ప్రియతమా నన్ను వదలి ఎందుకు దూరంగా వెళ్ళావు.
ఉత్తరాలు రాయడానికా!
నేరుగా మాట్లాడే ధైర్యం లేని వాళ్లే ఉత్తరాలు రాస్తారట
నీకా ధైర్యం లేకపోయిందా
అదేమంటే ఆడపిల్లను అంటావ్
మగ మహారాజునై నేను చేయగలిగిందీ లేదనుకో
వుత్తరం చివర, సంతకానికి ముందు
‘బాగున్నావా‘ అంటావు
లోకరీతికి ఎంత దూరంగా ఉన్నావో గమనించావా
నీ ఉత్తరాలు నీ మనసుకు దర్పణాలు
నీ ఆలోచనలకు ప్రతిరూపాలు
నీ అంతరంగానికి ప్రతీకలు
అనురాగ సరాగాలు
సృష్టిలోని ఆడతనం, తియ్యదనం కలబోసిన అక్షరాలు
అవును, నిజంగా అ-క్షరాలైన భావాల ప్రమాణాలు
నీ దారి నీది నా దారి నాది అన్నపుడు
మనిద్దరి దారి గోదారిలాంటిదని తెలియలా అప్పుడు
చింతాక్రాంతం కాని చింతనంతో
అవధుల్లేని అనుభూతులకు ప్రహరీలు కట్టాం
నువ్వు పుస్తకాలతో కుస్తీ పట్టావు
నేను నాలోని నీకు, రాయని ఉత్తరాలతో గడిపేశాను
కలకండ కణికల్లాంటి నీ ఉత్తరాలను
కరకరా నమిలి మింగేస్తుంటాను
ఎంత కసిగా నమిలినా తియ్యగానే ఉంటాయి
అనేక ఫ్లాష్ ఫ్రంట్ లు చూస్తూనే వుంటాను తెల్లారిందాకా
ఆలాంటి నాకు ఫ్లాష్ బ్యాక్ మాత్రం మిగిలిస్తే అన్యాయం కదా.
Also read:
Also read: మేతావులు
Also read: ఆత్మ బలం
Also read: మహర్షి
Also read: కిం కర్తవ్యం?
Also read: రాగ సాయుజ్యం