పుస్తక పరిచయం
రచయిత: గోవిందరాజు చక్రధర్
సమీక్ష: మాశర్మ,
సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్
తెలుగువారికి ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరంలేని పేరు రామోజీరావు. “మీడియా మొగల్” గా రామోజీని ఎందరో అభివర్ణిస్తారు. ముఖ్యంగా ఆయన స్థాపించిన ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ ఛానల్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, రామోజీ ఫిలిం సిటీ మొదలైనవి ఈ ప్రభకు ప్రధానమైన భూమికలు. వీటితో పాటు ఉషాకిరణ్ బ్యానర్ పై ఆయన కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. ప్రియా పచ్చళ్ళు, కళాంజలి వంటి ఎన్నో విభాగాలు వీరి వ్యాపార సామ్రాజ్యంలో భాగమై ఉన్నాయి. రామోజీరావు అనగానే ఈనాడు. ఈనాడు అనగానే రామోజీరావు. ఈ గుర్తింపే ఆయనకు కూడా ఎంతో ఇష్టమైన అంశం. విజయానికి విలాసంగా, కీర్తికి చిహ్నంగా వర్ధిల్లుతున్న రామోజీరావుపై ఇటీవలే ఒక పుస్తకం వచ్చింది. అది రాసినవారు గోవిందరాజు చక్రధర్.
అనుభవజ్ఞుడైన జర్నలిస్టు, అధ్యాపకుడు
జర్నలిస్ట్ గా రెండు దశాబ్దాలు, జర్నలిజం పాఠాలు చెప్పిన అధ్యాపకుడిగా మరి రెండు దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. జర్నలిజంలో పరిశోధన చేసి డాక్టరేట్ కూడా అందుకున్నారు. అంతేకాదు. పాత్రికేయ పితామహులుగా ఎన్నదగిన పొత్తూరి వెంకటేశ్వరరావు, బూదరాజు రాధాకృష్ణ, రాంభట్ల కృష్ణమూర్తి వంటి లబ్ధప్రతిష్ఠులు రచించిన ఎన్నో పుస్తకాలను ప్రచురించిన పబ్లిషర్ కూడా. తాను స్వయంగా ఎన్నో రచనలు చేయడమేకాక, దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి వంటి అధ్యాపక శ్రేష్ఠుల రచనలు కూడా తన మీడియా హౌస్ పబ్లికేషన్స్ ద్వారా లోకానికి అందించారు. గోవిందరాజు చక్రధర్ జర్నలిజం ప్రస్థానం ఈనాడుతోనే ప్రారంభమైంది. నేడు తన మాతృసంస్థ అధినేతపైనే ప్రత్యేకంగా పుస్తకం రాసి, సంచలనం సృష్టిస్తున్నారు.
ఈనాడులో పుష్కరం పని
పుష్కరంపాటు ఈనాడులో పనిచేసిన సమయంలో తాను పొందిన అనుభవాల పునాదులపైనే ఈ పుస్తక నిర్మాణం జరిగినట్లుగా అర్ధమవుతోంది. తన వ్యక్తిగత అనుభవాలు, పరిశీలన, పరిశోధనతో పాటు ఈనాడుతో, రామోజీరావుతో బాగా అనుభవం వున్న వ్యక్తుల అభిప్రాయాలూ, అనుభవాలు, అనుభూతులు రంగరించి ఈ రచన చేశారు. ఈ పుస్తకానికి “రామోజీరావు- ఉన్నది ఉన్నట్టు” అనే పేరు పెట్టారు. ఉన్నది ఉన్నట్టుగా.. అని ట్యాగ్ లైన్ జోడించడమే ఇక్కడ విశేషం. 372 పేజీల ఈ పుస్తకంలో 9 ప్రధాన భాగాలు, 37అధ్యాయాలు ఉన్నాయి. ఈ పుస్తకం తను ఎందుకు రాయాల్సి వచ్చిందో, ఏ ఉద్దేశ్యం దాని వెనకాల వుందో రచయిత స్పష్టంగా వివరించారు. ఇందులో, రామోజీరావు విజయ ప్రస్థానంలోని వివాదాస్పదమైన అంశాలను కూడా చర్చించారు.
ధైర్యం, తెగువ
వివాదాస్పద విషయాలు చెప్పాల్సి వచ్చినా… హుందాగానే చెబుతాను, అని రచయిత ముందుమాటల్లో చెప్పినప్పటికీ, ఇలా చెప్పాలంటే చాలా ధైర్యం, తెగువ కావాలి. అవి ఈ రచనలో కనిపిస్తున్నాయి. (1) ది బిగినింగ్ (2) కళింగసీమలో ఉషోదయం (3) నేను చూసిన రామోజీరావు (4) స్టాఫ్ దట్ మేటర్స్ (5) కింగ్ మేకర్ (6) ఇన్నర్ ‘వ్యూ’లు (7) కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ (8) ఫోకస్ (9) ముగింపులేని కథ. ఇవి మొత్తంగా తొమ్మిది విభాగాలు. ఈ ప్రణాళికతోనే రచయితలోని సృజనశీలత తెలుస్తోంది. ఈ పుస్తకాన్ని “రామోజీ రాజ్య సౌధానికి రాళ్లెత్తిన శ్రమైక జీవులకు” అంకితం చేశారు. ఈ మాటలు కూడా రచయితవే. శ్రమైక జీవన సౌందర్యం పట్ల, స్వేచ్ఛ పట్ల, శ్రమ జీవుల పట్ల ఈ రచయితకు ఎంతటి గౌరవం ఉందో ఈ అక్షరాలే అద్దం పడతాయి.
ఆవిష్కరణ
“ది బిగినింగ్” అనే విభాగంలో మొట్టమొదటి అధ్యాయం ” రామోజీరావు అనే నేను”. ఈ అధ్యాయం ప్రారంభంలో, రామోజీని కవితారూపంగా ఆవిష్కరణ చేశారు. రామోజీ పట్ల రచయితకు ఎంతటి అనురాగభావం ఉందో, ఈ అక్షరాలే ప్రత్యక్షర సాక్ష్యాలు. అనురాగంతో పాటు, సైకలాజికల్ గా విశ్లేషణ చేశారు.
అతడే ఒక సైన్యం
అతడే ఒక సైన్యంగా అన్ని యుద్ధాలు అతనే చేశాడు, అందరినీ తన వెనకే నడిపాడు, అందరి ఆలోచనలూ తనే చేశాడు.. అనే మాటల్లో గడసరితనం కూడా కనిపిస్తోంది. “ఓటమిని కలలోకి కూడా రానివ్వని బలహీనుడు” అనే మాటలు రామోజీలోని “నేను”ను చూపిస్తాయి. బహుశా రామోజీరావును ఇంత బలవంతుడిగా నిలబెట్టింది ఈ ఆలోచనా విధానం, సంకల్పబలమే అయ్యివుంటాయి. మొదటి విభాగంలో రామోజీ వ్యక్తిగత వివరాలు, సంస్థల స్థాపన ఉన్నాయి. రెండవ విభాగం పేరు “కళింగసీమలో ఉషోదయం”. ఇందులో విశాఖపట్నంలో ఈనాడు స్థాపన, పరిస్థితులు, పత్రిక నిర్మాణంలో ప్రత్యేకతలు చాలా బాగా చెప్పారు.
పొందిన అనుభవాలూ, చూసిన దృశ్యాలూ
మూడవ విభాగం ” నేను చూసిన రామోజీరావు”. ఈనాడులో పనిచేసిన కాలంలో రచయిత స్వయంగా పొందిన అనుభవాలు, చూసిన దృశ్యాలు, గమనించిన మంచిచెడులను పొందుపరిచారు. “స్టాఫ్ దట్ మేటర్స్ ” నాలుగవ విభాగం. ఈనాడులో జరిగిన సమ్మెలు, ఉద్యోగస్తుల ఎంపిక విధానం, ఈనాడు నుంచి బయటకు వచ్చి, ఎదిగిన వారిని గురించిన విశేషాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.”కింగ్ మేకర్ “. ఈ ఐదవ భాగంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ, వికాసాల్లో రామోజీరావు, ఈనాడు పాత్రలను విపులంగా విశదపరిచారు.
రాజగురువు
ఆంధ్రజ్యోతి వారపత్రికలో రామోజీపై వచ్చిన కార్టూన్ విషయంలో జరిగిన విశేషాలను చాలా ఆసక్తికరంగా చెప్పారు. రామోజీని “రాజ గురువు” (కింగ్ మేకర్ ) గా ఈ అధ్యాయంలో అభివర్ణించారు. ఆరవ విభాగం “ఇన్నర్ “వ్యూ”లు. ఈనాడు,డాల్ఫిన్ సంస్థల మాజీ ఎండీ అప్పారావు, ఈనాడు వ్యవస్థాపక సంపాదకుడు ఎ బి కె ప్రసాద్, న్యూస్ టైమ్ అప్పటి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎస్ ఆర్ రామానుజన్,నాటి సర్క్యూలేషన్ అధిపతి ఎ వి ఎల్ ఎన్ రావు తో చేసిన ఇంటర్వ్యూలు ఈ విభాగంలోని ప్రత్యేకతలు. ఏడవ విభాగం “కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్”లో మార్గదర్శి వివాదం, దాసరి నారాయణరావు,సూపర్ స్టార్ కృష్ణతో వచ్చిన తగాదాలను చదువవచ్చు.
ఇన్ని విజయాలు ఎలా సాధించారు?
ఎనిమిదవ విభాగం “ఫోకస్ “. తెలుగు భాషా, సాహిత్యాలు, రచయితలంటే ఉండే గౌరవం, సొంత ఊరును దత్తత తీసుకున్న వైనం మొదలైనవి తెలుసుకోవచ్చు.”ముగింపులేని కథ ” తొమ్మిదవ విభాగం. ఈ చివరి అధ్యాయంలో, రామోజీ సామ్రాజ్యం భవిష్యత్తు గురించి వివరించారు. ఆద్యంతం ఏక బిగిన చదివేట్టుగా ఈ రచన సాగింది. రామోజీరావు ఇన్ని సంస్థలను ఇంతకాలం పాటు, ఇంత విజయవంతంగా ఎలా నడిపారు? ఇందరు వ్యక్తుల మధ్య చాకచక్యంగా ఎలా మెలిగారు? ఘర్షణల సమయంలో తన పోరాటపటిమను ఎట్లా చూపించార?, తన వ్యక్తిగత గుణగణాలేంటి ?ఆయన లోపలి మనిషికి -బయట మనిషికి ఏమైనా తేడా ఉందా? అనే అనేక విషయాలను ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు.
గెలుపే లక్ష్యం
గెలుపు ఒక్కటే లక్ష్యంగా సాగిన రామోజీ ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఉన్నాయి, ఎన్నో తీపి గురుతులు, చేదు జ్ఞాపకాలు దాగివున్నాయి, మరెన్నో వ్యూహ, ప్రతివ్యూహాలు ఉన్నాయి. ఆయనను అమితంగా ఆరాధించేవారు ఉన్నారు, ఏ మాత్రం ఇష్టపడనివారూ ఉన్నారు, అవసరం కోసం అభిమానంగా నటించేవారూ ఉన్నారు, బద్ధ శత్రువులూ ఉన్నారు, రోల్ మోడల్ గా భావించేవారూ ఉన్నారు, తటస్థులూ ఉన్నారు. ఇన్ని రకాలుగా ఇందరి హృదయాల్లో, జీవితాల్లో, మెదళ్ళలో, నాలుకలపై నడిచే రామోజీరావుపై డాక్టర్ గోవిందరాజు చక్రధర్ రాసిన ఈ పుస్తకం ఒక సమగ్ర సంపుటి అని చెప్పవచ్చు. ఇందులోని విషయాలు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. అది సాధారణమైన అంశమే.
పరిశోధన, పరిశ్రమ
ఎంతో పరిశోధన, పరిశ్రమ ఫలితంగా ఈ పుస్తకం ఇంతటి రూపాన్ని సంతరించుకున్నదని చదివిన ప్రతివ్యక్తికీ అర్ధమవుతుంది. ఈ పుస్తకం ఎన్నో విశేషాలనీ, జీవిత పాఠాలనూ చెబుతుంది. గోవిందరాజు చక్రధర్ చేయితిరిగిన రచయిత అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జర్నలిజంలోకి రాకముందే రచనా సృజన కలిగిన ప్రతిభావంతుడు. సృజనకు తోడు అనుభవసారం, ఆసక్తి అతనితో అనేక పుస్తకాలు రాయించాయి. ఇంకా ఎన్నో మంచి పుస్తకాలు ఈ రచయిత కలం నుంచి రావాలని అభిలషిద్దాం.
ప్రతులకు: గోవిందరాజు చక్రధర్ – 98498 70250