Sunday, December 22, 2024

ధర్మపురి నరసింహుడి ఆలయంలో అపచారం

  • అధికారుల అత్యుత్సాహం
  • పచ్చని వేప చెట్టు నరికివేత
  • హరితహారానికి తూట్లు పొడుస్తున్న అధికారులు
  • అనుమతి ఇచ్చింది ? అమలు చేసింది ఎవరు ?

హరితహారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన కార్యక్రమం.జల్లాల్లో వందల సంఖ్యలో నర్సరీలు పెంచుతూ లక్షల్లో మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సాక్షాత్తూ అధికారులే తూట్లు పొడుస్తున్నారు. దశాబ్దాలుగా పచ్చగా అలరారుతూ ఉన్న చెట్టును కుంటి సాకులు చెపుతూ నరికివేస్తుంటే కేసీఆర్ చేపట్టిన హరిత హారం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతోందని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో దాదాపు 40  సంవత్సరాల నుంచి ఉన్న పచ్చని వేప చెట్టును ఆలయ అధికారులు కారణం లేకుండా తెగ నరికి కూకటివేళ్లతో  తొలగించారు. అంతేకాదు కలపను కూడా ఆఘమేగాల మీద అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఆ పచ్చని చెట్టుకు మాటలు వచ్చి ఉంటే ఆ చెట్టు  పెట్టే శాపనార్థాలు, కన్నీటి రోదన, వేదనలకు తెగనరికిన వారికి తగిన శాస్తి జరిగి శిక్ష పడేది కావచ్చు అని భక్తజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ధర్మపురి తో పి.వి.అనుబంధం

గోదావరి  నదీతీరంలో సనాతన సాంప్రదాయ పద్ధతిలో పూజలు, నిత్యం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల ఘోషలతో వేలాది మంది భక్తజనం రాకపోకలు కొనసాగించే శ్రీ లక్ష్మీనరసింహస్వామి  ఆలయ ప్రాంగణంలో దాదాపు గత నలభై సంవత్సరాలుగా వేప చెట్టు ఏపుగా ఎదిగి పచ్చని ఆకులతో కళకళలాడుతుంది.   భక్తులకు గాని, స్వామివారి ఉత్సవ, ఊరేగింపుల, సందర్భాల్లో కాని ఆ చెట్టు వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా ఓ మూలన ఉంది. సమయం, సందర్భం, కారణాలు ఏమిటో తెలియదు గానీ  ఆ చెట్టును మాత్రం ఆలయ అధికారులు నరికేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు, ఆలయానికి సంబంధించిన వాస్తు నిపుణులు, వేద శాస్త్ర పండితులు ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించలేదు.  చెట్టును తొలగించాలని ఆదేశాలు ఇచ్చినట్టు అధికారికంగా ఉత్తర్వులు లేవు  అయినా ఆ చెట్టును నరకడానికి అటవీశాఖ వారు,  దేవాదాయశాఖ కమిషనర్ గాని ఉత్తర్వులు  జారీ చేసిన సమాచారం లేదు పోనీ ఆ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అంటే ఆ స్థలం కేవలం నాలుగు అడుగుల పరిధిలో విస్తరించి ఉంది. దాదాపు 10 నుంచి 15 మీటర్ల ఎత్తు గా పెరిగి పై భాగంలోనే కొమ్మలు రెమ్మలు విస్తరించి ఉంది. నాలుగడుగుల స్థలంలో ఉన్న చెట్టును నరికి ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టలేం. ఇలాంటి స్థలంలో ఏం చేస్తారు ? అంతుపట్టని విషయం అంటూ భక్తులు తర్జన భర్జనపడుతున్నారు. చెట్టు కు సంబంధించిన  కలప వేలం వేశారా ? మరో చోటికి తరలించారా ? అనే విషయం  పై ఆలయ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. అయితే చెట్టు నరకడానికి ఖర్చయిన దాదాపు 10 వేల రూపాయలు ఆలయ ఖజానా నుంచి ఖర్చు చేశారని, ఆ కలపను విక్రయించగా ఎనిమిది వేల రూపాయలు ఆదాయం ఆలయానికి వచ్చిందని కేవలం  రూ.2000 ఖర్చుతోనే చెట్టు కొట్టినట్టు ఆలయ అధికారులు సంబరపడుతున్నట్లు తెలిసింది.

Also Read: ధర్మపురిలో వెల్లివిరుస్తున్న మతసామరస్యం

సీఎం ఇష్ట దైవం ధర్మపురి నరసింహుడు!

