Sunday, December 22, 2024

ప్రపంచ అద్భుత భర్తలు (World’s most wonderful husbands) – 8

ప్రపంచ అద్భుత భర్తలు అంటే ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కటం, సర్కస్ జిమ్మిక్కులు చేయటం, క్రికెట్టులో జట్టును గెలిపించుకోవటం, ఆటల్లో మొదటి మెట్టుపై ఉండటం, కొడుక్కు జన్మనివ్వటం, ఒలంపిక్స్ క్రీడల్లో బంగారు పథకాలు తీసుకోవటం, దేశానికి రాష్ట్ర పతులుగా, అధ్యక్షులుగా, ప్రధాన మంత్రులుగా,  గవర్నర్లుగా,   ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా   కీర్తించబడటం అస్సలు కానే కాదు. వారి ప్రవర్తన, హావభావాలు, చేష్టలు, మాటలు, వ్యక్తీకరణ, నడవడిక, వ్యక్తిత్వం, పక్క వారి పట్ల వారి స్పందన, భార్య, కుటుంబం విషయం లో చూపే బాధ్యతా, బంధం, అనుబంధం వగైర వగైరాల నిర్వచనాల వెంట నడచిన వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం, వారిగురించి చెప్పడం, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలా? వద్దా? అని విశ్లేషించుకోవటం,  సమాజంలోనూ, బయట ప్రపంచంలోనూ అద్భుతంగా భర్తలు కనిపిస్తారు, వారి మరొక వైపున్న మొఖం గురించి విశ్లేషించడం ఇక్కడ ప్రధానమైనది. ఒకే వ్యక్తి బాహ్య ప్రపంచానికి ఒక విధంగా పరిచయం అవుతారు, భార్య విషయంలో, కుటుంబం విషయంలో మరొక విధంగా దర్శనం ఇస్తారు. ఇక్కడ ఓ పెద్ద మనిషి గురించి వర్ణిస్తాను, మీ మీ అభిప్రాయాలను ఇక్కడ పంచుకోవాలి. ఇందులో బలవంతం లేదు. నేను చెప్పే విషయంపై మీ వీక్షణం ఏంటో అందరికీ తెలుస్తుందిసమిష్టి అభిప్రాయం చర్చకు వస్తుంది….

Also read: జుబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలి: హక్కుల నేతలు

జీవితాన్ని దేశానికి అంకితమిచ్చిన గొప్పమనిషి  

ఒక  దేశానికి కాబోయే గొప్పనాయకుడు  బ్రహ్మచారి అని పత్రికల లో ఒక వార్త….తన జీవితాన్ని దేశానికి అంకితం ఇచ్చారనీ, దేశానికి సేవ చేసేటందుకేనే  బ్రహ్మచర్యం తీసుకున్నారనీ ఇలా చాలానే పత్రికలలో వార్త ఒకటి  ప్రచురణ అయ్యింది.  ఆ నాయకుడు   ప్రమాణ స్వీకారం  చేసిన  కొన్ని నెలల  తరువాత, ఆ నాయకుడు బ్రహ్మచారి కాదు, పెళ్లి అయ్యింది, అయితే ” తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారు, పరిస్థితులు అతన్ని ఆలా చేయమని చెప్పాయి” అని పత్రికలు మరొక వార్త ప్రచురించాయి. ఎప్పుడో బాల్య వివాహం 1960లలో 13/18 ఏళ్ళ వయసులో జరిగిందనీ, వివాహ జీవితం నుండి బయటపడి, సన్యాసిగా దేశ పర్యటన చేసారనీ, అపారమైన దృఢ సంకల్పంతో దేశం కోసం అహర్నిశలు సేవ చేసారనీ పత్రికలలో వచ్చింది. సరే వివాహితులా? కారా? భార్య ఉన్నారా?  అని కౌంటర్  చెక్ లో  బయటపడ్డ  అంశాలు ..  ఫలాని వారే భార్య అని నిగ్గుతేల్చి,  భార్యతో గూడా  ఇంటర్వ్యూ  పత్రికల  వారు  చేశారు.  భార్య ప్రభుత్వఉద్యోగంచేసి రిటైర్ అయ్యినట్లు, పెన్షన్ తో జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకురాళ్లు, రాజకీయ నాయకులూ భార్యకు అన్యాయం చేసిన వ్యక్తి , దేశాన్ని ఏం బాగు చేస్తారని, ఆనాయకుడి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొన్ని రోజులు గోల చేశఆరు. మరికొందరు అది వారి వ్యక్తిగతం, భార్యను ఏం హింసించ లేదని, భార్య మరో పెళ్లి చేసుకోకపోవడం ఆమె వ్యక్తిగతం అని ఇలా వాద ప్రతి వాదాలు జరిగాయి. నాయకుడి మద్దతుదారులు ఒకవైపు వ్యతిరేకవాదులు మరొక వైపు ఉద్యమాలు చేశారు. కొంత మంది మద్దతుదారులు, వ్యతిరేక వాదులలోని కొందరు మహిళా నాయకులను సామాజిక మాధ్యమాలలో టార్గెట్ చేసి ట్రోలింగ్ చేశారు. ప్రపంచంలో  ముఖ్యనేతలుగా, ముఖ్యమైన వ్యక్తులుగా చూపబడుతున్న వారు, మన ఊరిలో, మన పట్టణాలలో, మనకు తెలిసిన ప్రముఖులు, పెద్దవాళ్లుగా పిలువబడుతున్న వారు … ఇలా చాలా మంది రెండు ముఖాలను కలిగిన వారు  ఉన్నారు. వీరిని ఎలా చూడాలి? ఎలా అర్ధం చేసుకోవాలి? వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలా? వద్దా? వీరిని  ప్రమాదకరమైన వ్యక్తులుగా పరిగణలోకి తీసుకోవచ్చా? ఇలాంటివారితో దేశం సురక్షితంగా ఉంటుందని భావించవచ్చా? సురక్షితంగా నిజంగానే దేశం ఉంటుందా? పెళ్లి తరువాత భార్యకు దూరంగా ఉండటం అంటే? అవివాహిత పురుషుడుగానే చూడాలా? లేక ఇంకేవిధంగా చూడాలి? భార్య పరిస్థితి? పెళ్లి అయిన స్త్రీ భర్తకు దూరంగా ఉండే భార్యను సమాజం  ఏ విధంగా పరిగణిస్తుంది? వీరికి “కులం, మతం” ఏమైనా విశేష గౌరవం, అధికారంవీరికి ఇస్తారా? బాల్య వివాహంకు అప్పటి పరిస్థితులు యాదృచ్చికంగా తోడుపడివుండొచ్చు, కానీ, అప్పటికే బాల్య వివాహాల రద్దు చట్టం ఉందిగా? ఉదారతత్వంతో అప్పటి పరిస్థితులను అర్ధం చేసుకోవాలా? ఇలాంటి వివాహాలు మామూలే అని కొట్టిపడేయాలా?సరిపెట్టుకోవాలా? వీటికి ఓ దృష్టి,  గమ్యం  ఉండదా? ఉంటే, వీటికి అభివృద్ధి నిరోధకమైన దృష్టి, గమ్యం ఏమైనా ఉంటాయా? ఇలాంటి వ్యక్తుల మానసిక స్థితి ఏంటిఇలాంటివారిని కన్న తల్లి తండ్రుల పరిస్థితి ఏంటి? వీరి పట్ల ఎలాంటి స్పందనను  కలిగివుండాలి?  ఎలాంటి చర్యలను తీసుకుంటే బాగుంటుంది? పౌర సమాజం  వీరి విషయంలోపాత్రఏంటి?  వీరిని ఎలా స్వీకరించాలి? వీరి స్థానం ఎక్కడ ? ఎంత?

Also read: తెలంగాణ రాష్ట్రం – రాజకీయ సంక్షోభం?         

విద్యార్థి సంఘాల వారు చివరిలో అభిప్రాయం చెప్పండి. కార్మిక సంఘాల నుండి, కర్షక సంఘాల నుండి, మహిళా సంఘాల నుండి, మేధావి సంఘాల నుండి ఒక్కొక్కరు మీ మీ అభిప్రాయాలను షేర్ చేయండి… ఓ, సెల్వరాజ్ ముందుగా షేర్ చేస్తారా ?

సెల్వరాజ్….. భార్య క్షమించింది వారిని.  నాయకుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందే తన జీవితపు రహస్యాన్ని తానే ముందుగా చెప్పి ఉంటే, దాని ఫలితం ఒకవిధంగా ఉంటుండె. పరిశోధన  చేసి  పత్రికల  వాళ్ళు  రాస్తే  ప్రజలకుతెలిసింది. గొప్పనాయకుడిగా బాధ్యతలు తీసుకోక ముందు రాష్ట్ర నాయకుడిగా కూడా వారు ఉన్నారు. వాస్తవాలు దాచినట్టేనా?అప్పుడు ఈ ప్రస్తావన రాలేదు. ఫాక్ట్స్ దాచిపెట్టినట్లే కదా. వారిది ఆకస్మిక రాజకీయ  ప్రయాణం జరగలేదు. ఒక పద్ధతి ప్రకారం సాగింది. ఆ ప్రయాణానికి ఒక దిశా  దీక్సూచి ఉన్నది. నిష్కళంగా చరితుడిగా  గొప్పనాయకుడిగా  ప్రమాణ స్వీకారం చేయలేదు అనేది స్పష్టం. భార్య కూడా ఏం వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. బహుశా ఆమెను “వివాహం” అనే ఒక సాంప్రదాయం మాట్లాడనివ్వటం లేదేమో? 1960లో స్త్రీల పరిస్థితులు, బాల్య వివాహాల స్థితులు, ఆచార వ్యవహారాలు అన్నీ ఆమెపై ఆధిపత్యం చేస్తుండవచ్చు.  ఒక ప్రభుత్వఉద్యోగిగా బ్రతుకు కోసం వృత్తి చేసింది, ప్రవృత్తి ఆచార, వ్యవహారాలే  ఆమెలో  ఉన్నాయి. అభివృద్ధి అనేది సమూలంగా జరగాలి. కూకటి వేళ్ళతో సహా పీకి వేసి అక్కడి నుండే విత్తనం వేయాలి. భారత సమాజంలో అది జరగలేదు. బ్రతుకు కోసం చాలా మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. అది వారికి బ్రతకటానికే వృత్తి. ప్రవృత్తి మాత్రం మరోటి ఉంది, అదే “మానసికమైన రిజర్వేషన్స్”… వ్యక్తులుగా మాత్రమే కొందరు రాజ్యాంగం ఇస్తున్న అభివృద్ధి ఫలాలను స్వీకరిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. సమూహాలుగా మాత్రం తీసుకోవటంలేదు. అందుకే ‘అభివృద్ధి’ అనేది కొందరి దగ్గెరకు వచ్చి ఆగిపోతోంది. ఇదే ఆ ‘ భార్య’ లో జరిగింది. జీవితం అంటే ఏదో ఒకరకంగా గడిపేయటం అనుకున్నది, గడిపేసింది. జీవితం అంటే అభివృద్ధి ఫలాలను ఆస్వాదించటం అని అనుకోలేదు. బ్రతుకు ఖర్చులను సంపాయించుకోవటం, అందులోనుండి  బ్రతకటం ఒక్కటే అని తలచింది. భర్త సన్యాసిగా మారినా ఏమనలేదు, ఒక రాష్ట్రనాయకుడిగా పాలిస్తూ కనిపించినా ఏం పట్టించుకోలేదు. గొప్పనాయకుడిగా కళ్ళముందు ప్రత్యక్షమైనా … గాజు కళ్ళతో చూస్తూనే ఉన్నది. ఎలాంటి స్పందన బయటి ప్రపంచానికి చూపట్లేదు. మర్యాదను పాటిస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. ఇక్కడ మర్యాద అనేదానికి నేను చెపుతున్నది “ఎవరెస్టు శిఖరమంత బరువైన మర్యాదను తలపై పెట్టుకొని 1960 నుండి మోస్తున్నది ఆ భార్య” అని నా భావన. మోయటం ఒక్కటే తెలిసింది. దింపటం ఎలానో తెలియక క్షమించింది అని ఒక కార్మికుడిగా నా అభిప్రాయం.

Also read: ప్రపంచ అద్భుత భర్తలు (world wonderful husbands)-7

నారాయణ్ దాస్ .. ఆయన చేసింది చాలా పెద్ద తప్పు . సన్యాసం పుచ్చుకునేట్లు అయితే పెద్దలకు చెప్పేది ఉండే. పెద్దమనుషుల మధ్య విడిపోయేది ఉండే. ఒక స్టేజి దాటిన తరువాతైనా చట్టపరిధిలో విడాకులు తీసుకోని ఉండవలసింది. బాల్యంలో  ఒక తాళి కట్టి, భార్యను వదిలి వెళ్ళిపోవటం ఆ పెద్దమనిషి చేయకూడదు. పలుపుతో ఆవు పయ్యను కట్టేసినట్లు ఉంది. యజమాని వచ్చి ఆ పలుపు విడిచేంత వరకు ఆ పయ్య బ్రతుకు పలుపుతోనే గుంజను అంటిపెట్టుకొని ఉంటుంది. ఆడవాళ్ళ పరిస్థితి అంతే అయ్యింది. భార్యలను సతాయించినా, భార్యతో కాపురం చేయకపోయినా మా ఎరికకు వస్తే అడుగుతాము, ఏమయ్యింది అని. కుటుంబ పరిస్థితి ఏంటని కడిగివేస్తాము. పదిమందిమి కలిసి ఆ సమస్యను పరిష్కరిస్తాము. అవసరం అయితే పోలీసులను కలిసి మాట్లాడుతాము. ఎవ్వరి తప్పువున్న వారికే  చెపుతాము. ఆ సమస్యను పట్టించుకోకపోతే, వాళ్ళను చూసి మరొకరు అలానే తయారు అవుతారు. మేము పంటను పండించే రైతులం మాత్రమే కాదు. సమాజంలోని చీడలమాదిరి ఏపుగా పెరిగే కలుపు మొక్కలను పీకి పారేస్తాము. ఆ పెద్దమనిషి భార్యను గౌరవించాలి. పత్రికల వాళ్ళు వారి వారి పత్రికలలో రాసినంత మాత్రాన ఆమెకు భార్యగా గౌరవం ఇచ్చినట్లు కాదు. ఫలాని స్త్రీ ని ఆయన పెళ్లిచేసుకొని వదిలేశారు అని ఆమెను వేలెత్తి చూపినట్లు. పత్రికలలో వచ్చిన ఆ వార్తకు ఆ స్త్రీ మనసు ఎంత నొచ్చుకొని ఉన్నదో ? కనీసం ఆ పెద్దాయన “ఆమె నా భార్య ” అని ఒక్క మాట చెప్పలేదు. ఆయన ఏం పెద్దమనిషి?  ఏం గొప్ప  వ్యక్తిత్వం ఉన్న మనిషి? సన్యసించటం అంటే …సన్యాసం పుచ్చుకొనివ్యక్తి పెళ్లి చేసుకొని ఉంటే భార్యకు  ఒక కుటుంబాన్ని ఇచ్చి, గౌరవప్రదమైన ఒక జీవితాన్ని చూపించి, సంసార సుఖం ఇక వద్దు అని  సన్యాసం పుచ్చుకోవటం ఒక పద్ధతి. పెళ్లి చేసుకోకుండా సంసార సుఖాన్ని వదులుకొని సన్యాసంను పొందటం రెండవ పద్ధతి. ఆ పెద్దమనిషి విషయం ఈ రెండిటిలో ఏదీ కాదు. బాల్య వివాహం జరిగింది, భార్యను వదిలి వేసి దేశసేవకు అంకితం అయ్యారు. సేవ చేసిన దేశంలోనే భార్య ఉంది.1960  నుండి ఈ సుదీర్ఘ ప్రయాణంలో భార్య గురించి ఎందుకు ఆలోచించలేక పోయారు? స్త్రీలకు  ఆ పెద్దమనిషి ఇచ్చే విలువ ఎంత? ఆ పెద్దమనిషికి స్త్రీల విలువ గురించి తెలుసా? ఆ  పెద్ద మనిషి “పెళ్ళి” అనేదానికి ఏం అర్ధం చెపుతున్నట్లు?  ఆ పెద్దమనిషి ప్రజలకు  ఏం సందేశం ఇచ్చినట్లు ? నేను చివరిగా, ఒక రైతుగా  చెప్పేది .. ఆ పెద్దమనిషి చేసింది తప్పు. భార్యకు సముచిత స్థానం దక్కవలసిందే. చట్టం అందరికీ ఒకటే అనేది మనం మరచి పోకూడదు అని నా అభిప్రాయం.

Also read: ప్రపంచ అద్భుత భర్తలు (World Wonderful Husbands)-6

రాధికా ఎస్తేర్…. ఆ పెద్దమనిషి విషయంలో కులాల పెద్దలు, మతాల పెద్దలు ఎక్కడికి వెళ్లారు? “గౌరవం అంటే అధికారంను చూసి లేచి నిలబడి సలాం చేపించుకోవటం కాదు. వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి గంభీరంగా నమస్కరించటం..”. ఆ పెద్దమనిషి ఏం సందేశం ఇస్తున్నట్లు? చాలామంది మగవాళ్ళు భార్యలను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. అర్ధాంతరంగా వదిలివేస్తున్నారు.  ఒక మహా మంత్రి వర్యులు కొడుకు  మోడలింగ్ లో పనిచేస్తున్న మహిళను పెళ్లి చేసుకున్నారు, ఆ మంత్రివర్యులు కోడలును ఇంట్లోకి రానివ్వలేదు. ఏం జ్ఞానం లేని వాళ్ళు కూడాభార్యవిషయంలో చేస్తున్నది ఇదే. కులం కాని వ్యక్తిని, మతం కాని వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని ఒకవైపు ఇంట్లోకి రానివ్వటంలేదు, మరో వైపు హత్యలు చేస్తున్నారు. గొప్పనాయకుడు కూడా వీరికి ఏం భిన్నంగా లేరు. ఆడవాళ్లను అవమానించటమే. జీవితంలో ఏం చెయ్యాలో సూచించేది రామాయణం అని, ఏం చెయ్యకూడదో వేలును బట్టి నడిపించేది మహాభారతం అని, జీవితం ఎలా జీవించాలో భగవద్గీత మార్గం వేస్తుంది అని చిన్నప్పటినుండి వింటూనే ఉన్నాము. అయితే, పెద్దమనిషి మాత్రం తూచా తప్పకుండా  గొప్పగా  వాటిని  అనుసరిస్తారని అనుచరులు చెప్పారు. 1960 నుండి భార్య పట్ల పెద్దమనిషి ఎన్నుకున్న మార్గం తప్పు. ఇలాంటి వారు రెండు వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. చర్యలు తీసుకోవాలి. పిల్లలకు పరిచయం చేసే మహానీయుల కోవలోకి వీరిని ఉంచకూడదు. ఎందుకంటె పిల్లల్లో భయం పోయి, ధైర్యంతో జ్ఞానవంతులు అవుతారు అనుకోలేము. పిల్లల్లో చిన్నప్పటి నుండే మహిళల పట్ల “ప్రేమ అభిమానం ఆప్యాయత  గౌరవం సహాయ పడటం “… లాంటి లక్షణాలను వారిలో తగ్గించిన వారం అవుతాము.

