పోలవరం ప్రాజెక్టు (పాత చిత్రం)
- స్పిల్ వే ఛానల్ లో కాంక్రీట్ పనులు ప్రారంభం
- కొనసాగుతున్న గేట్ల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. పోలవరం స్పిల్ ఛానెల్లో మళ్లీ కాంక్రీట్ పనులు మొదలయ్యాయి. 2020 జూలైలో సంభవించిన వరదలతో స్పిల్ ఛానెల్ మట్టి, కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. సుమారు 3 టీఎంసీలకు పైగా వరదనీరు నిలిచిపోయింది. అయితే, 2020 నవంబర్ 20 నుంచి వరదనీటిని బయటకు పంపేందుకు దాదాపు 70 భారీ పంపులను ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ నిర్మిస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ గత ఏడాది నవంబర్ నుంచి భారీ పంపుల ద్వారా నీటిని తోడిపోసింది. ఇప్పటికే రెండున్నర టీఎంసీల వరద నీటిని గోదావరి లోకి పంప్ చేసింది. . నీటిని తొలగించిన చోట మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను ప్రారంభించారు. నిర్మాణ సంస్థ. ఇక, ఇవాళ స్పిల్ ఛానెల్లో కాంక్రీటు పనులతో పాటు మట్టి తవ్వకం, అంతర్గత రహదారుల నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఇప్పటి వరకు 1,10,033 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి అయింది. స్పిల్ ఛానెల్లో 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేశారు. మిగిలిన మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు త్వరగా పనులను పూర్తిచేసేందుకు నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి కాంక్రీట్ పనులు పూర్తయితే స్పిల్ ఛానల్ నిర్మాణం పూర్తయినట్లేనని భావిస్తున్నారు. మిగతా పనులను డిసెంబర్ కల్లా పూర్తి చేస్తే ప్రాజెక్టు పూర్తయినట్లేనని భావిస్తున్నారు.
ఇది చదవండి: ముమ్మరంగా పోలవరం పనులు-సీఎం జగన్
కొనసాగుతున్న గేట్ల ఏర్పాటు
ఇప్పటికే ప్రాజెక్టులో అత్యంత కీలకమైన గేట్ల ఏర్పాటు ప్రక్రియ ఓ వైపు కొనసాగుతుండగానే మరోవైపు స్పిల్ ఛానెల్ లో కాంక్రీట్ పనులను అధికారులు మొదలు పెట్టారు. ప్రాజెక్టు స్పిల్ ఛానల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి కాంక్రీట్ పనులు ఫ్రారంభించారు. కార్యక్రమంలో పలువురు జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం 55 మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో డిసెంబరు 18న గేట్ల ఏర్పాటు పనులను ప్రారంభించారు. ప్రాజెక్టుకు ఏర్పాటు చేస్తున్న ఒక్కో గేటు బరువు 300 టన్నులు ఉంటుంది. మొత్తం గేట్లకు 18 వేల టన్నుల స్టీలును ఉపయోగిస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు పైకి ఎత్తడానికి, కిందకు దించడానికి వరదనీటిని విడుదల చేయడానికి హైడ్రాలిక్ పద్దతిని వినియోగిస్తున్నారు. గేట్ల ఏర్పాటుకు అవసరమైన 98 సిలిండర్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు.
2022 ఖరీఫ్ లక్ష్యంగా పనులు
వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారార నీరు అందించాలని జగన్ ప్రభుత్వం లక్ష్యంగాపెట్టుకుంది. అందుకు తగ్గట్టుగా అన్ని శాఖలను సమన్వయపరుస్తూ పోలవరం పనులను వేగవంతం చేయాలని సీఎం గతంలోనే అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే పనులు పూర్తి చేస్తామని ప్రాజెక్టు అధికారులు సీఎంకు హామీ ఇచ్చారు.
ఇది చదవండి: పోలవరంపై కేంద్ర జలశక్తి మంత్రితో బుగ్గన, అనిల్ చర్చలు