Sunday, December 22, 2024

మంచి ‘వక్త’ కావాలనుకునేవారు తప్పనిసరిగా చదువ వలసిన పుస్తకం

పుస్తక సమీక్ష

హెచ్ఎంటీవీలో సంభవించిన అనేక అద్భుతాలలో ప్రధానమైనది ‘వక్త’ కార్యక్రమం. హెచ్ఎంటీవీనీ, ద హన్స్ ఇండియానూ సమర్పించే హైదరాబాద్ మీడియా హౌస్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేసిన ఆరు సంవత్సరాలూ నా జర్నలిస్టు జీవితంలో అత్యంత విలువైనవి. మరుపురానివి. ఏ టెలివిజన్ చానల్ చేయని ఎన్నో వినూత్నమైన, సాహసోపేతమైన కార్యక్రమాల్ని హెచ్ ఎంటీవీ జయప్రదంగా చేసింది. హైదరాబాద్ మీడియా హౌస్ (హెచ్ఎంహెచ్) యజమాని కాసుగంటి వామన్ రావుగారు ఇచ్చిన సంపూర్ణ స్వేచ్ఛను సద్వినియోగం చేసి రూపొందించి ప్రసారం చేసిన అనేక ప్రజాకార్యక్రమాలు నాకు అంతులేని సంతృప్తిని ఇచ్చాయి. దొమ్మాట బాల్ రెడ్డిగారు వామన్ రావుగారి నేతృత్వంలో పని చేస్తున్న సమర్థుడు. చైర్మన్ అనుమతితో ‘వక్త’  కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దానికి లభించిన ఆదరణ చూసి సంతోషించాను. సంస్థలో పని చేస్తున్న వ్యక్తిగా నేను ఈ కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొనేవాడిని.

ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకోవాలంటే రాజకీయనాయకత్వం సమర్థంగా, నిజాయతీగా, దూరదృష్టి కలిగి ఉండాలని విశ్వసించేవారిలో నేను ఒకడిని. మంచి రాజకీయ నాయకులు కావలంటే వక్తృత్వంలో అభినివేశం ఉండాలనీ, ధారాళంగా మాట్లాడగలిగేవారు తమ మనస్సులోని అభిప్రాయాలను ప్రజలకు తేలికగా చెప్పగలుగుతారని నా నమ్మకం. అందుకని బాల్ రెడ్డిగారి చొరవను అభినందిస్తూ ఆ కార్యక్రమం జయప్రదంగా అమలు చేయడానికి నేనూ నా శక్తి మేరకు దోహదం చేశాను. సంతోషకరమైన విషయం ఏమిటంటే నా నిష్క్రమణ తర్వాత కూడా బాల్ రెడ్డిగారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు. నా స్థానంలో ఉద్యోగంలో చేరిన సంచాలకుల, సంస్థలోని ఇతర అధికారుల సహకారం కూడా ఆయన పొందారు. కనుకనే వేలమంది యువతీయువకులను మంచి వక్తలుగా తీర్చిదిద్దే అవకాశం ‘వక్త’ కార్యక్రమం ద్వారా బాల్ రెడ్డిగారికి దక్కింది. ఆయన ప్రత్యక్ష శిష్యులు రాజకీయాలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో, ఐటీ కంపెనీలలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, తక్కిన భారత రాష్ట్రాలలో, అమెరికాలో, యూరప్ లో, కెనడాలో…ఎక్కడ తెలుగువారుంటే అక్కడ ఉన్నారు. చుక్కారామయ్యగారి శిష్యరికం చేసి ఐఐటీలో ఉత్తీర్ణులైన ఐటీ ప్రవీణులు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత ఉద్యోగాలలో ఉన్న విధంగానే బాల్ రెడ్డిగారి శిష్యులు కూడా అన్ని దేశాలలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ పుస్తకాన్ని అమెరికాలో ఉన్న శిష్యులు అక్కడ విడుదల చేసి సంబరం చేసుకున్నారని విని ఆనందించాను. అన్ని హంగులూ సమకూర్చుకున్న తర్వాత  ప్రారంభమై, మాసాలు గడుస్తున్నకొద్దీ గొప్ప విలువనూ, ప్రతిష్ఠనూ సంతరించుకున్న ‘వక్త’ కార్యక్రమాన్ని రూపొందించి, పదేళ్ళుగా నిర్వహిస్తున్న ప్రవీణుడు బాల్ రెడ్డిగారు వాగ్దేవికటాక్షవీక్షణాలకు అన్నివిధాలా పాత్రుడు.

‘వక్త’ తరగతులు నిర్వహించడంతో పాటు పూర్వవిద్యార్థుల కోరిక మేరకు ‘వక్త- ది ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్’ పేరుతో ఒక మంచి పుస్తకం రచించి బాల్ రెడ్డిగారు సమాజానికి చాలా ఉపకారం చేశారు. ‘వక్త’ కార్యక్రమంలో ఎదురైన అనుభవాలనూ,  ఆ కార్యక్రమంలో పాల్గొన్న శిక్షితుల మనసులో మెదలిన ఊహలనూ, భయసందేహాలనూ నివృత్తి చేసే సలహాలనూ, మెళకువలనూ కలగలిపి తేలికగా చదివి అర్థం చేసుకునే రీతిలో ఈ పుస్తకం రాయడం విశేషం. తపస్య, చైతన్య ఇద్దరు అమెరికాలో ఒక స్టార్టప్ కంపెనీలో సహచరులు. తపస్య, భార్య హరిణి అమెరికా వచ్చి అయిదేళ్ళయింది. తల్లిదండ్రులను చూసిరావాలన్న ప్రయత్నం లేదు. వారికి ఇద్దరు పిల్లలు అమెరికాలోనే పుట్టారు. అమెరికన్ సిటిజన్స్. చైతన్య, భారతికి పిల్లలు లేరు. అమెరికాలో కనడం ఇష్టం లేక పిల్లల్ని కనలేదు. ఇండియా తిరిగి వెళ్ళాలనీ, తల్లిదండ్రులతో కలసి ఉండాలనీ, అప్పుడే పిల్లల్ని కనాలనీ వారి నిర్ణయం. హరిణికి అత్తమామలతో మాట్లాడాలనే ఆసక్తి ఉండదు. తపస్య కూడా క్రమంగా తండ్రితో మాట్లాడటం తగ్గిస్తాడు. వారి జీవితంలో చైతన్య, భారతి పరోక్షంగా తెచ్చిన మార్పు కథా వస్తువుగా కథను లలితంగా చెబుతూ వక్తకు ఉండవలసిన లక్షణాలనూ, వక్తగా రాణించాలంటే చేయవలసిన ప్రయత్నాలనూ చెప్పడం బాల్ రెడ్డి గారు ఎన్నుకున్న ప్రక్రియలో విశేషం.

వక్తకు జ్ఞాపకశక్తి, చొరవ, కలుపుగోలుతనం, ప్రాప్తకాలజ్ఞత, ఎదుటివారి అభిప్రాయాలను గ్రహించే శక్తి మొదలైనవి ఉండాలంటూ నేరుగా పాఠాలు రాయడం కన్నా పరోక్షంగా ఒక కథ చెబుతూ అందులోని పాత్రల ద్వారా విషయం చెప్పడం మంచి వ్యూహం. చైతన్య ‘వక్త’ కార్యక్రమంలో శిక్షణ పొందాడు కనుక సమయానుగుణంగా, వేదికను బట్టి, సభికులను బట్టి ఏ విధంగా ప్రసంగించి రక్తికట్టించాలో తెలుసు. తమస్యకు విషయ పరిజ్ఞానం, విశ్లేషణాశక్తి విశేషంగా ఉన్నాయి. కానీ సభలో మాట్లాడాలన్నా, అధికారుల సమక్షంలో మాట్లాడాలన్నా సంకోచం. నోట మాట వెలువడదు. ఈ భయాన్ని పోగొట్టడంలో చైతన్య తాను ‘వక్త’ కార్యక్రమంలో నేర్చుకున్న మెళకువలు చెప్పడం ద్వారా తపస్యను మంచి వక్తగా మార్చుతాడు. ‘వక్త’ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరై శిక్షితులు నేర్చుకునే విషయాలన్నిటినీ సమగ్రంగా, ఆసక్తికరంగా, అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు ఈ పుస్తకంలో పాత్రల ద్వారా మాట్లాడిస్తారు రచయిత. ఎన్ టి రామారావు ఓంప్రథమంగా కృష్ణుడి వేషం వేసినప్పుడు సినిమా డైరెక్టరూ, ఇతరులు ఆయనలో జంకు పోగొట్టడానికి ఎటువంటి ప్రక్రియను అవలంబించారో తెలిపారు.

వ్యక్తిత్వ వికాసం గురించి చెల్లగుళ్ళ (రేపు) నరసింహారావు, డాక్టర్ బీవీ పట్టాభిరామ్, యండమూరి వీరేంద్రనాథ్ వంటి రాచయితలు రాసిన పుస్తకాలు చదివాను. వారి రచనల కంటే భిన్నంగా బాల్ రెడ్డిగారి ‘వక్త’ రచన సాగింది. చెప్పవలసిన విషయాన్ని స్పష్టంగా, హృదయానికి హత్తుకునే విధంగా చెప్పారు. సోక్రటీస్, మాక్స్ వెల్, అబ్రహాం మాస్లో, జార్జి వాషింగ్టన్, జవహర్ లాల్ నెహ్రూ, మార్టిన్ బ్రాడ్ వే, థిక్ నట్ హన్, హారీ పోటర్ రచయిత్రి జెకె రోలింగ్ నీ, క్యూబా క్రీడాకారుడు జేవియర్ సాటో మేయర్  వంటి అనేక మంది ప్రముఖులనూ, చారిత్రక వ్యక్తులనూ సందర్భశుద్ధితో, సమయస్ఫూర్తితో ఉటంకిస్తూ రచన అలవోకగా సాగింది. కల నుంచి కార్యాచరణకు ఎట్లా ప్రయాణం చేయాలో, అపోహలను ఎట్లా అధిగమించాలో, భయానికి ఎట్లా బై చెప్పాలో, జయానికి జై ఎట్లా చెప్పాలో, అంతఃశత్రువును ఎట్లా జయించాలో, స్వీయవిశ్లేషణ వల్ల ప్రయోజనాలు ఏమిటో, శరీర భాష (బాడీ లాంగ్వెజ్) ఎట్లా ఉండాలో, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం, పంచుకోవడం ఎలాగో, మాటే మంత్రం ఎట్లా అవుతుందో, ఉపన్యాసకళలో అభినయం పాత్ర ఏమిటో, ఉపన్యాసం ఎట్లా ప్రారంభించాలో, దాని గమనం ఎట్లా సాగాలో, ముగింపు ఎట్లా ఆలోచనాత్మకంగా ఉండాలో శ్రద్ధపెట్టి ఈ పుస్తకం చదివినవారికి అవగతం అవుతాయి. ‘స్టార్ట్ విత్ ఎ బ్యాంగ్ అండ్ ఎండ్ విత్ ఎ వింపర్’ అంటారు. కల్పిత కథలో మేళవించి విషయం అందజేసే ప్రయత్నం పూర్తిగా సఫలమైందని నా అభిప్రాయం. అర్థవంతమైన ఫోటోలనూ, చిత్రాలనూ ప్రచురించారు.  ‘వక్త’ కార్యక్రమంలో శిక్షణకు వచ్చిన అభ్యర్థులు మొదట్లో వణికిపోయినవారు. నోటి నుంచి మాట వెలువడేది కాదు. చెమటలు పట్టేవి. వణుకు వచ్చేది. అటువంటి వ్యక్తులు శిక్షణ పూర్తయి వెళ్ళబోయే ముందు ధైర్యంగా మాట్లాడటం చూశాం. ఈ పుస్తకం చదివినవారికి ఉపన్యాసకళలో మెళకులన్నీ కరతలామలకం అవుతాయని నిశ్చయంగా చెప్పవచ్చు. ఉపన్యాసం ధారాళంగా చేయాలని కోరుకునేవారికి కరదీపికలాగా ఈ పుస్తకం ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఇంత మంచి పుస్తకం రచించిన బాల్ రెడ్డిగారు ధన్యులు. ‘వక్త’ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలనీ, ఇటువంటి మనోవైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస గ్రంథాలను ఇంకా రాయలని ఆశిస్తున్నాను. తెలుగువారంతా తప్పకుండా చదువవలసిన పుస్తకం ఇది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles