- జహీర్ ను అధిగమించిన అశ్విన్
భారత స్పిన్ జాదూ, ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలిరోజు ఆటలో 3 వికెట్లు పడగొట్టడం ద్వారా ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ పేరుతో ఉన్న 597 అంతర్జాతీయ వికెట్ల రికార్డును అధిగమించాడు. అంతేకాదు రెండోరోజు ఆటలో మరో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్టు క్రికెట్లో 400 వికెట్ల మైలురాయిని సైతం చేరుకోగలిగాడు.
మురళీధరన్ తర్వాత అశ్విన్:
Also Read: సిక్సర్ల బాదుడులో రోహిత్ ను మించిన గప్టిల్
దశాబ్దాల చరిత్ర కలిగిన సాంప్రదాయ టెస్టు క్రికెట్లో అత్యధిక వేగంగా 400 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ గా, స్పిన్నర్ గా, భారత తొలిబౌలర్ గా అశ్విన్ రికార్డుల్లో చేరాడు. స్పిన్నర్ల అడ్డాగా మారిన నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ పైన అశ్విన్ రెండోరోజుఆటలోనూ తన జోరు కొనసాగించాడు. మిడిలార్డర్ ఆటగాడు ఓలీ పోపీ, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, హార్డ్ హిట్టర్ జోఫ్రా ఆర్చర్లను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ 400 వికెట్ల క్లబ్ లో చోటు సంపాదించగలిగాడు. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కేవలం 72 టెస్టుల్లోనే 400 వికెట్లు సాధిస్తే ఆ తర్వాత అత్యంత వేగంగా 77 టెస్టుల్లోనే అశ్విన్ 400 టెస్టు వికెట్లు సాధించని బౌలర్ గా నిలిచాడు.
600 అంతర్జాతీయ వికెట్లు:
అత్యధిక అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన భారత మొదటి నలుగురు బౌలర్ల వరుస నాలుగోస్థానంలో అశ్విన్ నిలిచాడు. టెస్టు తొలిరోజుఆటలో ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆటగాడు ఓలీ పోపేని పడగొట్టడం ద్వారా అశ్విన్ తన కెరియర్ లో 599వ వికెట్ సాధించాడు. రెండోరోజు ఆటలో మరో మూడు వికెట్లు సాధించడం ద్వారా 602 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు.
Also Read: స్వదేశీ సిరీస్ ల్లో పులి భారత్
భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన మొదటి ముగ్గురు బౌలర్లలో అనీల్ కుంబ్లే 953 వికెట్లు, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 707 వికెట్లు, కపిల్ దేవ్ 687 వికెట్లతో ఉన్నారు. అశ్విన్ 602 వికెట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. జహీర్ ఖాన్ 597 వికెట్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు.