు వివి రమణమూర్తి గారు తన శ్రీమతితో కలిసి స్వయంగా గ్రామాన్ని సందర్శించి, ఆదివాసీలను విచారించి, బ్యానర్ ఐటమ్ గా వార్తను ప్రచురించారు. అంతేకాక పోరాడుతున్న ఆదివాసీలకు మానవతా సహాయంగా చీరలు, దుప్పట్లు, లుంగీలను పంపిణీ చేశారు.
బీహార్ శాసనసభ్యులు:
బీహార్ రాష్ట్రానికి చెందిన లిబరేషన్ పార్టీ శాసనసభ్యులు ఆదివాసీల సమస్య, వారు చేస్తున్న పోరాటాన్ని తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. ఈ లేఖపై లిబరేషన్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు మరియు 5గురు శాసనసభ్యులు సంతకాలు చేశారు.
EAS శర్మగారు:
భారత ప్రభుత్వానికి ఇంధన కార్యదర్శి గాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ విశ్రాంతి IAS అధికారి, నిత్యం ఆదివాసీల శ్రేయస్సును కోరే EAS శర్మగారు వివిధ సందర్భాలలో ముఖ్యమంత్రి కి, ఇతర అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి లేఖలు రాశారు.
CPI జిల్లా ప్రతినిధి బృందం:
భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి B. రమణ గారి నేతృత్వంలో ఒక బృందం కొత్త వీధి గ్రామాన్ని సందర్శించి సర్వేనెంబర్ 289లో ఉన్న వారి సాగు భూములను పరిశీలించింది. ఆదివాసీలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ , అనకాపల్లి జిల్లా:
జిల్లాలో ఏర్పడిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు అప్పలరాజు గారు, మధుబాబు, ఈశ్వర్ రావుల బృందం గ్రామాన్ని సందర్శించి ఆదివాసీలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఒక నివేదికను తయారుచేసి మోనిటరింగ్ కమిటీ చైర్మన్ ఆయిన జిల్లా కలెక్టర్ గారికి అందజేశారు.
హైకోర్టు న్యాయవాది యోగేష్ మిత్రబృందం:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యువ న్యాయవాది యోగేష్ తన మిత్ర బృందంతో కొత్తవీధి గ్రామాన్ని సందర్శించారు. ఆదివాసీల సాగు అనుభవాన్ని తనిఖీ చేశారు. న్యాయ సహాయం అవసరం అయితే తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ల్యాండ్ మాఫియా చేసే బెదిరింపులకు భయపడవద్దని ఆదివాసీలకు ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడ్డారు.
కొందరు రెవిన్యూ అధికారులు:
మంచి చెడు కలిసే ఉంటాయని అంటారు. కొంతమంది రెవెన్యూ అధికారులు డబ్బు కోసం గడ్డి తిని ఆదివాసీలకు అన్యాయం చేయగా, అదే డిపార్ట్మెంట్ లో ఉంటూ జరిగిన అన్యాయం పట్ల ఆవేదన చెందుతూ తమకు చేతనైన విధంగా ఆదివాసిలకు సహకారం అందించారు. వారి హోదాలను, పేర్లను ఇక్కడ ప్రస్తావించటం లేదు.
యశ్వంత్ సాంకేతిక సహకారం:
క్షేత్రస్థాయిలో ఆదివాసి వాలంటీర్స్ GPS రీడింగ్స్ తీసి పంపిస్తుండగా వాటిని ఆధారం చేసుకుని సాటిలైట్ ఇమేజెస్ తయారు చేయడం ద్వారా ఆదివాసీల సాగు అనుభవాన్ని, వారి స్థిర నివాసాలను సాటిలైట్ ఇమేజ్ ద్వారా ప్రభుత్వం ముందు పెట్టడానికి యశ్వంత్ అందించిన సహకారం అత్యంత కీలకమైనది, మరువలేనిది. ఈ విధంగా అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆదివాసీల హక్కులు నిలబెట్టడానికి తన సహకారం ఇచ్చాడు. అంతేగాక యువ ఆదివాసి కార్యకర్తలకు GPS పద్ధతిని ఉపయోగించడంలో మెళుకువలు నేర్పుతూ వారిని తీర్చిదిద్దుతున్నారు.
రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు:
నిజానికి రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులకు వారి ముందున్న అనేక సవాళ్లు , సమస్యలలో 37 ఎకరాల భూమి సమస్య సముద్రంలో కాకిరెట్ట వంటిది. కానీ భూమిశిస్తూ కమిషనర్ కార్యాలయం, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం, డైరెక్టర్ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ పాడేరు కార్యాలయం, కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారి కార్యాలయం, ఆ కార్యాలయపు ఉన్నతాధికారులు కొత్తవీధి కొంద ఆదివాసీలు భూమి నుండి బేదఖలు కాకుండా నిలబడేందుకు తమ అధికారాలను ఈ నిరుపేద ఆదివాసీల కోసం ఉపయోగించారు.
ఈ చిరు విజయంలో వారందరూ పాలు భాగస్తులు. అనకాపల్లి జిల్లాలో ఉన్న అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం సభ్యులు కొత్త వీధికి ఆదివాసీలకు ఎల్లవేళలా అండగా నిలబడ్డారు. అసాధ్యం అనుకున్న పట్టాల రద్దు సాధన వెనక వీరందరి కృషి నిబిడీకృతమై ఉన్నది.
అంతిమ విజయం సాధనలో వీరందరూ తమ సహకారాన్ని మరింతగా అందిస్తారని ఆశిస్తున్నాము.
Also read: తొలగించిన ఆదివాసీల జాబ్ కార్డులను పునరుద్ధరించండి
జై ఆదివాసి.. జై జై ఆదివాసి!
P.S. అజయ్ కుమార్
జాతీయ కార్యదర్శి
అఖిల భారతి వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ( AIARLA)