Monday, January 27, 2025

(World’s Wonderful Husbands) ప్రపంచ అద్భుత భర్తలు-4

‘‘మనసు చాలా బాధగా వుంది బావ. రక్త సంబంధీకులు పెళ్లిళ్లు చేసుకోవద్దు అంటే ఎలా బావ. నీవు పెద్ద చదువులు చదివి, ఉద్యోగం సంపాయించుకొని రమ్మంటే,  మనం పెళ్లి చేసుకోకూడదు అని చెపుతున్నావు. సంఘాలు సంఘాలు అని తిరిగి నీవు నేర్చుకున్నది ఇదా?…. నీవు నాకు ఏం చెప్పవద్దు. మనమిద్దరం పెళ్లి చేసుకుందామా ? వద్దా? ఒకే రక్త సంబంధీకుల వారు పెళ్లి చేసుకోకూడదు అని మాత్రం చెప్పకు. నీ అంత పెద్ద చదువు చదవలేదు, కానీ నేనూ చదువుకున్నాను…..’’

‘‘అక్క, బావ ఇద్దరూ రేడియోలో వస్తున్న  నాటకం వింటున్నారా?’’ అంటూ వచ్చాడు తమ్ముడు. గ్రామాలలో ఒకరిని ఒకరు పేర్లతో కాకుండా ‘వరుస కలిపి మాట్లాడుకుంటారు’. ఆ… తమ్ముడు …‘‘ప్రతీ గ్రామానికి, ప్రతీ చోటుకు రేడియో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ఎక్కడో ఒకరిద్దరి దగ్గరనో, కొన్ని గ్రామాలలో మాత్రమే ప్రభుత్వ రేడియోలు ఉండేవి అక్కా. రాను రాను ఇది పోయి రకరకాల పేర్లతో సుమారుగా 48 రేడియో స్టేషన్లు నడుస్తున్నాయి. ఇందులో కొన్ని ప్రైవేట్, మరికొన్ని ప్రభుత్వ రేడియో స్టేషన్లు నడుస్తున్నాయి. పాటలు, వార్తలు, సంభాషణలు, జోక్స్, ప్రముఖులతో ముఖా ముఖిలు, ఇలా చాలా కార్యక్రమాలు వస్తున్నాయి. ప్రజలలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు, మహిళల ఆరోగ్యానికి చెందిన విషయాలు, వారికి చట్టాలలో ఎలాంటి హక్కులున్నాయి, బాల బాలికల చదువు కోసం ప్రభుత్వం ఏం సౌకర్యాలు కల్పించారు, కల్పిస్తున్నారు … వీటి పై ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులు ఏ ఏ  కార్యక్రమాలు చేస్తున్నారో అవి అన్నీ రేడియో సాధనం తో మారుమూల గ్రామాలకు ప్రభుత్వం చేర వేస్తున్నది కదా అక్క. నియోజక వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరు ప్రజల బాగు కోసం పనిచేసేవారూ ఉన్నారు. వారి చొరవతోనే మారుమూల గ్రామాల్లోకి రేడియో సౌకర్యం వచ్చింది బావ. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీ లు ప్రజల మధ్యనే వుండి పనిచేసే వారున్నారు. అధికారులతో కూడా చేపించే వారూ ఉన్నారు. అలా చేసే వారిలో ఒక ఎమ్మెల్యే అన్నా ఉన్నారు అక్క. ఆ అన్ననే ఆ రోజుల్లో ప్రభుత్వంలో కూడా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ప్రభుత్వం అంటే అప్పుడున్నది కాంగ్రెస్ పార్టీనే. మహిళా సంఘాలను, యువజన సంఘాలను చాలా ఏర్పాటు చేపించినారు. ఇందిరా గాంధీ ప్రభుత్వం పోయి, జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కేంద్రంలో  ఈ ఎమ్మెల్యే అన్న మాటకు  చాలా విలువ ఉండేది అక్క.’’

