14 – గోదాగోవిందం, తెలుగు భావార్థ గీతిక
ఉజ్ఞళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెజ్ఞరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెజ్ఞల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తజ్ఞళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎజ్ఞళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నజ్ఞాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శజ్ఞొడు చక్కరం ఏందుం తడక్కైయం
పజ్ఞయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్
తెలుగు భావార్థ గీతిక
పెరటి మడుగులోన చెందమ్మికమలాలు కలిసి విరిసె
నల్లకల్వలు నీవు రావని ముకుళించి మూతిముడిచె
ధవళదంతుల మునులెల్ల తలుపుతెరువ బీగాలతో
కాషాయధారులు శంఖమ్ములూదగా గుడులకరిగినారు
మమ్మెలేపదమన్న మాట మరిచి నిదుర పోయెదవేల
కెందామరనేత్రుడా శంఖచక్రధరుడాజానుబాహుడు
ఆకాశవర్ణునికి ఆరాధనలు జేసి మంగళమ్ములు పాడ
కదలిరావమ్మ కమలాక్షి మాతోడ కలిసి కృష్ణవ్రతముజేయ
అర్థం
ఉజ్ఞళ్ = మీ యొక్క, పురైక్కడై త్తోట్టత్తు = పెరటితోటలో, వావియుళ్ =కొలనులో,
శెజ్ఞరునీర్ వాయ్ నెగిర్ అంద్ = ఎర్రతామరలు వికసించి, ఆమ్బల్ వాయ్ కుమ్బిన =నల్లకలువలు ముకుళించుకుని ఉన్నాయి. కాణ్= చూడు, శెజ్ఞల్పొడి క్కూరై = కాషాయవస్త్రాలు ధరించిన వారు, వెణ్బల్ =తెల్లని పలువరస గల వారు, తవత్తవర్ =తపసులు, తజ్ఞళ్ తిరుక్కోయిల్ = తమ దైవ సన్నిధిలో, శంగిడువాన్ =శంఖం మోగించడానికి, పోగిన్ఱార్= వెళ్తున్నారు. ఎజ్ఞళై =మమ్మల్ని, మున్నం ఎరుప్పువాన్ = ముందుగానే వచ్చిలేపుతానని, వాయ్ పేశుమ్= నోటితో చెప్పిన, నజ్ఞాయ్! =ఓ పరిపూర్ణురాలా, ఎరుందిరాయ్ = లేచిరమ్ము, నాణాదాయ్! =సిగ్గులేనిదానా, నావుడైయాయ్= తీయని మాటలు గుప్పించే నాలుకగలదానా, శజ్ఞొడు చక్కరం = శంఖ చక్రాలను ఏందుం = ధరించిన, తడక్కైయం = దీర్ఘబాహువులు గలవాడునూ, పజ్ఞయ క్కణ్ణానై = ఎర్రతామరలను పోలిన కన్నులు గలవాడు అయిన సర్వేశ్వరుని, ప్పాడ= స్తుతించడం.
Also read: నీ తామర రేకు కన్ను తెరవవా?
ఒక గోపిక తానే ముందు లేచి అందరినీ లేపుతానని మాట ఇచ్చి మరిచిపోయిందట. నిద్రిస్తూనే ఉందట. చెలికత్తెలమైన మమ్ములని ముందుగానే లేపుతానని మీనోటితోనేచెప్పిన పరిపూర్ణురాలా, మరిచిపోవడానికి సిగ్గులేదా,ఎన్నితీయని మాటలు చెప్పావమ్మా. మీ పెరటితోట బావిలోన సూర్యోదయానికి వికసించే ఎర్రతామరలు విరిసినాయంటే తెల్లవారినట్టు కాదూ. చంద్రుడు ఉదయిస్తే వికసించి సూర్యోదయానికి ముడుచుకుపోయే నల్లకలువలు ముకుళించినవి అంటే సూర్యుడు ఉదయించినట్టుకాదూ. ఎర్రని జేగురు రాళ్లపొడితో రంగు అద్దిన కాషాయవస్త్రాలుదాల్చి, సన్యాసులు దంతాలు తెల్లగా మెరుస్తుండగా కుంచెకోల పట్టుకుని ఆరాధనకై దేవాలయాలకు వెళ్తున్నారు చూడు.నీవు పరిపూర్ణురాలివి, నీవు మాతో లేకపోవడమే మాకొరత, ఆకొరత తీర్చి మమ్ముకూడా పరిపూర్ణురాలిని చేయవమ్మా లేవవమ్మా. శంఖ చక్రముల ధరించి విశాల బాహువులతో సువిశావక్షముతోమనలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆ పుండరీకాక్షుని మనమంతా కలిసిస్తుతించి వేడుకుందాం అని 14వ పాశురం స్థూలమైన అర్థం.
Also read: రామదర్శనంతో దశరథుడికి యవ్వనం
గోదా దేవి నంగాయ్ అని సంబోధిస్తున్నారు. అంటే గుణపరిపూర్తి, నాణాదాయ్ అంటే అహంకారం లేకుండా ఉండడం. పదిపాశురాలలో అన్ని వేదాలను ప్రతిపాదించిన గంభీరార్థములు వివరించిన వేదాంత దేశికులను ప్రస్తుతించారు గనుక వీరు తీయని నాలుకగలవారు కనుక నావుడయాయ్ అనీ అనవచ్చు.
తిరుప్పాణియాళ్వార్ ను అనుసంధించడం 14వ పాశురంలో సాగుతుంది. (శ్రీభాష్యం అప్పలాచార్యవారి వ్యాఖ్యానంలో ఈ రోజు తొండరడిప్పొడియాళ్వార్ ప్రస్తావన ఉందన్నారు) ఈ పాశురంలో శ్రీమన్నాథమునయేనమః అని గురువాక్యాన్ని స్మరించుకోవాలి. మనసులోలేని దానికి నోటితో చెప్పకూడదు. చెప్పినవాటిని చేయకుండా ఉండరాదు. జ్ఞానం అనుష్టానం రెండూ ఒకటి కావాలి. ఇదే త్రికరణ శుద్ధి. మంచి బుద్ధి. తొమ్మిదో గోపికను ఈ విధంగా తమ గోష్టిలో కలుపుకున్నారు గోదమ్మ.
Also read: రామదర్శనంతో దశరథుడికి యవ్వనం
మాడభూషి శ్రీధర్