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు శ్రీ లక్ష్మీనరసింహస్వామి పట్ల ఎనలేని భక్తి విశ్వాసం ఇష్టదైవం. 2003 గోదావరి పుష్కరాలలో  అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పై ఈ క్షేత్రం పట్ల ఎందుకు వివక్షత ప్రదర్శిస్తున్నారు అంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. గోదావరి పుష్కరాలు అంటే ఆంధ్రా లోని రాజమండ్రి తీరం కాదు బాసర, ధర్మపురి, మంథని కాళేశ్వరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయంటూ ఇక్కడ పుష్కర ఏర్పాట్లకు నిధులు కేటాయించాలంటూ పలు ఆరోపణలు చేస్తూ లక్షలాది రూపాయలు వ్యయంతో ఇక్కడ పన్నెండు రోజులపాటు పుష్కర యాగాన్ని నాడు కేసీఆర్ చేసి ఉద్యమ వేడిని  రగిలించారు. రానున్న పుష్కరాలు స్వరాష్ట్రం లోనే జరుపుకుంటాం. నేను ఇక్కడ గోదావరి  నది లో తొలి పుష్కర స్నానం చేసి స్వామిని దర్శించుకుంటా అంటూ నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని  శాపనార్ధాలు పెట్టి కెసిఆర్ శపథం చేశారు. 2015 గోదావరి పుష్కరాల లో కెసిఆర్  సీఎం హోదాలో ధర్మపురి గోదావరి నదిలో పుష్కర స్నానం చేసి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. 2003లో ఆయనకు గోదావరి పుష్కర స్నాన సంకల్పం చెప్పిన వేద పండితులు రమేష్ శర్మ కు బంగారు కడియాన్ని బహూకరించడం తో పాటు ధర్మపురి  క్షేత్రానికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించి యాత్రికుల సౌకర్యార్థం ఏర్పాట్లను ఘనంగా చేశారు. రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 2019 ఆగస్టు మాసంలో ఆయన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ఆలయ అభివృద్ధితోపాటు ధర్మపురి క్షేత్ర అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులను కేటాయించారు. ఇంతటి ఘన చరిత్ర తెలిసి కూడా ఆలయ అధికారులు   ఇష్టానుసారం వేప చెట్టును తెగ నరకడం భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసింహాలయంలో  అన్నదానం కోసం వేచి ఉండే భక్తులకు క్యూ లైన్ షెడ్డు వేయడం కోసం ఈ చెట్టును తొలగించినట్టు అధికారులు తెలిపారు.

ఇది ఇలా ఉండగా ఈ ఆలయ అనుబంధ శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో   రెండు వేప చెట్లు, మేడి , బిల్వ చెట్ల ను దేవాలయం వారు తెగనరికే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. కారణం రామలింగేశ్వర ఆలయంలో హోమ శాల  వద్ద మంటప నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాటికి అడ్డు వస్తుందని, లేక రామలింగేశ్వరాలయం వంటగది ముందున్న చెట్టు , ఆలయ ప్రాంగణంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా రథం తిరగడానికి అనుకూలంగా ఉంటుంది  అని కాబోలు ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్టు చర్చ నెలకొంది. శివాలయంలోని చెట్ల తొలగింపు యత్నాలకు ఈ అంశాలు బలం చేకూరుస్తునట్టు సమాచారం.

Also Read: సమరయోధులను రక్షించిన ‘బల్లఈత’

“కోటి వృక్ష అర్చన” బూడిదలో పోసిన పన్నీరు ?

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 17 ఫిబ్రవరి న కోటి వృక్ష కార్యక్రమాన్ని విజయవంతం కోసం గత పది రోజులుగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేస్తున్న శ్రమ బూడిదలో పోసిన పన్నీరు గా మారిందనే  చర్చ సాగుతోంది. ఫిబ్రవరి 17  బుధవారం రోజున  ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలతోపాటు తెలంగాణలోని ప్రతి ఒక్కరు ఒక గంటలో కోటి మొక్కలు నాటాలని సంకల్పం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, ప్రతి గ్రామంలో  నర్సరీ ఏర్పాట్లు, ప్రతి గ్రామ పంచాయితీ సర్పంచ్ విధిగా వందలాది మొక్కలు  నాటి వాటిని రక్షించాలి అంటూ సీఎం  కేసీఆర్  కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా ఆలయ అధికారులు పెడచెవిన పెట్టి చెట్టును నరికారు అనే విషయం అర్థం కావడం లేదని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ఆవిర్భవించిన ధర్మపురి మున్సిపాలిటీ పాలకవర్గం, స్వచ్ఛంద సంస్థలు యువత విద్యార్థులు మహిళా సంఘాలు పట్టణంలో ఉత్సాహంగా మొక్కలు నాటుతు వాటిని సంరక్షిస్తూ పచ్చదనం వెల్లివిరిసేలా కృషి చేస్తున్నారు. స్థానికంగా అటవీ శాఖ రేంజ్ అధికారి, అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ ముందస్తుగా వారికి సమాచారం ఆలయ అధికారులు ఇచ్చారా ?  లేక దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన ఆదేశాల మేరకే తొలగించారా ? అనే విషయాన్ని అటవీ శాఖ విజిలెన్స్ అధికారుల తో విచారణ  జరిపితే భవిష్యత్తులో ఇష్టానుసారంగా పౌరులు కానీ ప్రభుత్వ శాఖలు, పచ్చని చెట్లను  నరికి వేయరు, ఆలయంలో వేపచెట్టు నరికిన ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో  ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అని భక్తజనం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

Surendra Kumar
Surendra Kumar
Sakalam Correspondent, Dharmapuri

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles