అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి స్త్రీలందరికీ హక్కు ఉన్నదంటూ సుప్రీంకోర్టు గురువారంనాడు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. వివాహిత మహిళలకు ఉన్న హక్కే అవివాహిత మహిళలకు ఉన్నదని నిర్ణయించడం ఒకానొకి విప్లవాత్మక నిర్ణయం. ఈ విషయంలో ప్రవృద్ద పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలకంటే మనం పురోగామి మార్గంలో ఉన్నామని ఈ తీర్పు స్పష్టం చేసింది. వివాహితలకు మాత్రమే ఉన్న గర్భస్రావ్యం హక్కును అవివాహితలకీ, భర్తలేనివారికీ కూడా వర్తింపజేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మహిళ శరీరంపైన పురుషులు అధికారం చెలాయించే పురుషాధిక్య సమాజం రాజ్యమేలుతున్న ఇండియాలో ఇటువంటి తీర్పు రావడం స్వాగతించవలసిన పరిణామం. మహిళ సమానత్వ హక్కునూ, తన శరీరంపైన తన అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం ధ్రువీకరించింది.
అమెరికాలో సైతం ‘రో వర్సెస్ వేడ్’ కేసులో ఇచ్చిన పురోగామి తీర్పును ఇటీవల తిరగతోడి మహిళలకు అబార్షన్ చేసుకునే హక్కును తొలగించారు. ఇందుకు భిన్నంగా జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, ఏఎస్ బొపన్నలతో కూడిన బెంచి మహిళకు తన శరీరంపైనా, పిల్లల్ని కనాలా వద్దా అని నిర్ణయించుకోవడంపైనా సర్వహక్కులూ ఉన్నాయని తీర్పు ఇచ్చింది. గర్భం వచ్చిన తర్వాత 24 వారాల లోపు గర్భస్రావం చేయించుకోవచ్చునని చెప్పింది. 1971లో చేసిన ‘మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నేన్సీ’ చట్టం ప్రకారం వివాహిత మహిళలకే గర్భస్రావ్యం చేయించుకునే హక్కు ఉంది. 2021లో ఈ చట్టాన్ని సవరించారు. కొన్ని మార్పులు చేశారు. గర్భనిరోధక ప్రయత్నం విఫలమైన పక్షంలో గర్భస్రావం చేయించుకోవచ్చునన్నది వాటిలో ఒకటి. ‘‘పునరుత్పత్తి శారీరక వ్యవస్థపైన హక్కులూ, వివాహితకు ఉండే దర్పం, ఆంతరంగిక భద్రత అవివాహితలకు కూడా ఉండాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అయితే, ఈ ఆదేశాన్ని అమలు చేసే క్రమంలో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్టుకు 2021లో చేసిన సవరణకు లోబడి ఉండాలని సుప్రీంకోర్టుబెంచి షరతు విధించింది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయడానికి వీలుగా చట్టాలను సవరించే బాధ్యత పార్లమెంటు స్వీకరించాలి.
మహిళల స్వేచ్ఛాస్వాతంత్ర్యం అభిలషించేవారంతా ఈ తీర్పును స్వాగతిస్తారు. వివాహం, వివాహానికి పూర్వం, అత్యాచార ఘటనలు, వివాహితను భర్త బలవంతం చేయడం (మేరిటల్ రేప్) వంటి అన్ని ఘటనలనూ సుప్రీంకోర్టు బెంచి చర్చించింది. అయితే, సమాజంలో స్త్రీలను సమానస్కంధులుగా గుర్తించి గౌరవించాలనే ఎరుక, స్పృహ పురుషులలో లేకపోయినంతకాలం న్యాయస్థానాల తీర్పులు కానీ పార్లమెంటు చేసే చట్టాలు కానీ పని చేయవు. అంతిమంగా మగవాడు (అతడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, ప్రియుడు కావచ్చు) అంగీకరిస్తేనే అబార్షన్ చేయించుకోవడానికి మహిళ సాహసిస్తుంది. అప్పుడే ఆమెకు సమాజంలో గౌరవం ఉంటుంది. 24 వారాలలో లింగనిర్థారణ సాధ్యం అయిన పక్షంలో ఆడపిల్ల పుట్టకుండా చేయడానికి భార్యలపై భర్తలే అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి పెట్టే ప్రమాదం ఉంది. మరో విషయం ఏమంటే అవివాహిత విషయంలో గర్భం ధరించినట్టు తెలుసుకొని నిర్ధారించుకోవడానికి మూడు, నాలుగు నెలలు పడుతుంది. వెంటనే అబార్షన్ కు ఏర్పాట్లు చేసుకోవడం కష్టం కావచ్చు.
దేశంలో అనాథలు పెరగడానికి ఇంతవరకూ గర్భస్రావంపైన ఉన్న ఆంక్షలు ఒక కారణం. అవివాహితలు పిల్లల్నికంటే సమాజం సమ్మతించదేమోనన్న భయం మరో కారణం. ఈ తీర్పు మహిళకు సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రసాదిస్తుంది. రాజ్యాంగంలోని 14వ అధికరణ ప్రకారం అందరికీ అన్ని రకాల స్వేచ్ఛలూ ఉండాలన్న రాజ్యంగ ధర్మాసనం తీర్పు సమాజానికి శిరోధార్యం కావాలి. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేసే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. దానిని నిరోధించే బాధ్యత సమాజం, కుటుంబ వ్యవస్థ, ఆరోగ్యరక్షణ వంటి అంశాలది. గర్భం ధరించిన తర్వాత భర్తను కోల్పోయిన మహిళలు ఉంటారు. విడాకులు పొందిన వారూ ఉంటారు. గర్భస్రావం చట్టబద్ధం కాని రోజులలో అర్హులైన వైద్యులు చట్టాన్ని చూపించి సహకరించేందుకు నిరాకరించిన పరిస్థితుల్లో అవివాహిత యువకులు గర్బం తీయించుకునేందుకు అనర్హులైన నాటువైద్యులపై ఆధారపడి ప్రాణాలమీదికి తెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అటువంటి ప్రమాదం ఇకమీదట ఉండదు -పార్లమెంటు కొత్త చట్టాలను చేయడమో, పాత చట్టాలను సవరించడమో చేస్తే.