- అష్ట భార్యలు, గోపికలు ఉన్నా రాధను కృష్ణుడు ఎందుకు ఇష్ట పడ్డాడు?
- కర్ణుడి కష్టాల కన్నా కృష్ణుడి కష్టాలే ఎక్కువా?
కృష్ణుడు అనగానే జీవిత సారాంశాన్ని ఉద్భోదించిన భగవద్గీత స్ఫురణకు వస్తుంది. ప్రతి మనిషి సైకాలజీ కృష్ణుని లో కనిపిస్తుంది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కృష్ణునికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన అసలు సిసలైన ఫిలాసఫర్. కృష్ణుడు అలౌకిక ఆనందానికి ప్రతిరూపం. కృష్ణ తత్వం గురించి ఎన్ని గ్రంథాలు వెలువడ్డా నిత్య నూతన బోధనల్లో శ్రీకృష్ణుని విశ్వరూపం కనబడుతుంది. పెంచిన తల్లి యశోదమ్మ మన్ను తిన్న కన్నయ్యను నోరు తెరవమనగానే సమస్త భూమండలం తో పాటు అన్ని గ్రహాలు చూసి సాక్షాత్తు విష్ణువు నా ఇంట్లో కొలువైనాడని బుజ్జి కృష్ణుని లీలలతో మొదలయ్యే కృష్ణ తత్వాన్ని మూడు పేరాల్లో రాయడం సాహసమే! అయితే ఇది ఒక ప్రయత్నం మాత్రమే.
కర్ణుడి హిత బోధ తో కృష్ణతత్వం వెళ్లడవుతుంది. కుంతి నిరాదరణతో గంగపాలై అతిరథుడి చేతిలో పడి కర్ణుడు రాధేయుడిగా సూత పుత్రుడిగా పెరగడం, పరశురాముని శాపం, బ్రాహ్మణ శాపాల వల్ల కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు దారుణమైన మరణాన్ని పొందుతాడు. ఇవన్నీ తనకు తెలియకుండా జరిగిన పాపాలుగా కర్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణునికి ఆవేదనతో చెబుతాడు. దానికి కృష్ణుడు రాధ పుత్రుడిగా అమ్మ ప్రేమను చవిచూసి అష్ట ఐశ్వర్యాలు పొందిన నువ్వే అలా అనుకుంటే నా చరిత్ర పరికిస్తే నేను పడ్డ కష్టాల్లో మీది ఎంత అంటూ కృష్ణుడు కర్ణునికి హిత బోధ చేస్తాడు. కర్ణుని ఆవేదన ముందు తెలుసుకుందాం.
“నేను పుట్టిన క్షణంలోనే నా తల్లి నన్ను విడిచిపెట్టింది. నేను క్షత్రియేతరుడిగా పరిగణించబడినందున ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పలేదు. పరాశరాముడి దగ్గర నేర్చుకున్న విద్యకు సార్థకత లేకుండా పోయింది. ద్రౌపది స్వయంవరంలో నన్ను అవమానించారు. కుంతి కూడా చివరకు తన కుమారులను కాపాడటానికి మాత్రమే నాకు నిజం చెప్పింది. నేను అందుకున్నది కేవలం దుర్యోధనుడి ప్రేమాభిమానాలు మాత్రమే. ఆయన వల్లే రాజు నయ్యాను. నేను కౌరవ పక్షంలో చేరడంలో ఎలాంటి తప్పు చేయలేదు. తాను పడ్డ కష్టాలు ఎవరు పడలేదని కర్ణుడు భావించాడు.
Also Read: ఆత్మ శుద్ధి లేని పూజలు దండగ!
దానికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ, “కర్ణా నేను చెరసాలలో పుట్టాను. నా పుట్టుకకు ముందే మరణం నా కోసం వేచి ఉంది. నేను పుట్టిన రాత్రే నా తల్లిదండ్రులకు దూరమయ్యాను. చిన్నతనం నుండి, మీరు కత్తులు, రథాలు, గుర్రాలు, విల్లు మరియు బాణాల శబ్దం విని పెరిగారు. నేను నడవడానికి ముందే నా జీవితంలో ఆవుల మందల్లో, పేడ దుర్వాసనాల్లో పెరిగాను. సైన్యం లేదు, విద్య లేదు. సమస్యలన్నింటికీ నేను కారణమని ప్రజలు చెప్పడం నేను స్వయంగా విన్నాను. యశోదమ్మ కు తలవంపులు తెచ్చాను.