Also read: (World’s Wonderful Husbands)ప్రపంచ అద్భుత భర్తలు-3 

‘‘జనతా ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఏదో ఘన కార్యం చేయబోతోంది అనుకుంటే ఇంకా ఎక్కువగా కుల రాజకీయాలను ప్రభావితం చేసింది బావ. మీరు చూసే ఉంటారు. వారిలో వారే తగువులు పెట్టుకొని వివిధ రాజకీయ పార్టీలుగా విడిపోయారు. 1975 నుండి 1990 వరకు భారత రాజకీయాలలో, ప్రజలలో చాలా సంస్కరణలు జరిగాయి. ముఖ్యంగా మహిళలు చదువుకోవాలి అనే నినాదం సమాజంలో ఒక విప్లవాత్మకమైన సంస్కరణకు దారి తీసింది. ఎమ్మెల్యే అన్న మాటలలో చెప్పాలంటే ‘మార్పు’  జరగలేదు, ఒట్టి సంస్కరణ మాత్రమే జరిగింది. మహిళలకు 18 ఏళ్లు పురుషులకు 21 ఏళ్లు వివాహానికి నిర్ణయం చేసినప్పటికీ  బాల్య వివాహాలు జరిగాయి, జరుగుతున్నాయి. వరకట్నం కోసం మహిళలను వేధించటం, హత్యలు చేయటాలు బాగా పెరిగిపోయాయి. వామపక్ష పార్టీలకు చెందిన మహిళా సంఘాలు, విప్లవ పార్టీల అనుబంధ మహిళా సంఘాలు, స్త్రీ వాద సాహిత్యం, అస్తిత్వ సాహిత్యం,  కులం – మతం సాహిత్యం ప్రజలపై, ప్రజలను ముఖ్యంగా మహిళలను, బాల బాలికల ను “టార్గెట్” చేసి వచ్చినవే ఎక్కువ అక్క. వీటి మధ్య మహిళలు ఉక్కిరబిక్కిరైనారు. ఎందుకంటే మహిళలు చదువు కోసం మాత్రమే బయటకు వచ్చేవారు.  ఉద్యోగం కోసం బయటకు వచ్చే వారు.  వారికున్న కొంచెం సమయంలో  వీటినన్నింటిని ఎలా ఆకళింపు చేసుకోవాలినో తెలియక పోవటం, లేట్ గా ఇళ్లకు చేరితే .. అమ్మాయిల చదువులు మానిపించిన తల్లి తండ్రులు, అమ్మాయిల తల వెంట్రుకలను ఒకవైపే కొరిగి ఇళ్ళల్లో బంధించిన తండ్రులు.. ఇలా చాలా సంఘటనలు మహిళలు చదువు కోసం ఏదురుకొన్నారు బావ. వరకట్నం చావులు ఒక రేంజిలో జరిగాయి. అనుమానంతో భర్తల ఆగ్రహానికి గురైన వివాహితులు ఒక వైపు, కులాంతర – మతాంతర వివాహాలు చేసుకున్న కుటుంబాలు వివక్ష కు గురైనవి కోకొల్లలు అక్క.’’ 

‘‘కులాంతర – మతాంతర వివా హాలు చేసుకున్న వ్యక్తులు, వారి కుటుంబాలు సమాజంలో వివక్ష కు గురైనాయి. కులాంతర – మతాంతర వివాహాలు చేసుకున్న వ్యక్తులు వారి వారి  కుటుంబాలకు దురమైనారు. సమాజంలో సంస్కరణలు రావటం కొంత బాగున్నా … సమూలంగా ‘మార్పుకు’  సమాజం గురికాలేదు. అందుకే భారత సమాజంకు “సంస్కరణలు” దుష్ప్రభావాలు కలిగించింది అంటాడు ఎమ్మెల్యే అన్నా. అస్తిత్వ ఉద్యమాలు కూడా సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చాయి అంటాడు బావా ఎమ్మెల్యే అన్న. తాను నిర్మాణం చేసిన మహిళా సంఘాల గురించి … మహిళలు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు అంటే కొత్త ప్రపంచాన్ని చదవాలి అంటాడు, సంఘాల ప్రతినిధులు సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి అంటాడు, భర్తలు, తండ్రీ కొడుకులు,  లేకపోతే ఇంకెవ్వరి కోసమో పనిచేసినట్లు ఉండకూడదు అంటాడు.  మానవ సమాజం నిర్మాణం జరిగినప్పటి నుండీ వారికి తెలియకుండానే మహిళలు అణచివేతకు, వివక్షతకు గురి అయ్యారు, అవుతూనే ఉన్నారు అంటాడు. ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంస్కరణలు … మహిళలను విపరీతంగా ప్రభావితం చేశాయి,  అందుకే వివాహాలు సప్తపతి తోనే కాకుండా వివిధ పద్ధతులలో చేసుకోవచ్చు అని సవరించారు అని ఈ విషయాన్ని ఎమ్మెల్యే అన్న ప్రతీ సమావేశంలో చెపుతారు. అందులో ముఖ్యంగా ” దండల మార్పిడి (పూలతో అలంకరించిన దండలు)” తో ఒకరి మెడలో ఒకరు వేసి వివాహం చేసుకునే పద్దతిలో ఎమ్మెల్యే అన్నా 100-200 పెళ్లిళ్లు చేసి ఉంటారు. ఇంకొందరికి the great Feminist women Leader Malladi Subbamma గారి ద్వారా అన్న చేపించారు. అయితే పెళ్లితో కులం, మతం ప్రజల దిమాకులలో నుండి బయటకి వెల్లుతది, కుల మత తగాదాలు ఉండవు  అనుకోవటం ఒక గొప్ప భ్రమ అని అన్న అంటాడు. సంస్కరణ, సంస్కరించటం అనేది ‘ మూలం లో ఉన్న సమస్యను అధిగమించదు, ప్యాచప్ చేస్తుంది. చిరిగిన దుస్తులను కుడితే అతుకుతో ఆ చీరుగును  కొన్ని రోజులు మూయవచ్చు, శాశ్వతంగా చిరుగును తీసివెయ్యలేము అంటాడు ఎమ్మెల్యే అన్న. అలానే కులాంతర – మతాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలు శాశ్వత పరిష్కారం కాదు. ప్రజలందరిలో ఒక “కట్టుబాటు” ను తీసుక రావాలి అంటాడు. ఎక్కడా కుల- మతాల ప్రసక్తి తీసుక రాకుండా అని….. ఎమ్మెల్యే అన్న,  అన్న కూతురు ఊరిలోనే ఉన్న ఓ వ్యక్తి తో ప్రేమలో పడింది. తండ్రికి తెలిసి కూతురును బాగా కొట్టాడు. ప్రేమించిన వ్యక్తిని పిలిపించి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ప్రేమించిన వ్యక్తి వూరు వదిలి వెళ్ళిపోయాడు. తండ్రి వేరే సంబంధం చూసి కూతురికి పెళ్లి చేశాడు. దీనికి కారణం పెద్దకుమారుడి మాటలకు తండ్రి ప్రభావితం కావడం. చిన్న కొడుకు అక్కకు సపోర్ట్ గా నిలబడుతాడు. తండ్రిని బాబా  అని సంబోధిస్తాడు, బాబాయి అదే ఎమ్మెల్యే అన్న అడుగు జాడల్లో నడుస్తాడు.

Also read: (World Wonderful Husbands) ప్రపంచ అద్భుత భర్తలు-2

చిన్న కొడుకు తండ్రితో అంటాడు… “బాబా అన్న చెప్పే మాటలను పూర్తిగా అమలు చేయకు. మీరు చూసిన సమాజంను… ఇప్పుడు మేము చూసే ఈ సమాజం మీ జీవితం మధ్యలో నుండి మాత్రమే చూడటం మొదలయ్యింది, మీ అనుభవాలు మాకు అవసరం అంటాడు. చిన్న కొడుకు ఇంకా ఏం చెబుతాడు అంటే …  NTR  రాజకీయాలలోకి రాక ముందు ప్రజలకు “రాజకీయాలు” అంటే ఏంటో తెలియదు, ఒకవేళ తెలిసినా ఇందిరమ్మ రాజకీయాలు, కాంగ్రెస్ గురించి తెలుసు. మహిళలకు తండ్రి ఆస్తిలో హక్కు కల్పించడం NTR చేసారు అని ప్రజలు అనుకుంటారు. అంతకు ముందు నుండే మహిళలకు ఆస్తిలో హక్కు  కల్పించడం జరిగింది. ఈ విషయం చాలా వరకు ఎవ్వరికీ తెలియదు.  బాబాయి వివాహం నీవు దగ్గరుండి పెండ్లి కూతురు ను చూసి పెళ్లి చేసావు. బాబాయి ఎమ్మెల్యే అయినప్పటికీ సమాజ సేవ అని ఊర్లు పట్టుక తిరుగుతున్నాడు అని ముగ్గురు పిల్లలను తీసుకొని చిన్నమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది. మీరు  చిన్నమ్మను తిరిగి ఇంటికి రమ్మని చాలా బతిమిలాడారు. ఒకే కులానికి చెందినదే కదా చిన్నమ్మ, మీరు వెళ్లి బ్రతిమిలాడినా ఎందుకు తిరిగి రాలేదు? బాబాయ నడుస్తున్న జీవితం వేరు, చిన్నమ్మ కోరుకున్న జీవితం వేరు. అలానే అక్క కోరుకున్న జీవితం వేరు. అమ్మ గురించి ఇక్కడ ఒక మాట చెపుతాను…  అమ్మకు మీరు ఎంత చెపితే అంతే, తిరిగి ఎప్పుడూ ఏదీ అడగదు, ఎదురు చెప్పదు. అమ్మ మిమ్మల్ని అర్థం చేసుకున్నదా? లేదా ? అనేది మీకూ తెలియదు. ఇక్కడ కులం ప్రధానం కాదు. బ్రతుకు ప్రధానం. అన్న చూసే జీవితం, కులం – డబ్బు తో బేరీజు వేసేది. అక్కను బావ అదనపు కట్నం కోసం ఎంత వేధిస్తున్నాడు. మీరు మొత్తం ఆస్తి బావకు రాసి ఇచ్చినా అక్కను వేధించటం మానడు. అక్కను బావ చంపేసినా మనం ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే  బాబాయి అక్కను చూసేటందుకు బావ ఇంటికి వెళ్లారు. బావ చాలా దురుసుగా ప్రవర్తించారని తెలిసింది. అక్క మొఖం చూసి నిశబ్ధంగా వచ్చేసాడు.’’

చిన్న కొడుకు ఇంకా తండ్రితో …. ‘‘పోలీస్ స్టేషన్లో బావపై ఫిర్యాదు చేసి వచ్చాను. మీరూ,  అన్న … అక్క పెద్ద నేరం చేసినట్లు భావిస్తున్నారు. అక్కడనేమో అక్క చావుబతుకుల మధ్య వుంది. పోలీసులు తండ్రి ఫిర్యాదు చేస్తే బలంగా వుంటది, తమ్ముడిది అంత బలంగా ఉండదు అన్నారు. బాబాయి మీకు నచ్చ చెప్పాలని ప్రయత్నించారు. చిన్నమ్మ వెళ్ళిపోవడానికి బాబాయినే కారణం అని మీలో బలంగా అభిప్రాయం వుంది, అందుకే మీతో చెప్పలేక పోతున్నారు. బాబాయి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మీరు పోలీస్ స్టేషన్ కు వస్తె అక్కను బావ చంప కుండా కాపాడుకుంటాము బాబా. పోలీసులు బావ ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వుంది అంటా. ఇంటి చుట్టు పక్కల వారితో పోలీసులు విచారిస్తే ” మధ్య రాత్రి ఏదో మూటను కారు డిక్కీలో పెట్టటం చూసాము” అని చెప్పారట, ఉదయం నుంచి ఇంటికి తాళం వుంది ఏటు వెళ్లారో తెలియదు అని చెపుతున్నారు అని పోలీసులు అంటున్నారు.’’ ఇంకా చిన్న కొడుకు ఈ విధంగా తండ్రి తో చెపుతాడు బావ…