చివరిగా … బాల్య వివాహం లో కూడా ఏడడుగుల బంధం కు  ముడి వేస్తారు. గొప్పగా కీర్తించే ఏడడుగుల బంధం ను గొప్పనాయకుడు అపహాస్యం చేశారు. ఏ విధంగా చూసినా దేశాధిపతి గొప్పనాయకుడు  తప్పు  చేయలేదు అని ఎలా సమర్థించాలిట? భార్య ఒక పత్రికా ఇంటర్వ్యూ లో..  ‘పిలిస్తే కదా భర్త దగ్గరకు వెళ్లేది’ అన్నది. ఈమాట ఎంత జాలి కలిగే అనుభూతి అది. గొప్పనాయకుడు భార్యకు విడాకులు ఇవ్వకుండా, సంసార  జీవితం వద్దు అని వెళ్ళిపోవటం పిల్ల చేష్టలుగా వుంది. వివాహం బాల్య వివాహం కావున ఆనాటి పరిస్థితులు పిల్ల చేష్టలు అని అప్పటికి సర్డుకోవచ్చు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నప్పుడు,  ఆమె గురించి అప్పుడైనా ఒక నిర్ణయానికి వచ్చి ఉండాలి. భార్యగా స్వీకరించాలని లేనప్పుడు, ఆమె జీవితాన్ని “తాళి బొట్టు” తో ఎలా బంధించి పెడతారు. తాళి బొట్టు ను భారతదేశ మహిళలు పవిత్రమైనదిగా భావిస్తారు. భర్త సంసారం చేయక పోయినా తాళిబొట్టు ” మహత్తరమైన బంధానికి గుర్తుగా, శరీరంలో అది ఒక భాగం అని,  మానసికంగా  జీవితాంతం భద్రంగా కళ్ళల్లో వత్తులు పెట్టుకొని” కాపాడుకుంటూ ఉంటారు.

గొప్ప నాయకుడి విచిత్ర ప్రవృత్తి

1960 నుండి ఒక నిర్ణయానికి గొప్పనాయకుడు రాలేదు.  స్త్రీలను  గౌరవించ లేరని స్పష్టం. బహిరంగంగా చాలా సందర్భాలలో గొప్పనాయకుడు “అమ్మను” కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భార్య విషయంలొ గొప్పనాయకుడి ప్రవర్తన నార్మల్ గా లేదనేచెప్పాలి. విచిత్రంగా గొప్పనాయకుడు ప్రవృత్తి, నడవడి ఉంది. భార్య గురించి బాధ్యత లేదు. భార్యను అవమానించడం, పెళ్లిని, సప్తపతిని అగౌరవ పరచటం. ఇది ఒక నేరం. దర్యాప్తు సంస్థలు ఇలాంటి  నేరాలను “సుమోటో” గా తీసుకోవాలి. విచారణ చేయాలి. ఎలాంటి చర్యలు ఉంటాయో బహిరంగంగా ప్రకటించాలి. ఒక అకౌంటబిలిటీనీ (జవాబుదారీతనం) నిర్మించాలి.  అప్పుడన్నా  స్త్రీల  విషయంలో  ఎంత బాధ్యతగాఉన్నారో, ఫీల్ అయ్యారో,అవుతున్నారో  పౌర సమాజం గ్రహిస్తుంది. మహిళల సాధికారత గురించి ఒకవైపు చెపుతూ, మరొక వైపు ఆచార వ్యవహారాలతో , కట్టుబాట్లతో, కాలి మెట్లతో, తాళి బొట్టుతో, నుదుట బొట్టుతో, మూడు ముళ్ల బంధంతో స్త్రీలను  కట్టేస్తున్నారు, కట్టేసారు,  అందుకే   ఆ భార్య  బయటి  ప్రపంచంతో  చెప్పుకోలేక పోతుంది  అని నా అభిప్రాయం.

Also read: ప్రపంచ అద్భుత భర్తలు(World Wonderful Husbands) -5

అజీబ 

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles