వోలేటి దివాకర్
రైళ్లలో తిరుగుతూ నిజమైన టిటిఇల కన్నా ఎక్కువగా నటిస్తూ టిక్కెట్లు లేని ప్రయాణికుల నుంచి డబ్బులు దండుకుంటున్న వ్యక్తిని పట్టుకుని విచారించగా నకిలీగా తేలింది. సోదాలో అపోలో హాస్పిటల్స్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నట్లు నకిలీ గుర్తింపు కార్డు దొరకడం ఆశ్చర్యం కలిగించింది. టి టి ఇ తో సరి పోయింది… డాక్టర్ అయితే ఎంతమంది ప్రాణాలు తీసేవాడో.
నెల్లూరుకు చెందిన నకిలీ డాక్టర్ వాయిల వెంకటేశ్వర్లు గతంలో ఒంగోలు, విజయవాడ, చీరాల, నెల్లూరులో కూడా నకిలీ టీటీఇ అవతారం ఎత్తి దొరికిపోయాడు.
తాజాగా రాజమండ్రి రైల్వే స్క్వాడ్ అల్లపుజ- ధన్‌బాద్ రైల్లో తనిఖీ చేస్తున్నప్పుడు ద్వారపూడి టిటిఇ యూనిఫాంలో ఒక అనుమానాస్పద వ్యక్తి, టిక్కెట్ లేని ప్రయాణికుల నుండి డబ్బు వసూలు చేసి, ప్రయాణీకుడికి నకిలీ రసీదులు ఇస్తున్నట్లు సీనియర్ టి ఈ రాజేంద్రప్రసాద్ గుర్తించారు. అతని విద్యార్హతలు, ఐడి కార్డు, రసీదు పుస్తకం గురించి ఆరా తీస్తే నిందితుడి పేరు వాయిల వెంకటేశ్వర్లు, నెల్లూరుకు చెందిన వ్యక్తి అని తేలింది. విచారణలో అపోలో హాస్పిటల్స్‌లో డాక్టర్‌గా నకిలీ ఐడిని గుర్తించారు. ఆర్పీఎఫ్ పోలీసులు వెంకటేశ్వర్లు ను విచారణ నిమిత్తం రాజమండ్రి జి ఆర్ పి పోలీసులకు అప్పగించారు. ఒంగోలు, విజయవాడ, చీరాల, నెల్లూరులో ఇలాంటి 4 కేసుల్లో వెంకటేశ్వర్లు నిందితుడిగా ఉన్నట్లు తేలింది.