రామాయణమ్ – 171
రావణుడి ముఖము కోపముతో ఎర్రబారినది .తనను తప్పుపట్టుటయా కుంభకర్ణుడు!
మహారాజు ముఖకవళికలు గమనించాడు మహాపార్శ్వుడు..
ప్రభూ నేనొకటి తమకు మనవి చేసుకొందును.
ఒకడున్నాడు, వాడు ఒక భయంకరమైన కీకారణ్యములో క్రూరమృగములు సంచరిస్తూ ఉన్న ప్రదేశములో ఒక ఉన్నతమైన వృక్షము ఆకాశము అంటుతూ ఉన్నటువంటిది చూసినాడు.
Also read: సీతను తెచ్చుట పొరబాటు, కుంభకర్ణుడు
దాని చిటారుకొమ్మలపై అమృతప్రాయమైన తేనెతుట్టను చూసినాడు. దానినిండా తేనెటీగెలు ముసురుకొని ఉన్నవి. అంతపైన ఉన్న ఆ తేనెతుట్టెను చేరుకొనుట అసాధ్యము. చేరుకొనెను పో! కానీ తేనె సేకరించుట అత్యంత ప్రమాదకరము. సేకరించెనుపో!
ఆ తేనెను త్రాగకుండ పారబోయమని ఎవరైనా సలహా ఇవ్వవచ్చునా? అది ఎంత తెలివితక్కువ పని.
రామలక్ష్మణుల రక్షణలో ఉన్న సీతను తెచ్చుట ఆ తేనెను తెచ్చుట వంటిది.
Also read: విభీషణుడి సలహాను తిరస్కరించిన రావణుడు
ప్రభూ, అనుభవించు!
బలాత్కారముగా అనుభవించు!
బహుయత్నలభ్యతా మధువు!
ఆ రామవధువు!
నీ తనివితీరా అనుభవించు
నీవు నియత నియంతవు నీ కెదురేది?
ఈ మాటలకు రావణుని ముఖము విప్పారినది.
Also read: సీతను రామునికి అప్పగించుము, రావణుడికి విభీషణుడి హితవు
…
నీవు చెప్పినది నాకు ఆనందము కలిగించినది. ఒక విశ్వాస పాత్రుడైన సేనాపతి తన ప్రభువు ఆనందము కోసము ఆలోచించవలె. నీ ఆలోచన ఆరీతిగనే వున్నది
కానీ!
స్త్రీల విషయములో నేను శాపగ్రస్తుడను. తనంతతానై నా దరికి వచ్చిన వనితను తప్ప ఇతరులను బలాత్కారముగా అనుభవించ తలపెట్టితినా అదే నా చివరి రోజు.
ఒక సారి నేను బ్రహ్మ లోకమునకు వెళ్లినప్పుడు పుంజికస్థల అను అతిలోక సౌందర్యరాశి అయిన అప్సరసను ఒంటరిగా చూడటము తటస్థించినది.
కాముడి శరములు నామదిని తూట్లు పొడిచినవి. శరీరమునందు సెగలు పుట్టినవి. మదన జ్వరపీడితుడనై ఆపుకొనలేక ఆమెను వివస్త్రను చేసి బలాత్కారముగా అనుభవించితిని.
Also read: రావణుడి సేనాధిపతుల ప్రేలాపన
ఆమె బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకొనినది.
బ్రహ్మదేవుడు అంత ఆగ్రహించి, ” రావణా, ఈనాడు మొదలుకొని నీవు ఏ పడతినైనా ఆమె ఇష్టములేక బలాత్కరించి అనుభవించితివా నీ తల నూరు వ్రక్కలగును” అని శపించినాడు….నీకు ఇంకొక రహస్యము కూడ చెప్పెదను వినుము ….
రంభ అందమును చూసి మహాసంరంభమున బలవంతముగా ఆమెను అనుభవించితిని. నలకూబరుడు నన్ను ఇదే విధముగా శపించినాడు.
అది ఆరంభము !…
ఆ! నలకూబరుని శాపము నన్నేమిచేయునని లెక్కచేయలేదు …
కానీ ఈ సారి శపించినది సాక్షాత్తూ విధాత ! …అందుకే నాకు భయము, దిగులు. ..ఆ శాపమే లేకపోయెనా ఈ పాటికి సీతాదేవిని ఎప్పుడో వశము చేసుకొని యుండెడి వాడను….’’
వీరి మాటలు విభీషణుడు వింటున్నాడు …ఇక లాభము లేదు. హితము చెప్పవలెనని అనుకొన్నాడు…..తన ఆసనమునుండి పైకి లేచినాడు.
Also read: ఇప్పుడేమి చేయవలె, మంత్రులకు రావణుడి ప్రశ్న
వూటుకూరు జానకిరామారావు