సావిత్రి.. నటనకే నటనను నేర్పిన సహజ నటి. పాత్రలకే ప్రాణం పోసిన మహానటి. సావిత్రి ఒక చలన చిత్ర నటీమణి కాదు. ప్రేక్షకులు ఆరాధించే దేవత. బహుశ చలన చిత్ర రంగాన సావిత్రి సంపాదించిన ప్రాచుర్యం ఏ తెలుగు నటికీ దక్కలేదేమో. ఆమె జీవితం కళ్లు జిగేల్మనేలా సాగింది. అలాంటి అభినేత్రి కళ్లు నిజజీవితంలో కన్నీళ్లు కార్చాయి. తెరపై నవ్విన పెదవులు, తెర వెనుక దు:ఖాన్ని బిగబట్టాల్సి వచ్చింది. ఆమె నట జీవితంలోని హొయలు.. నిజ జీవితంలోంచి వెళ్లిపోయాయి. మాట బాధాతప్తమైంది. ఒక చిత్రంలో ఎన్ని మలుపులుంటాయో.. సావిత్రి జీవితంలో అంతకంటే ఎక్కువ మలుపులున్నాయి.
అన్ని రకాల పాత్రల్లోనూ అద్భుతంగా …
తన పాత్రల ద్వారా ఓ తల్లిగా, చెల్లిగా, అక్కగా, ప్రియురాలిగా ప్రేక్షకుల గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకుని, వారి గుండె కుహారాల్లో గూడు కట్టుకున్న నట విదుషీమణి సావిత్రి. అయితే మహానటిగా ఆమె ఎంత ఎత్తుకు ఎదిదింగో…. అంతే వేగంగా ఆమె పాతాళానికి దిగ జారిపోయింది.. విషాదంతో నిండిన ఆమె జీవితగాథ తెలుసుకున్న వారికి కళ్ళు చెమర్చక మానవు. తన జీవిత చరమాంకంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న సావిత్రి , తన వ్యక్తిగత జీవితంలో కూడా తన జీవితానికి తానే పాత్ర అయ్యింది.. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లతో సమానమైన స్టార్ డమ్ సావిత్రి సొంతం. ఆమె హుషారుగా నటిస్తే ఆహ్లాదం ఆవరిస్తుంది. ఆమె విషాదాభినయం ప్రేక్షక మనసులను బరువెక్కిస్తుంది.
Also read: తెలుగు సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం బాపు బొమ్మ
మహానటి అంటే, దక్షిణాదిలో ఒక్క సావిత్రి పేరే వినిపించేది. ఎందరో ఉత్తమ నటీమణులు దక్షిణాదిలో పుట్టారు. ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. వీరందరి నడుమ సావిత్రి మాత్రమే మహానటిగా పేరు సాధించడానికి ఎన్నో కారణాలున్నాయి. నవరాసాలను అలవోకగా పండించడంలో ఆమె దిట్ట. నటించడం కాదు.. ఏపాత్రలోనైనా జీవించండం ఆమెకు దేవుడిచ్చిన వరం. అందుకే తెలుగు సినిమాల్లో సావిత్రి ఎవరగ్రీన్ గా మిగిలిపోయింది.
తెలుగు చిత్ర రంగం పురుడు పోసుకున్న నాటి నుంచి నేటి వరకు ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేదు.. అందనంత ఎత్తుకు ఎదిగి, అంతే వేగంగా అధః పాతాళానికి పోయిన ధృవ తార ఆమె..
సావిత్రి పేరు అంటే తెలుగు ప్రేక్షకులకు చెప్పలేనంత అభిమానం.. గుండెలనిండా నింపుకున్న మమకారం.
విజయవాడలో విద్యాభ్యాసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6, 1936న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు సావిత్రి జన్మించింది. ఆ దంపతులకు సావిత్రి రెండవ సంతానం, సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య, సావిత్రికి వరుసకు పెద్దనాన్న. ఆయన సహకారంతో ఆమె విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో చేరింది. పాఠశాలకు వెళ్ళే మార్గంలో నృత్య విద్యాలయం ఉండేది. ఆ విద్యాలయంలో నృత్యాన్ని నేర్చుకుంటున్న విద్యార్ధులను పరిశీలించి దానిమీద ఆసక్తి పెంచుకుని ఆ నృత్యనిలయంలో చేరింది. అనంతరం శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం , శాస్త్రీయ నృత్యం నేర్చుకొని తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది.
పృథ్వీరాజ కపూర్ చేతులమీదుగా బహుమతి
అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో నటించింది. 13 సంవత్సరాల వయసులో కాకినాడలోని ఆంధ్రనాటక పరిషత్ నిర్వహించిన నృత్యనాటక పోటీలలో విజయం సాధించి, ఆనాటి హిందీ నటుడు, దర్శకుడు, ప్రసిద్ధుడు అయిన పృధ్వీరాజకపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకుంది. ఆ బహుమతే ఆమెకు కళల పట్ల ఆరాధనను పెంచింది. ఆమె 1949లో పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి మద్రాసు రైలు ఎక్కింది.