బాబాయి  ఏం తప్పూ చేయలేదు బాబా. బావ చదువుకొనే రోజుల్లో, సహా విద్యార్థిని నీ  ‘ గాంధర్వ వివాహం’ చేసుకున్నారు.  ఆ అమ్మాయి వేరే మతస్తురాలు. ఆ అమ్మాయి  బావను నమ్మింది. అందరికీ తెలిసే విధంగా, తల్లి తండ్రులు సమక్షంలో గ్రాండ్ గా మళ్లీ పెళ్లి చేసుకుందామని చెప్పి ఆ అమ్మాయిని బావ మోసం చేశాడు. బావ మొఖం చాటేసి సొంతూరు వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి బావను వెతుక్కుంటూ వచ్చి బాబాయిని కలిసింది. తనకు జరిగిన అన్యాయంను చెప్పుకుంది. బాబాయి ఎమ్మెల్యే కదా ఆ అమ్మాయిని తీసుకొని బావ ఇంటికి వెళ్ళాడు. బావకు వార్నింగ్ ఇచ్చాడు. ఆ అమ్మాయి ఎవ్వరో తెలియదు అని బుకాయించాడు. మొత్తం ఆధారాలతో వచ్చి కట కటాలలోకి పంపుతాను అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని పట్నం వెళ్లిపోయారు బాబాయి. మహిళల కోసం, మహిళల రక్షణ కోసం,  వరకట్నం అరికట్టేటందుకు ఒక  ప్రత్యేక చట్టం కావాలని  పట్నంలో వరకట్నం బాధితులతో మహిళా సంఘాల ప్రతనిధులు హర్తాల్లు చేస్తుండిరీ, ఆ అమ్మాయిని ఆ మహిళా సంఘాల ప్రతినిధులకు అప్పచెప్పి, వారి కార్యక్రమాలకు సహాయం చేస్తూ బాబాయి వుండిపోయారు. బాబాయి  తిరిగి వచ్చేసరికి మీరు అక్క పెళ్లి జరిపించారు. బాబాయి అక్క భర్తను చూసి ఖంగు తిన్నారు. పట్నంలోనేమో ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం, మోసం పై బావకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం బాబాయి చేపిస్తున్నారు. బాబాయి  పై బావ కు ఒక వైపు కోపం, మరో వైపు బావ ఆశించినంతగా మీరు కట్నం ఇవ్వలేదు కాబట్టి అక్కతో బావకు అవసరం లేదు, పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యక్తి భార్యను మంచి ఉద్దేశ్యంతో ఏలుకుంటాడ? అలాంటి వారు  భార్యను అనుమానంతో వేదిస్తూనే ఉంటారు. బాబాయి బావతో అదే అన్నాడు. పోలీసులకు బావ గురించి తెలిసిన విషయాలు  మొత్తం పోలీసులకు వివరించినా పోలీసులు నమ్మలేదు. పోలీసుల ఆలస్య స్పందనకు, మీ తొందరపాటుకు, అన్న కోపానికి  అక్క జీవితం బలి అయ్యింది.

ఇంకా ఆ చిన్న కొడుకు ఇలా చెప్పాడు… ‘‘బాబాయి ఇచ్చిన స్ఫూర్తికి పట్నంలో ఆ అమ్మాయి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నది. బాబాయి  పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. బాబాయి  పట్నం వెళ్ళాలి, ఆ అమ్మాయి బాబాయి ఇచ్చే దిశానిర్దేశం కోసం ఎదురుచూస్తుంది. మహిళా సంఘాల నేతలు కూడా బాబాయి కోసం ఎదురుచూస్తున్నారు. అక్కను మూటగా కట్టి డిక్కీలో వేసుకొని మొత్తం కుటుంబం పారిపోయింది. అక్కను చంపేసి ఉంటారు. మీరు పోలీస్ స్టేషన్ కు వస్తె బాబాయి అన్నీ చూసుకుంటారు. బాబాయి ఒక్క ఎమ్మెల్యే నే కాదు బాబా,  ఉద్యమాల నేత, ఒక సమూహం. మనం కూడా బాబాయి చెప్పే మాట విందాము. కులం కాదు, మతం కాదు, డబ్బు కాదు మనిషిలో మానవత్వాన్ని నింపే వాళ్ళు ఈ సమాజానికి కావాలి. మన బాబాయి  ఆపని చేయగలరు. బావ లాంటి వాళ్ళను ఏరిపారేయొచ్చు, ప్లీజ్ బాబ పోలీస్ స్టేషన్ వెళ్దాము….’’

తండ్రి వెళ్ళాడా పోలీస్ స్టేషన్ కు తమ్ముడూ…

వెళ్లారు అక్క. అయితే కార్ ప్రమాదానికి గురై కూతురు చనిపోయింది అని పోలీసులు చెప్పారు. కారులో ఉన్న 5 లో ఒక్కరు చనిపోయారు, మిగతా 4 ప్రమాదం నుండి బయటపడ్డారు  అని పోలీసుల విచారణలో తేలింది… కూతురిని తామే స్వయంగా చంపుకున్నామని తల్లీ తండ్రి ల రోదన పోలీసులకు పట్టలేదు…

నిరాహార దీక్ష చేస్తున్న అమ్మాయి కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. అతనికి రెండవ పెళ్ళి చేయాలని అతని తల్లీ తండ్రి ‘ పొందిక కల అమ్మాయి కోసం వెతుకుతున్నారు’….

…. అజీబ

Also read: World Wonderful Husbands (ప్రపంచ అద్భుత భర్తలు) -1

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles