Sunday, December 22, 2024

భారతీయ ఆత్మను పట్టుకున్న ఒబామా

  • ఒబామా ఆత్మకథ ‘ప్రామిస్డ్ ల్యాండ్’లో భారత్ విశేషాలు
  • రామాయణ, భాగవతాల నుంచి గాంధీ, మన్మోహన్ దాకా
  • భారత్ పట్ల లోతైన అవగాహన కనబరిచిన ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా రాసిన పుస్తకం ” ఏ ప్రోమిస్డ్ ల్యాండ్” మంగళవారంనాడు విడుదలైంది. ప్రపంచ దేశాలకు చదవడానికి అందుబాటులోకి వచ్చింది. ఇది తన ఆత్మకథాంశంలో భాగం. ప్రధానంగా, 2009 నుండి 2017 వరకూ అధ్యక్షుడుగా పరిపాలించిన కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినప్పటికీ, ఇందులో అనేక బాల్యస్మృతులు, భావాలు, అనుభవాలు, అనుభూతుల సారాలను పొందుపరిచినట్లుగా కనిపిస్తోంది. ఇది 768 పేజీల పెద్ద పుస్తకం. మొట్టమొదటగా ఇంగ్లీష్ లో ప్రచురించారు. సమాంతరంగా, అరబిక్ నుండి స్వీడిష్ వరకూ 24భాషల్లో అనువాదమై, ప్రచురణకు సిద్ధమైంది. బహుశా త్వరలో తెలుగు మొదలు వివిధ భారతీయ భాషల్లోనూ అనువాదమై, భారతదేశ పాఠకులకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రచురించిన పుస్తకం మొదటి భాగం మాత్రమే. సమీప కాలంలో,  రెండవ భాగం కూడా సిద్ధమై మన ముందుకు రానుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విడుదలైన పుస్తకం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫలితాలు ముగిసిన వెనువెంటనే నవంబర్ 17వ తేదీ నాడు, ఆవిష్కరణ అయ్యింది. ఈలోపే ఎంతో ప్రాచుర్యం తెచ్చుకుంది. నేటి నుండి ప్రసిద్ధికి సిద్ధమైంది. ‘నా అధ్యక్ష పదవీకాలంలో జాతిని నడిపించడంలో ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు, వివిధ జాతుల విద్వేషాల మధ్య గాయమైన హృదయాలకు సాంత్వన చేకూర్చిన వైనం, ప్రజాస్వామ్యం అందరికీ అందేలా చూడడంలో పోషించిన పాత్రల గురించి నిజాయితీగా, ఉన్నదున్నట్టుగా చెప్పాలనే సత్ సంకల్పంతో ఈ పుస్తకం రాశాను’ అని బరాక్ ఒబామా ట్విట్టర్ వేదికగా తన కవితా హృదయం, రచనా విధానం పంచుకున్నారు. ఇందులో అనేక అంశాలు, విభాగాలు ఉన్నాయి.

భారతం నుంచి రాహుల్ గాంధీ వరకూ

భారతదేశానికి సంబంధించి, భారత, రామాయణాది ఉత్కృష్ట గాథల గురించి, మహాత్మాగాంధీ మొదలు మన్ మోహన్ సింగ్ వరకూ ప్రస్తుతించారు. రాహుల్ గాంధీని కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా భారతదేశం పట్ల అనిర్వచనీయమైన గౌరవాన్ని, భక్తిని, మహాత్మాగాంధీ పట్ల అపారమైన ఆరాధనా భావాన్ని వ్యక్తం చేశారు. యావత్తు భారత్ చరిత్రపై గొప్ప గౌరవాన్ని చాటిచెప్పారు. భారతదేశ చారిత్రక పరిణామాన్ని ఒక విజయగాథగా అభివర్ణించారు. ఎన్నో  వైరుధ్యాలు, వైవిధ్యాలు, యుద్ధాలు, పోరాటాలు, ఉద్యమాలు, అవినీతి కుంభకోణాలను భారత్ ఎదుర్కొన్నప్పటికీ, ఇంకా ఎదుర్కుంటూ సాగుతున్నప్పటికీ, ప్రపంచంలో భారతదేశం ఎంతో విజయవంతమైన దేశంగానే ఒబామా చూస్తున్నారు. ఇటువంటి అనేక భావాలను ఈ పుస్తకంలో హృదయం పరచి పంచుకున్నారు.

