- నామినేషన్ల ఉపసంహరణపై ఎస్ఈసీ కీలక నిర్ణయం
- కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న వాలంటీర్లు
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. దీంతో ఉపసంహరణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపసంహరణ నోటీసులను యాంత్రికంగా అనుమతించవద్దని స్పష్టం చేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మూడో పక్షం నుంచి నామినేషన్ల ఉపసంహరణలను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించవద్దని అన్నారు. అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవటానికి సంబంధించిన కార్యకలాపాలను రిటర్నింగ్ అధికారులు వీడియో తీయాలని ఆదేశించారు. వీడియో ఫుటేజిని రికార్డుగా భద్రపరచాలని ఆదేశించారు. ఉపసంహరణలపై పలు రాజకీయ పార్టీలనుంచి ఫిర్యాదులు అందుతున్నాయని దీంతో వీడియో తీయాలని నిర్ణయించినట్లు ఎస్ఈసీ స్పష్టం చేశారు. ఎన్నికల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించారు. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశించారు.
Also Read: తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్ కు స్థానం లేదా!
నామినేషన్ల స్వీకరణకు హైకోర్టు బ్రేక్:
మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పలు చోట్ల మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. గత సంవత్సరం మార్చిలో పురపాలక ఎన్నికల నామినేషన్లు బలవంతపు ఉపసంహరణలు జరిగాయని పలు పార్టీల నుంచి ఫిర్యాదుల అందడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు పలు ప్రాంతాలలో తిరిగి నామినేషన్లు దాఖలు చేసుందుకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అవకాశం కల్పించారు. ఎస్ఈసీ నిర్ణయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎస్ఈసీ ఆదేశాలను నిలుపుదల చేస్తూ తీర్పు చెప్పింది.
వాలంటీర్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవద్దని ఆదేశం:
మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల సేవలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాజకీయ ప్రక్రియ నుంచి వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని ఎస్ఈసీ ఆదేశించారు. వాలంటీర్లు ఓటరు స్లిప్పుల పంపిణీ చేయరాదని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను వాలంటీర్లు ప్రభావితం చేయకుండా వాలంటీర్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించారు. కమిషన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే కోడ్ ఉల్లంఘనగా పరిగణిస్తామని హెచ్చరించారు.
Also Read: ఎన్నికల సంఘంపై టీడీపీ, వైసీపీల అసహనం
ఎస్ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం వాలంటీర్లపై ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. వాలంటీర్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.