మొదట్లో వేషాల కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సావిత్రి అనేక ప్రయత్నాలు చేయగా 1950లో సంసారం సినిమాలో హీరోయిన్ వేషం లభించింది. అక్కినేని, ఎన్టీఆర్ లు హీరోలు. కానీ ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. ఆ సినిమా దర్శకుడు ఎల్. వి. ప్రసాద్ సావిత్రి హీరోయిన్ గా పనికి రాదని తేల్చేశారు. పదిమంది అమ్మాయిల్లో ఒకరిగా ఉండమన్నారు. చేసేది లేక సావిత్రి హీరోయిన్ ఫ్రెండ్స్ లో ఒకరిగా నటించింది. 1951లో పాతాళభైరవిలో ఓ డాన్సర్ గా నటించింది. ఆ తర్వాత 1952లో పెళ్లిచేసి చూడులో కాస్త గుర్తింపు ఉండే పాత్ర లభించింది.
దశ-దిశ మార్చిన దేవదాసు
ఇక 1953లో విడుదలైన దేవదాసులోని పార్వతి పాత్ర.. సావిత్రి నట జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చివేసింది. దేవదాసులో హీరోయిన్ పాత్ర కు మొదట మరో నటిని అనుకున్నారు. కానీ, చివరకు ఆ పాత్ర సావిత్రిని వరించింది. ఈ చిత్రంతో సావిత్రి నట జీవితం మలుపు తిరిగింది. అదామెకు తొలి విజయం. ఆ చిత్రంలో నాగేశ్వర్రావుకు దీటుగా నటించి మెప్పించింది. దేవదాసుగా ఏఎన్నాఆర్ ఎంతటి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారో పార్వతిగా సావిత్రి కూడా ఆ చిత్రం ద్వారా అంతే పేరు సాధించింది. ఆమె నట జీవితానికి పునాది వేసిన చిత్రంగా దేవదాసు చరిత్రలో నిలిచిపోయింది. తరువాత ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన మిస్సమ్మ చిత్రంలో ప్రధానపాత్ర పోషించింది. ఈ చిత్రానికి కూడా మొదట్లో భానుమతిని ఎంపిక చేసి, కొంత చిత్రాన్ని చిత్రీకరించారు. అయితే భానుమతి షూటింగ్ కు సరైన సమయానికి రావడం లేదన్న కారణంతో ఆమెను తొలగించి, ఆ పాత్రను సావిత్రికిచ్చారు. సావిత్రి నట జీవితంలో మరో మలుపు మిస్సమ్మ. భానుమతి చేయాల్సిన ఆ పాత్రను.. సావిత్రి పోషించి భేష్ అనిపించింది. ఈ చిత్రంలో మిస్ మేరీగా సావిత్రి నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్సమ్మగా మేరీ పాత్రలో చిలిపితనాన్ని, కోపాన్ని ఏకకాలంలో అభినయించి అబాల గోపాలన్ని అలరించింది. ఈ చిత్ర విజయంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదామె.
Also read: అబ్బురపరిచే కళాకృతులకు నిలయం సాలార్ జంగ్ మ్యూజియం
తోడికోడళ్ళు, మాయాబజార్
దేవదాసు, మిస్సమ్మ విజయాలతో హీరోయిన్ గా రెండో స్థానంలో నిలిచిందామె. 1957లో విడుదలైన తోడికోడళ్లు, మాయాబజార్ చిత్రాలు గొప్ప విజయాలు సాధించాయి. ఈ చిత్రాల విజయంతో నెంబర్ వన్ హీరోయిన్ గా ఆమె నిలిచింది. మాయాబజార్ లో మాయా శశిరేఖగా ఎస్వీఆర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది సావిత్రి. ఆ పాత్రలో ఆమె నటన వర్ణనాతీతం. ఉత్తరకుమారుడు రేలంగిని, సావిత్రి ఆట పట్టించే సన్నివేశాలు అందరినీ కట్టిపడేశాయి. నేటికీ మాయాబజార్ చిత్రానికి ఆదరణ తగ్గలేదు. మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం.
అలాగే అర్థాంగిలో మతిస్థిమితం లేని భర్తను మామూలు మనిషిగా చేసుకున్న భార్య పాత్రలో నటించినా, అప్పుచేసి పప్పుకూడు చిత్రంలో కామెడీ పాత్ర వేసినా ఆమెకే చెల్లింది. సహజంగా కథానాయికలు కొంచెం లావయితే తెరమరుగవుతారు. కానీ, సావిత్రి ‘చదువుకున్న అమ్మాయిలు’ చిత్రం నాటికే తక్కిన హీరోయిన్ల కంటే లావు. అయినా ఆ చిత్రంతో పాటు ఎన్నో చిత్రాల్లో సావిత్రి టీనేజ్ అమ్మాయిగా నటించి మెప్పించింది.
నటిగా సావిత్రికి, అన్నపూర్ణ సంస్థకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ బ్యానర్ లో నిర్మించిన ఒకటి రెండు చిత్రాల్లోతప్ప మిగిలిన చిత్రాలన్నింటిలో సావిత్రే పర్మినెంట్ హీరోయిన్. ఈ సంస్థలో నిర్మించిన దొంగరాముడు, వెలుగునీడలు, మాంగల్యబలం, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు చిత్రాలు నటిగా సావిత్రికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రిలు జంటగా నిర్మించిన చిత్రాలన్నీ ఆరోజుల్లో విజయబావుటా ఎగురవేశాయి. సంతానం చిత్రంతో ప్రారంభమైన వీరి కాంబినేషన్ అనేక చిత్రాల్లో కొనసాగింది. అభిమానం, నమ్మినబంటు, శాంతినివాసం, సిరిసంపదలు, ఆరాధన, మంచి మనసులు, మాయాబజార్, నవరాత్రి, సుమంగళి చిత్రాలు వీరి నటనా కౌశలానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అలాగే, ఎన్టీఆర్, సావిత్రిల జోడి కూడా తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. కన్యాశుల్కం, భలేరాముడు, వినాయక చవితి, ఇంటిగుట్టు, శ్రీవేంకటేశ్వర మహత్యం, నర్తనశాల, గుండమ్మకథ వంటి అనేక చిత్రాలతో వీరు హిట్ పెయిర్ గా నిలిచారు.
విఫలమైన వివాహబంధం
సావిత్రి హిందీ చిత్రాల్లోనూ నటించింది. బహుత్ దిన్ హుయే, ఘర్ బసాకే దేఖో, గంగా కీ లహరే, బలరాం శ్రీకృష్ణ చిత్రాల్లో నటించి ఉత్తరాది ప్రేక్షకులను సైతం మైమరిపించింది. తెలుగు తర్వాత దక్షిణాది భాషల్లో తమిళంలో ఎక్కువగా నటించింది. ఆమె జెమినీ గణేషన్ తో అనేక చిత్రాలు చేసింది. ఆయనతో ‘మనం పోల మాంగల్యం’ చిత్రంలో నటిస్తుండగా ప్రేమలో పడి, అది వారిద్దరి వివాహం వరకూ దారితీసింది. అయితే జెమినీ గణేషన్ , సావిత్రిల వైవాహిక జీవితం మొదట్లో బాగానే ఉన్నా, తరువాత వారి వివాహ బంధం విఫలమైంది. ఈ క్రమంలో ఎంతో ఆత్మాభిమానం ఉన్న సావిత్రి ఒంటరిగానే కష్టాలను ఎదుర్కొనే ప్రయత్నం చేసింది.
సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమెను ఆర్థికంగానూ మానసికంగానూ బాధించాయి. ఆమె దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చిన్నారి పాపలు. ఈ చిత్ర నిర్మాణంలో చాలా మంది పాలుపంచుకున్నారు. అయితే వారంతా అభిప్రాయ భేదాలతో చిత్రం ముందుకు సాగకపోవడంతో ఆమె సొంత ఆస్తులు అమ్మి ఈ చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసింది. అలాగే, తెలుగులో అమోఘ విజయం సాధించిన మూగమనసులు చిత్రాన్ని తమిళంలో నిర్మించి చేతులు కాల్చుకుంది. అలాగే, ఆమె ది ఎడమ చేతివాటం.
లాల్ బహదూర్ శాస్త్రికి నగలన్నీ సమర్పణ
కష్టాల్లో ఉన్నామని ఎవరైనా వచ్చి అడిగితే లేదనకుండా ఇచ్చే మంచి మనస్తత్వం ఆమెది. దానధర్మాల విషయంలో ఆమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది. ఇలాంటి పరిస్థితులే ఆమె ఆర్థికపతనానికి దారితీశాయి.. ఒక దశలో ఎంతో ఉన్నతంగా బతికిన ఆమె చివరి దశలో పేదరికాన్ని అనుభవించింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో 1981 డిసెంబర్ 26 న అశువులు బాసింది.
సావిత్రి జీవితం నాటకీయతలో ఆమె ధరించిన ఏ పాత్రకూ తీసిపోదు. అయినప్పటికీ ఆ సహృదయురాలి కథ కరుణామయ గాధగా మిగిలిపోవడం గుండెలు పిండేటంతటి విషాదం.
సాటిలేని మేటి నటి
తెలుగుతో పాటు అనేక తమిళ చిత్రాలలో మంచి పాత్రలు పోషిస్తూ , తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందిన సావిత్రి కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు తెరపై చెరగని ముద్రవేసిన అసమాన ప్రతిభాశాలి. తరాలు మారినా.. తెలుగు చిత్ర రంగంలో సాటిలేని మేటిగా కీర్తింపబడుతున్న ఏకైక నటి సావిత్రి. తెలుగు చిత్ర పరిశ్రమలో సావిత్రి ఓ ధృవతార.
(డిసెంబర్ 26 సావిత్రి వర్ధంతి)
దాసరి దుర్గా ప్రసాద్
మొబైల్: 7794096169