మీ గురువులచే నువ్వు అందరి ప్రశంసలు అందుకున్నప్పుడు నేను ఏ విద్యను కూడా నేర్వలేదు. నేను 16 ఏళ్ళ వయసులో మాత్రమే సాందీపుని గురుకులంలో చేరాను. మీకు నచ్చిన అమ్మాయిని మీరు వివాహం చేసుకున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిలను ఘర్షణ ద్వారా పొందగలిగాను. నన్ను కోరుకున్న వారిని యుద్ధాలు చేసి భార్యలుగా స్వీకరించాను.
జరాసంధుడి నుండి నా రాజ్య ప్రజలను కాపాడడానికి నా మొత్తం సమాజాన్ని యమునా ఒడ్డు నుండి సముద్ర తీరానికి తరలించాల్సి వచ్చింది. అలా వెళుతున్నప్పుడు నన్ను పిరికివాడని సంబోధించారు. దుర్యోధనుడు యుద్ధంలో గెలిస్తే మీరు గొప్ప రాజుగా చలామణి అయ్యేవారు. ధర్మరాజు యుద్ధంలో గెలిస్తే నాకు ఏమి లభిస్తుంది? కురుక్షేత్ర యుద్ధానికి కౌరవ పాండవులు నాపై ఎన్నో నిందలు వేశారు.
ఒక విషయం గుర్తుంచుకో కర్ణా ప్రతి ఒక్కరికీ జీవితంలో సవాళ్లు ఉంటాయి. అవి ఎదిరించి నిలబడ్డప్పుడే మానవ జీవితానికి సార్ధకత అంటాడు కృష్ణుడు. ప్రతి మనిషి జీవితం ముళ్లబాటే. దాన్ని పూల బాటగా మార్చుకునే శక్తి మనలోనే ఉంటుంది. వేరే వాళ్ళ మీద నింద వేసే ముందు నీ మార్గం లో నువ్వు నిందలు రాకుండా చూసుకో ఇదే కృష్ణ తత్వం. కృష్ణతత్వం గీత బోధ ఒక్కటే కాదు మానవ జీవన అనుభవసారం. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం. అలౌకిక ఆనంద స్వరూపం. ఎనిమిది మంది భార్యలు, పదహారు వేల మంది గోపికలు ఉన్నా కృష్ణుని ఆత్మ రాధే. శారీరక సంబంధం కన్నా ఆత్మనందాన్ని రాధలో చవిచూశాడు శ్రీ కృష్ణుడు. రాజ నీతిజ్ఞునిగా, దైవత్వం, రూపం అన్నీ కృష్ణునికి మానవ జీవిత ఆభరణాలు. ఎనిమిది మంది భార్యలు ఉన్నా ఏ ఒక్కరిని అసంతృప్తి పరచకుండా శ్రీకృష్ణుడు అందరిని అక్కున చేర్చుకున్నాడు. యుద్ధాలు, పోరాటాల తోనే వారి మనసు గెలిచుకొని పట్టపు రాణులను చేశాడు. రుక్మిణీ, సత్యభామ, జాంబవతి, కాళింది, నగ్రాజితి, మిత్ర వింద, భద్ర, లక్షణ ఇలా రాణి వాసాల్లో వారి పాత్ర ను తక్కువ కాకుండా విశేష ప్రాధాన్యత ఇచ్చి సంసారం బాంధవ్యాల్లో కలతలు లేని ఆత్మీయత అనురాగాలను అందించాడు. ఇంతకీ కృష్ణ తత్వంలో రాధ పాత్ర ఏమిటీ? రాధ కృష్ణుని స్త్రీ రూపమా? కారణం రాధ పుట్టిన రోజును రాధాష్టమి గా జరుపుకుంటారు.
Also Read: స్వర్గం ఒక భ్రాంతి.. ఐశ్వర్యం – పేదరికం – పురుషాధిక్యత!
రాధను మానవ ఆత్మ యొక్క రూపకం వలె పరిగణిస్తారు. కృష్ణుడి పట్ల ఆమెకున్న ప్రేమను వేదాంతపరంగా ఆధ్యాత్మిక వృద్ధి మరియు దైవికత్వంతో ఐక్యత కోసం మానవ తపనకు ప్రతీకగా భావిస్తారు. ఆమె అనేక సాహిత్య రచనలను ప్రేరేపించింది. కృష్ణుడితో ఆమె రాస లీల నృత్యం అనేక రకాల ప్రదర్శన కళలను ప్రేరణగా నిలిచింది. హిందూ మతం యొక్క వైష్ణవివాదాలలో రాధ ఒక ముఖ్యమైన దేవత.
ఆమె లక్షణాలు, వ్యక్తీకరణలు, వివరణలు మరియు పాత్రలు ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. ప్రారంభ భారతీయ సాహిత్యంలో, ఆమె గురించి ప్రస్తావించడం అస్పష్టంగా ఉంది. ఆమెను గౌరవించే సంప్రదాయాలు దీనికి కారణం. ఎందుకంటే ఆమె పవిత్ర గ్రంథాలలో దాగి ఉన్న రహస్య నిధి. పదహారవ శతాబ్దంలో భక్తి ఉద్యమ యుగంలో, కృష్ణుడిపై ఆమెకున్న ప్రేమ అసాధారణమైనది.
12 వ శతాబ్దంలో జయదేవ రాసిన గీత గోవిందలో రాధా మొదటిసారి కనిపించారు. ఆమె చివరి పురాణ గ్రంథాలలో పద్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం మరియు దేవి భాగవత పురాణం లో కూడా రాధ కనిపిస్తుంది. రాధ జన్మస్థలం రావల్, ఇది గోకులానికి సమీపంలో ఉంది, కాని దీనిని బర్సనా అని అంటారు. కృష్ణుడు బర్సనాకు వెళ్లి, రాధ ప్రేమలో పడతాడు రాధాకృష్ణులు రెండు రకాల సంబంధాలను పంచుకుంటారు. పారాకియా (ఎటువంటి సామాజిక పరిమితి లేని ప్రేమ) మరియు స్వకియా (వివాహిత సంబంధం). ఆమెను ఎందుకు వివాహం చేసుకోలేనని రాధ కృష్ణుడిని అడిగింది. దీనికి సమాధానం వచ్చింది “వివాహం అనేది ఇద్దరు ఆత్మల సంయోగం. మీరు నేను ఒకే ఆత్మ, నేను నన్ను ఎలా వివాహం చేసుకోగలను? అంటుందట రాధ. అనేక హిందూ గ్రంథాల్లో రాధా కృష్ణుల గురించి వివిధ రకాలుగా వర్ణించారు. భండిర్వన్ అడవిలో బ్రహ్మ మార్గదర్శకత్వం కృష్ణుడు రహస్యంగా రాధను వివాహం చేసుకున్నట్లు బ్రహ్మవైవర్త పురాణం లో పేర్కొన్నారట. స్వాకియా (వివాహిత సంబంధం) పై పారాకియా సంబంధానికి (ఎటువంటి సామాజిక పునాది లేని ప్రేమ) ప్రాముఖ్యత ఇవ్వడానికి, ఈ వివాహం ఎప్పుడూ ప్రాచుర్యం లోకి రాలేదు. వేద గ్రంథాల ప్రకారం, కృష్ణుడు కేవలం ఎనిమిదేళ్ళ వయసులో రాధతో ప్రేమలో పడ్డాడు. ఆమె పట్ల అతనికున్న ప్రేమ పవిత్రం.
శ్రీకృష్ణుడు తన జీవితంలో మరే ఇతర వ్యక్తులకన్నా, వస్తువులకన్నా ఎక్కువగా రాధను,తన వేణువును మాత్రమే ప్రేమిస్తున్నాడని నమ్ముతారు. ఒకరోజు వేణుగాన లోలుడు రాధ కలలో ప్రత్యక్ష మవుతాడు. ఆయన్ను చూడాలనే తపన రాధకు మొదలవుతుంది. అనుకున్నదే తడవుగా వెంటనే ద్వారకకు వెళుతుంది. కృష్ణుడి ఆనందానికి అవధులు ఉండవు. రుక్మిణీ సత్యభామ. మరో ఆరుగురిని వివాహమాడిన వైనాన్ని తెలుసుకొని కూడా రాధ కృష్ణుడిని ఆరాధన తత్వంలోనే చూస్తుంది. అందుకే రాధాకృష్ణల ప్రేమ పవిత్ర ప్రేమ గా వర్ణించారు. ఇదీ వైవాహిక జీవిత కృష్ణ తత్వం. విష్ణువు యొక్క సంపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడిని అందరూ ఎంతో ఆరాధిస్తారు. అయినప్పటికీ, అతను ఒంటరిగా మరణించాడని నమ్ముతారు.
Also Read: వివాహ వ్యవస్ధ పయనం ఎటు?
పురాతన కథనం ప్రకారం, కౌరవ పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత కృష్ణుడు ద్వారక కు వచ్చి ప్రశాంత జీవనంతో పాటు రాజ్యపాలన చేస్తుంటాడు. యుద్ధం తరువాత, శ్రీకృష్ణుడు దుర్యోధనుడి తల్లి గాంధారిని కలవడానికి వెళతాడు. వంద మంది పుత్రులను కోల్పోయి అపారమైన పుత్ర శోఖం లో ఉన్న గాంధారి కృష్ణుడిని చూడగానే కోపంతో, ముప్పై ఆరు సంవత్సరాల తరువాత దిక్కు లేని చావు చస్తావని శ్రీకృష్ణుడిని శపిస్తుంది. ద్వారక రాజ్యం లో ముసలం పుట్టి మొత్తం యాదవ వంశం ఆమె శాపం కారణంగా అంతరించిపోతుంది. కృష్ణుడు ఒక రోజు తన కర్మ ఫలం తెలుసు కాబట్టి నవ్వుతూనే గాంధారి శాపాన్ని స్వీకరించాడు. అయినా కృష్ణుడు వైరాగ్య జీవితం లోకి వెళ్లి పోకుండా ఒక అడవిలో నివసించడానికి వెళతాడు.
అడవిలో ఒక వేటగాడు చెట్టు క్రింద సేద ధీరుతున్న కృష్ణుని బొటన వేలు చూసి జింక గా భావించి విష పూరిత బాణాన్ని వదులుతాడు. బాణం కృష్ణుడి పాదంలోకి దిగి కన్ను మూసే లోపు ఈ భయంకరమైన దృష్టాంతాన్ని చూసిన వేటగాడు కృష్ణుడికి క్షమాపణ చెప్ప బోతాడు. అప్పటికే కృష్ణుడు నిర్యాణం చెందుతాడు. తన మరణం తన కర్మ ఫలితమేనని వేటగాడితో అన్నాడని పురాణ గ్రంధాలలో ఉంది. రాముడిగా తన మునుపటి జన్మలో అతను పొదలు చాటు నుండి వానర రాజు వాలిని (కిష్కింధ రాజు) ను చంపాడు. అందువలన ఈ జన్మ లో యాదృచ్చికంగా వేటగాడు వేసిన బాణానికి కృష్ణుడు కన్నుమూస్తాడు. వేటగాడు జారా! పూర్వ జన్మలో వాలి కుమారుడు అంగదుడు అంటారు.
అందువల్ల, ‘స్వయం భగవాన్’ అని సంబోధించిన కృష్ణుడిలాంటి భగవంతుడు కర్మ నుండి తప్పించుకోలేనప్పుడు మానవులమైన మనమెంత! అందుకే భగవద్గీత హిందువులకు పవిత్ర గ్రంథం అయింది. కృష్ణ తత్వం జీర్ణించుకుంటే మనం అనుభవిస్తున్న లౌకిక సుఖాలను అదుపులో ఉంచుకోగలుగుతాం.