మన దేశ ఔన్నత్యాన్ని విదేశాలకు చాటి చెప్పిన మేటి శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్. రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. ఒక అసాధారణ వ్యక్తి. భౌతిక శాస్త్రవేత్తగా, జీవ శాస్త్రవేత్తగా, జీవ భౌతిక శాస్త్రవేత్తగా, వృక్ష శాస్త్రవేత్తగా, పురావస్తు శాస్త్రవేత్తగా జగద్విఖ్యాతి పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, విజ్ఞానఖని బోస్. సైన్స్ ఫిక్షన్లను కూడా రాశారు. రేడియో, మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయ ఫలితాల్ని సాధించిన బోస్ 1904లో అమెరికా నుంచి పేటెంట్ హక్కులు పొందిన తొలి భారతీయ శాస్త్రవేత్త, 1858 నవంబర్ 30న బెంగాల్ ప్రొవిన్స్ (నేటి బంగ్లాదేశ్)లోని మున్సిగంజ్ అసిస్టెంట్ కమిషనర్, బ్రహ్మ సమాజ్ సభ్యుడు భగవాన్ చంద్రబోస్‌కు ఆయన జన్మించాడు.
సంప్రదాయబద్ధంగా పెంపకం
భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా పెరిగిన అతని తండ్రి ఇంగ్లీష్ నేర్చుకునే ముందు బెంగాలీ నేర్చుకోవాలని అనుకున్నాడు. అతను ఒక స్థానిక పాఠశాలలో చదివాడు, అక్కడ అతని క్లాస్‌మేట్స్ విభిన్న వర్గాలు, మతాలకు చెందినవారు. అతను కలకత్తాలోని సెయింట్ జేవియర్స్ పాఠశాలలో చేరాడు. అక్కడ జెస్యూట్ పూజారి ఫాదర్ యూజీన్ లాఫాంట్ ద్వారా సహజ శాస్త్రాలపై ఆసక్తిని పెంచు కున్నాడు. ప్రాథమిక విద్య సమయంలో బోస్ వద్ద – ముస్లిం నౌఖరు కుమారుడు కుడివైపున, మత్స్య కార్మికుని కుమారుడు ఎడమ వైపున కూర్చునే వారు. వారు చెప్పే పశు పక్ష్యాదుల కథలను బోస్ శ్రద్ధగా వినేవాడు. ప్రకృతిలోని జీవాలపై పరిశోధనాసక్తి కలగడానికి తన స్నేహితుల కథలే అంకురార్పణ చేశాయని ఆయన చెప్పేవారు.
కొల్ కతా, లండన్ లో విద్యాభ్యాసం
కలకత్తాలోని సెయింట్ జేవియర్ కళాశాల నుండి డిగ్రీ పూర్తి చేసి, వైద్య విద్య అభ్యసించేందుకు ఆయన లండన్ వెళ్లాడు. ఆరోగ్యం సహకరించని కారణంగా అక్కడ విద్యాభ్యాసం కొనసాగించలేక తిరిగి భారత దేశానికి చేరు కొ న్నారు. తర్వాత బోస్ ఇంగ్లాండ్‌లో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలని అనుకున్నాడు. కాని మనసు మార్చుకుని తన బావ ఆనందమోహన్ బోస్ సిఫార్సుపై కేంబ్రిడ్జ్‌లో నేచురల్ సైన్స్ చదివాడు. అక్కడ ఆయనకు ప్రముఖ ఉపాధ్యాయులు ఫ్రాన్సిస్ డార్విన్, జేమ్స్ దేవర్, మైఖేల్ ఫోస్టర్ బోధించాడు. ఆయన ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలో ప్రఫుల్లా చంద్ర రేతో స్నేహం చేశాడు. తరువాత ఆయన రసాయన శాస్త్రవేత్తగా కీర్తిని పొందాడు.
జీతం లేకుండా బోధన
కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యునిగా చేరాడు. జాతి వివక్ష పరాకాష్ఠకు చేరిన ఆ విద్యాసంస్థలో తన ఉద్యోగంలో జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నాడు, అయన జీతం బ్రిటిష్ సహచరుల కంటే చాలా తక్కువ. బోస్ మూడేళ్లపాటు జీతం తీసుకోకుండా బోధించడం ద్వారా నిరసన తెలుపుతూ, తగినన్ని సౌకర్యాలు ఆర్థిక సాయం అందకున్నప్పటికీ పట్టుదలతో పరిశోధనలను కొనసాగించాడు. తరువాత, కళాశాల ఆయన నియామకాన్ని శాశ్వతంగా రద్దు చేసింది. జీతం బకాయిలను చెల్లించింది. 1917లో కలకత్తాలో బోస్ ఇన్స్టిట్యూట్ ను స్థాపించాడు. అక్కడ శాస్త్రవేత్తలు మొక్కలపై పరిశోధనలు జరిపారు.
రేడియో సిగ్నల్స్ గుర్తింపు
రేడియో సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్ధవాహక జంక్షన్లను మొట్టమొదటి సారిగా వాడిన బోస్ వైర్లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అత్యద్భుత ప్రగతిని సాధించ గలిగాడు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది బోసే.1901 లో రాయల్ సొసైటీ ఆఫ్ లండన్‌లో బోస్ నిర్వహించిన ఒక ప్రసిద్ధ ప్రయోగం మనుషుల మాదిరిగానే మొక్కలకు కూడా భావాలు ఉన్నాయని తేలింది. ఆయన ఒక మొక్కను బ్రోమైడ్ ద్రావణాన్ని కలిగి ఉన్న పాత్రలో ఉంచాడు, ఇది విషపూరిత మైనది. తన పరికరాన్ని ఉపయోగించి, మొక్క విషానికి ఎలా స్పందిస్తుందో తెరపై చూపించాడు. తెరపై వేగంగా, కదలికను చూడగా, అది చివరికి చనిపోయింది. ఒక జంతువును విషంలో ఉంచితే ఇలాంటిదే జరిగి ఉండేది. విషం కారణంగా మొక్క చనిపోయింది. బోస్ తన ఇన్స్ట్రుమెంట్ ను క్రెస్కోగ్రాఫ్ అని పిలిచాడు. మరిన్ని ప్రయోగాలు చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది శాస్త్రవేత్తలు ఆయన కనుగొన్న వాటిని ప్రశంసించారు.
ఆవిష్కరణలపై బహిరంగ చర్చ
వ్యాపార దృష్టి ఏ మాత్రం లేని బోస్ తన పరిశోధనలను ఇతర శాస్త్రవేత్తలు వినియోగించుకుని, వాటి ఆధారంగా మరిన్ని కొత్త ఆవిష్కరణలు జరగాలనే సదుద్దేశంతో తన పరిశోధనలను బహిర్గత పరిచాడు. ప్రధానంగా తాను కనుగొన్న క్రెస్కోగ్రాఫ్ సాయంతో వివిధ పరిస్థితులలో మొక్కల స్పందనను పరి శోధనాత్మకంగా నిరూపించాడు. జంతువుల, వృక్షాల కణజాలాలలో సమాంతర పరిశోధనలు చేసి ఉపయోగ కరమైన ఫలితాలు సాధించాడు. రేడియో తరంగాలను గుర్తించడానికి ఉపయోగించే కోహెరర్ అనే పరికరాన్ని మెరుగు పరిచాడు. 1887 లో, బ్రహ్మ సమాజ్ సంస్కర్త దుర్గా మోహన్ దాస్ కుమార్తె అబాలాను వివాహం చేసుకున్నాడు. 1896 లో, రేడియో తరంగాలపై పరిశోధన చేస్తున్న గుగ్లిఎల్మో మార్కోనిని కలిశాడు.
వైర్ లెస్ టెలిగ్రాఫీ
జగదీష్ చంద్రబోస్ వైర్‌లెస్ టెలిగ్రాఫీని కనుగొన్నాడు. 1895 లో ప్రదర్శనను కూడా నిర్వహించాడు, కాని ఆయన పేటెంట్ కోసం దాఖలు చేయలేదు. మరోవైపు ఇటాలియన్ శాస్త్రవేత్త గుగ్లిఎల్మో మార్కోనీ 1897 లో బోస్ ప్రదర్శన తరువాత రెండు సంవత్సరాల అనంతరం ఇదే విధమైన ప్రదర్శన చేసాడు, కాని మార్కోని 1896 లో పేటెంట్ కోసం దాఖలు చేశాడు. కాబట్టి, బోస్ ఈ రంగంలో మార్గదర్శక పని చేసినప్పటికీ, మార్కోనీ ఈ ఆవిష్కరణకు ఘనత పొందాడు.
1937 నవంబర్ 23న తన 78వ ఏట బోస్ అవిభక్త భారతావని లోని బెంగాల్ ప్రావిన్స్ లోని నేటి జార్ఖండ్‌లోని గిరిడీలో కన్ను మూశాడు. బోస్ మరణించిన 80 సంవత్సరాల అనంతరం కూడా ఆయన చేసిన కృషి అందించిన గణనీయ సేవలు, సాధించిన ఫలితాలను ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అనునిత్యం గుర్తు చేసుకుంటునే ఉన్నారు.
(నవంబర్ 23 జగదీశ్ చంద్రబోస్ వర్థంతి)