చరిత్రకు చావేలేదు
శూన్య ఫలకాలపై విరుద్ధ భావనా లేపనాలై
పులుముకొనే ఉంటుందది.
మలయ పవనాలతో వచ్చి
పచ్చి వీడని పాత ప్రేమలేఖలను వినిపిస్తుంది.
సుడి గాలులతో చేరి
చెరిగిన జీవిత పత్రాలను
చెమ్మగిల్లిన కంటి రెప్పల సవ్వడులను
తెచ్చి నీ గుండె ముందు పోగేస్తుంది.
వడ గాల్పులు వీచినపుడు
నీ పెదవులపై రెండు వేడి చుక్కలు రాల్ల్చి పలుకరిస్తుంది,
నీకు కాస్త తెలుస్తుంది,
కాసింత ఊహించుకొంటావు,
వికృత దరహాసంతో
కావలసినంత కల్పించుకొంటావు!
గోల్డ్ రిమ్ అద్దాల వెనుక కళ్ళు మిటకరిస్తూ,
చేతులు ఊపుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచేస్తావు,
పుస్తకాలు రాస్తావు…
నువ్వు, నీ మిత్రులు మీ ‘మార్క్స్‘ చూపెడితే
ఇంకొందరు మీపై ‘తామర‘ తుంపరగా
‘ఖండన‘ కావ్యాలు రాస్తారు
అదేం విచిత్రమో…
గాలి సోకిన నీవు నిశ్చలంగా నిలిచి
నీకు తోచిన నిశబ్ద ధ్వని చేసి
నిమ్మళంగా నవ్వుకొంటావు.
ఏ చెడు గాలి సోకని సామాన్య జనులు
అర్థలో, అర్థలో, అర్థలో అర్థ సత్యం కూడా కాని
ఆ అనర్థ చరిత్ర చదివి
సగం అర్థం అయ్యి సగం అర్థం కాక
కాకపుట్టి కాకుల్లా అరుచుకొంటూ,
పిచ్చికుక్కల్లా కొట్టుకొంటారు.
Also read: యుద్ధం
Also read: ఎవ్వడు వాడు
Also read: తమ్ముడు
Also read: కోడి
Also read: బొమ్మలు