మహాత్మాగాంధీ ప్రభావం అపారం

తన జీవితాన్ని, ఆలోచనలను ప్రభావితం చేసిన అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి నేతలు ఉన్నప్పటికీ, మహాత్మాగాంధీ తనను ప్రభావితం చేసిన తీరు శిఖరసదృశమని చెప్పుకుంటూ వచ్చారు. భారత్ పట్ల తనకు అమితమైన ఆకర్షణ కలగడానికి ప్రధానమైన కారకుడు మహాత్మాగాంధీ అంటూ తన ప్రేమను చాటుకున్నారు. గాంధీజీ అనుసరించిన సత్యనిష్ఠ, సత్యాగ్రహం, అహింసామార్గం, మతపరమైన ఐక్యత మొదలైన అంశాలు స్ఫూర్తినిచ్చి, తన  పరిపాలనను నడిపించాయని అన్నారు. ప్రతి వ్యక్తికీ సమానమైన గౌరవం దక్కుతూ, ఆర్ధిక, సామాజిక, రాజకీయ ఫలాలు అందించాలి, అనే పట్టుదలను  తనలో నింపింది గాంధీ విధానాలే అని వివరించారు.

మాటలు కాకుండా చేతలలో చూపించిన దార్శనికుడు

ఒట్టి మాటలు కాక, చేతల్లో చూపించిన గాంధీ ఆచరణా శీలాన్ని ప్రధానమైన ఆకర్షణగా ,ప్రభావితం చేసిన గొప్ప శక్తిగా ఒబామా  భావించారు. ముఖ్యంగా, ఆయన సిద్ధాంతాలకు ఆయనే పరీక్ష పెట్టుకోవడం తనని అమితంగా ఆకర్షించిన విషయంగా చెప్పుకున్నారు. అమెరికాలో నల్లజాతీయులు చేసిన స్వాతంత్ర్య పోరాటానికి గాంధీజీ అవలంబించిన పోరాట పంథాయే మార్గదర్శనం చేసిందని ఒబామా గుర్తు చేసుకున్నారు. అత్యంత తక్కువ వనరులతో ఇంతటి  బలాన్ని, స్ఫూర్తిని గాంధీ ఎక్కడ నుంచి తెచ్చుకున్నారో, నిరాశ నుంచి ఎలా కోలుకునేవారో… గాంధీజీనే అడిగి తెలుసుకోవాలనిపించింది, అయన పక్కన కూర్చొని మాట్లాడనిపించింది… అంటూ,  ముంబయిలోని గాంధీనివాసం మణిభవన్ ను సందర్శించినప్పుడు కలిగిన భావోద్వేగాలను ఈ పుస్తకంలో స్మరించుకున్నారు.

మన్మోహన్ సింగ్  ప్రస్తుతి

అదే సమయంలో,  రాహుల్ గాంధీ పట్ల  చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధైర్యం, అపరిపక్వత, అనాసక్తి కలిగిన వ్యక్తిగానే ఆయన  రాహుల్ గాంధీని చూస్తున్నారు. దీనికి భిన్నంగా  మన్ మోహన్ సింగ్ పై  ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి రాబర్ట్ గేట్స్ తో మన్ మోహన్ ను పోల్చారు. దయ, నిష్పక్షపాతం, చిత్తశుద్ధి, సమగ్రత మొదలైన సుగుణాలను మన్ మోహన్ లో బరాక్ దర్శించారు. భారత ఆర్ధిక ప్రగతికి మన్ మోహన్ చేపట్టిన సంస్కరణలే మూల చక్రాలుగా భావించారు. అవే,  దేశ సర్వోన్నత వైభవాన్ని కొత్త పుంతలు తొక్కించినట్లుగా పూర్వ ప్రధాని మన్ మోహన్ సింగ్ ను అపూర్వ ప్రధానిగా అభివర్ణించారు. అవినీతి రహిత జీవితం, అసాధారణమైన ప్రతిభ తనను మిక్కిలి ఎక్కువగా ఆకర్షించిన మన్ మోహన్ లోని విశిష్టమైన లక్షణాలుగా బరాక్ పేర్కొన్నారు.

అగ్రరాజ్యానికి అధినేతగా తొలి నల్లజాతీయుడు

అగ్రరాజ్యమైన అమెరికాకు అధ్యక్షుడైన మొట్టమొదటి ఆఫ్రికన్ సంతతికి చెందిన వ్యక్తి బరాక్ ఒబామా.అమెరికా ఖండంలో కాక, బయట జన్మించి, అమెరికాకు అధ్యక్షుడైన తొలి వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం. నల్లజాతీయుడుగా,  తెల్లవారి నేలపై అధికార పీఠం కైవసం చేసుకున్నారు. అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమేకాక, అధ్యక్షుడైన తొలినాళ్ళల్లోనే “నోబెల్ శాంతి” బహుమతిని  సొంతం చేసుకున్నారు. తన జాతి, తన నేల ఎదుర్కొన్న అవమానాలు,కష్టాలు, చేసిన పోరాటాలు,సాధించిన విజయాలు భారతదేశ స్వాతంత్ర్యపోరాటానికి దగ్గరగానూ, తెల్లవారి క్రౌర్యాన్ని చవిచూచి, ఎదిరించి, తిరిగి స్వేచ్ఛను పొందిన భూమిగానూ భారత్ పట్ల ఒబామాకు ప్రత్యేక గౌరవాన్ని  నిలిపి వుంటాయని ఈ పుస్తకం చెబుతోంది.

నరేంద్రమోదీ ఊసు లేదు : శశి థరూర్

అందుకే, స్వాతంత్ర్య  పోరాటాన్ని నడిపిన మహాత్మాగాంధీ పట్ల అనిర్వచనీయమైన ఆరాధనా భావాన్ని తెచ్చిపెట్టి ఉంటాయి.తాను చిన్ననాడు మలేషియాలో ఉన్నప్పుడు విన్న రామాయణ, మహాభారత గాథలు, అందులోని దివ్యపురుషులు భరతభూమి పట్ల  విశిష్టమైన అభిప్రాయాలను కలుగజేసి ఉంటాయి. ఈ  పుస్తకంలో ఎన్నో విషయాలు చర్చకు వచ్చి ఉంటాయి. పూర్తిగా చదివితే కానీ, సంపూర్ణంగా తెలియదు. ‘‘ఈ  పుస్తకంలో భారతదేశాన్ని, మన్ మోహన్ సింగ్ ను ప్రస్తుతించిన బరాక్,  ఎందుకో నరేంద్రమోదీని తలుచుకోలేదు, కనీసం ఆయన పేరును కూడా పేర్కొనలేదు,’’ అంటూ కాంగ్రెస్ నేత శశి థరూర్ వరుస ట్వీట్స్ చేశారు.

‘భారత్ విజయభూమి’

ప్రస్తుతం విడుదలైంది మొదటి భాగం మాత్రమే. ఇంకా రెండవ భాగం రావాల్సి వుంది. అది కూడా అందుబాటులోకి వస్తేకానీ, అనేకమంది వ్యక్తులు, విషయాల పట్ల ఒబామా ఏమన్నాడో సమగ్రంగా తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన పుస్తకంలోనూ,  ఏ ఏ వ్యాఖ్యలకు ఏఏ సందర్భాలు తావు ఇచ్చాయో ఇంకా తెలుసుకోవాల్సి వుంది. తన డెమోక్రాటిక్ పార్టీ, తను అమితంగా అభిమానించే జో బైడెన్ తాజా ఎన్నికల్లో  గొప్ప గెలుపును సొంతం చేసుకొని, ఆన్నీ కలిసివస్తే, త్వరలో అధ్యక్ష  సింహాసనాన్ని అధిరోహించబోయే సందర్భంలో,బరాక్ ఒబామా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇది గమనించాల్సిన విషయం. మిగిలిన విషయాలు ఎట్లా ఉన్నా,  భారత్ ను బరాక్ “విజయభూమి”గా అభివ్యక్తీకరించారు. తాను ఎదిగిన అమెరికాను “ఆశావహమైన లేదా ఆశాపూర్ణమైన భూమి”గా (ఏ ప్రోమిస్డ్ ల్యాండ్ ) అభివర్ణించారు. ఈ పుస్తకాన్ని ప్రఖ్యాత ” క్రౌన్” పబ్లికేషన్ ప్రచురించింది. అమెరికా, కెనడా పాఠకుల కోసం, తొలి విడతలోనే 34లక్షల కాపీలను ప్రింట్ చేసింది. మరో 25లక్షల కాపీలను అంతర్జాతీయ పాఠకుల కోసం ముద్రించనున్నట్లు సమాచారం.2011లో ఒసామా బిన్ లాడెన్ మరణం /హత్యా ఉదంతంతో ఈ పుస్తకం ముగిసింది. ఎన్నో విషయాలు, సందర్భాలను సమకాలీన తరాలు గుర్తు చేసుకోడానికి,  కొత్త తరాలు తెలుసుకోడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని భావిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles