ప్రశ్నించలేని సమాజాన్ని మనం ప్రజాస్వామ్యమని ఎంతమాత్రమూ అనలేము…! అసలు ప్రజాస్వామ్యమంటేనే ప్రజలకోసం, ప్రజలచే, ప్రజలతో నడిపే ఒక ప్రజా ప్రభుత్వమని మన పవిత్ర భారతరాజ్యాంగం చెప్తోంది…
అలాంటి రాజ్యాంగ రక్షణకు, మన ప్రజాస్వామ్య పరిరక్షణకు, మన దేశ సమాఖ్య – సమైక్య స్ఫూర్తిని నిలపడానికి, ముఖ్యంగా “ప్రజల” కోసం, ఎల్లప్పుడూ ప్రశ్నించే ప్రజలు, మేధావులు, ప్రజా-పక్షాలు, ప్రతిపక్షాలు ఎప్పటికీ ప్రధానమైన, ప్రాణాధారమైన అవసరాలు…
ప్రజాస్వామ్యం, వ్యక్తిసామ్యం:
సరైన ప్రతిపక్షం, ప్రశ్నించే ప్రజలు, ప్రజాపక్షాలు లేకపోతే ప్రజాస్వామ్యం ఖచ్చితంగా వ్యక్తిస్వామ్యం వైపు ‘భజన’స్వామ్యం ద్వారా రాజకీయ’చెంచా’స్వామ్యంగా మారి క్రమంగా నియంతృత్వంగా రూపుదిద్దుకునే ప్రమాదం ఎంతైనా వుంది…!
దిల్లీలో రైతుల పోరాటం:
ఇదంతా, ఇప్పుడెందుకు చెప్పాలనిపించిందంటే… ఎక్కడో పాకిస్తాన్ బోర్డర్ లోని, అమృతసర్ దగ్గరలోని ఒక మారుమూలపల్లెలో ఉండే నా పంజాబీ స్నేహితుడు సర్దార్ అవతార్ సింగ్ పోయినవారం నాకు ఫోన్ చేసశాడు… పాపం వాళ్లంతా గడచిన మూడు నెలలుగా, వణికించే- ఎముకలుకోరికే చలిని కూడా లెక్కచేయకుండా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒక గొప్ప పోరాటం చేస్తున్నారు…
Also Read: నేనూ… నా స్వేచ్ఛ… నా స్వాతంత్రం…
ఒకరకంగా పంజాబ్, హర్యానాలోని రైతులంతా కుటుంబానికొక్కరిచొప్పున ఈ ప్రజా ఉద్యమంలో మూణ్నెళ్లుగా నిరవధికంగా పాల్గొంటున్నారు… కొద్దిరోజులక్రితమే మన గౌరవనీయ ప్రధాని గారు పార్లమెంట్లో నూతన వ్యవసాయ చట్టాలవల్ల రైతులకు ఎంతమాత్రం అన్యాయం జరగదనీ, ఒకవేల జరిగితే నాదే బాధ్యత అనీ, నాదీ పూచికత్తు అంటూ ప్రకటించిన విషయం గుర్తుకొచ్చి అవతార్ సింగ్ కు కంగ్రాట్స్ చెప్పాను… దానికి సింగ్ గారు ఇచ్చిన సమాధానం నా జీవితంలో మరచిపోలేను…!
ప్రత్యేకహోదా హామీ ఏమైంది?
“కొన్నేళ్ళక్రితం మా మన్మోహన్ సింగ్ సాబ్ పీఎం గా ఉన్నప్పుడు కూడా మీ ఆంధ్రాకు కూడా ఇలాగే పార్లమెంట్లో స్పెషల్ స్టేటస్ ఇస్తానని వాగ్దానం చేశాడు కదా భాయ్…!… అప్పుడు మెయిన్ అప్పోజిషన్ పార్టీ అయిన బీజేపీ వెంకయ్య నాయుడుజీ, అరుణ్ జైట్లీజీ ఎంతో దీనంగా పదే పదే రిక్వెస్ట్ చేస్తేనే మరీ ఆ స్పెషల్ స్టేటస్ మీకు మన్మోహన్ జీ గ్యారంటీ ఇచ్చారు కదా…!
అప్పుడున్న ప్రత్యక్షసాక్షులు పెద్ద పెద్ద బీజేపీ నాయకులు, ఆ తర్వాత ఎందరో సెంట్రల్ మినిస్టర్స్ కూడా అయ్యారు… స్వర్గీయ అరుణ్ జైట్లీ సాబ్ అయితే ఆయనే తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అయినా కూడా, ఆ తర్వాత అదే వెంకయ్యనాయుడు సాబ్ పేద్దమినిస్టర్, తర్వాత ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ అయినా కూడా మీకేమొచ్చింది…?
పీఎం పార్లమెంటులో ఇచ్చిన హామీకే దిక్కులేదు:
ప్రైమ్ మినిస్టర్ అఫ్ ఇండియా పార్లమెంట్లో ఇచ్చిన హామీ విలువ, గ్యారెంటీ అంటే ఇండియాలో అయితే అంతే భాయ్…! మీకిచ్చిందే మాకూ ఇస్తారు… దాన్ని నువ్వెలా నమ్ముతున్నావు భయ్యా…!” అన్నాడు.
అవతార్ సింగ్ వివరంగా చెప్పాక నాకనిపించింది… పార్లమెంటులో ప్రధాని గారు చెప్పినట్టు నిజంగా రైతులకోసమే ఈ చట్టాలు చేసి ఉంటే, రైతులకు అవే విషయాలు విపులంగా, వివరంగా వివరించగలిగినట్లైతే, రైతులకే నమ్మకం కల్పించగలిగినట్లైతే, ఈ సమస్య ఎందుకు ఇంకా పరిష్కారం కావట్లేదు…?
పార్లమెంట్లో అందరు ఎంపీలతో, విడిగా బయట రైతు నాయకులతో విస్తృతమైన చర్చ చేసి అందరి సమ్మతి, అనుకూలత సాధించవచ్చు… అన్ని రైతు వర్గాలని, సంఘాలని సంఘటిత పరిచి రైతులకు చేస్తున్న ఆ మంచిని వారికే అర్ధమయ్యే రీతిలో చెప్పొచ్చు…
Also Read: “ఆంధ్రుల” హక్కులంటే అందరికీ “అంత” అలుసా…?
రాజకీయ పక్షాల వైఫల్యం:
మన దేశంలో ప్రతిపక్షాల, ప్రజాపక్షాల, రాజకీయ పార్టీల వైఫల్యమే ఇలాంటి సమస్యలకు మూలకారణం అనిపించింది… ప్రతిపక్షాలు, ప్రజపక్షాలు, రాజకీయ పక్షాల పాత్ర ప్రజాస్వామ్యంలో నామమాత్రమైనప్పుడు ఇలాంటి సమస్యలు ఇలా ఎంతో ఎక్కువవుతాయి, పెద్దవవుతాయి…
గడచిన మూడు నెలలుగా, రైతులు పెద్దఎత్తున ఢిల్లీలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న ప్రజా ఉద్యమానికి ఎన్నో రాజకీయ పక్షాలు ప్రధానంగా కాంగ్రెస్, శివసేన, ఎన్.సి.పి, వామపక్షాలు, అకాలీదళ్, టీఎంసీ, డీఎంకే, టీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ…వంటి ఎన్నో రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించినప్పటికీ, ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీ ఈ ఉద్యమానికి సారథ్యం వహించడంలేదు…
ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం పోతోంది:
ఎలాంటి రాజకీయ చైతన్యం లేని, ప్రజా సమస్యలపట్ల చైతన్యం, అవగాహనహనా లేని పార్టీల వల్ల, నేతలవల్ల, నాయకులవల్ల ప్రతిపక్షాల, రాజకీయపక్షాల పట్ల ప్రజల్లో విశ్వసనీయత, నమ్మకం తగ్గిపోతాయి… ప్రతిపక్షాలు చొరవతీసుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి… ఇప్పుడు దురదృష్టవశాత్తూ జాతీయ స్థాయిలో ఒక్క దీటైన ప్రతిపక్షం కూడా కొరవయ్యింది…!
ఇలాంటివన్నీ ముందే ఊహించే రాజ్యాంగనిర్మాతలు, అసలు భారత రాజ్యంలో, రాజ్యాంగంలో ఆశించిన ప్రతిపక్షం పాత్ర ఏమిటి అంటే… ప్రతిపక్షాల ప్రధాన పాత్ర ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలకు జవాబుదారీగా ఉంచడం’… ఇది ఆధిపత్య/రూలింగ్/పాలక పార్టీ తప్పులను నిలదీయదానికే పరిమితంకాక, పరిష్కరించడానికి కూడా సహాయపడాలి అని…
ప్రతీపక్షాల బాధ్యత:
దేశ ప్రజల, దేశ విశాల ప్రయోజనాలను సమర్థించడంలో, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన సమయాల్లో ప్రతిపక్షాలు కూడా అంతే బాధ్యత వహించాలి… అలాంటి సందర్భాలలో, చిల్లర రాజకీయాలకు పాల్పడకుండా చాలా హుందాగా వ్యవహరించాలి…
అయితే, ప్రతిపక్షాలపై ప్రభుత్వం కూడా ఆధారాలు లేకుండా విద్వేషాలతో ఎటువంటి ప్రతీకార చర్యలు తీసుకోకుండా చూసుకోవాలి… ఇలాంటి చర్యలు దేశ ప్రజలపై, ప్రజాస్వామ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి…
చట్టసభల్లో ప్రతిపక్షాల పాత్ర ప్రాథమికంగా పాలక లేదా ఆధిపత్య/రూలింగ్/పాలక పార్టీ మితిమీరిన వాటిని, అవినీతిని, అన్యాయాల్ని, ఆశ్రితపక్షపాతాన్ని ప్రశ్నించడం, ప్రజలకు జవాబుదారీగా ఉంచడం, తనిఖీ చేయడం వరకూ ఎలాంటి పక్షపాతం లేకుండా ఉండాలి… దీనికి పూర్తిగా విరుద్దంగా ఉండకూడదు…
Also Read: బడ్జెట్ తో ఎన్నికల రాజకీయాలా …?
అధికారపార్టీ వైఖరి:
అధికార పార్టీ చర్యలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే, మంచి పథకాలు, కార్యక్రమాలకి ప్రతిపక్షాలు మద్దతు కూడా ఇవ్వాలి… చట్టసభల్లో ప్రతిపక్ష పార్టీకి ప్రధాన పాత్ర ఉంది… ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శ… అధికార పార్టీ ఏకపక్షానికి పరిమితి పెట్టడం… ప్రజల స్వేచ్ఛనూ, హక్కులనూ పరిరక్షించడం…
ప్రభుత్వానికి ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడంలో నిర్మాణాత్మక సహకారం అందించడం… ప్రజాభిప్రాయాన్ని ఎల్లవేళలా కాపాడటం…వంటివి… దేశం లో ఎక్కడ ఇంతటి నిర్మాణాత్మక ప్రతిపక్ష – అధికారపక్ష సమ్మేళనం ఉంటే అక్కడ ప్రజాస్వామ్యానికీ, ప్రజలకూ, సమాఖ్య – సమైక్య వ్యవస్థకూ ఎంతో మేలు జరుగుతుంది…
అసహనం నియంతృత్వానికి తొలిమెట్టు:
అసహనం నియంతృత్వానికి తోలి మెట్టు… సహనం లేని వాడు ఎన్నడూ నాయకుడు కాలేడు… చరిత్రలో నిలవలేడు… ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారూ ఉండాలి… అసమ్మతీ ఉండాలి… ప్రతిపక్షాలు, ప్రజాపక్షాలు ప్రశ్నించాలి… నిజమైన నాయకులు అందరి సమ్మతినీ, సర్వసమ్మతి పొందేలాగా కృషి చేయాలి, సమాధానపరచాలి, ఒప్పించాలి, మెప్పించాలి… అదే నాయకత్వ లక్షణం…
స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఇలాంటి ఎన్నో పరిస్థితులు ఎదురయ్యాయి… ఎందరో అసమ్మతి వాదులు, హింసావాదులు ఉన్నప్పటికీ అందర్నీ కలుపుకునే, ఉద్యమంతో ముందుకెళ్లారు… అయితే మొత్తం జాతీయోద్యమంలో అబ్దుల్ కలాం ఆజాద్, మదన్ మోహన్ మాలవీయ, సరోజినీ నాయుడు, మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రు, బాబు రాజేంద్రప్రసాద్, సుభాష్ చంద్ర బోస్ వంటి ఉద్దండులు కాంగ్రెస్ కు సమర్థవంతమైన నాయకత్వం వహించడం వల్ల అది ప్రధానంగా రాజకీయ పోరాటం కాగలిగింది…
కాంగ్రెస్ లో అన్ని రకాల నాయకులూ ఉండేవారు:
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం, ప్రతిపక్షం, అసమ్మతి ఎప్పుడూ ఉండేవి… సుభాష్ చంద్ర బోస్ అయితే 1939లో గాంధీ అభీష్టానికి విరుద్ధంగా రెండవసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీచేసి, ఆయన గాంధీ గారి అభ్యర్థి పట్టాభి మీద విజయం సాధించాడు… అప్పట్లో అదో గొప్ప సంచలనం…
కాంగ్రెస్‌లో గాంధీ తొలి ప్రత్యర్థి చిత్తరంజన్ దాస్. గాంధీజీ తో ఎంతగానో విభేదించేవారు… కాంగ్రెస్ లో ఎన్నో విభేదాలు, వాదాలు, వాదనలు, విధానాల మధ్య సంఘర్షణ ఉండేది… ఎందరో అసమ్మతి వాదులు, హింసా వాదులతో కాంగ్రెస్ పార్టీ నిరంతరం నిండి ఉండేది…
అహింసావాదంతో గాంధీ సహాయనిరాకరణోద్యమాన్ని నిలిపివేయడాన్ని నేషనల్ కెలామిటీగా అభివర్ణించి మొదటిసారి బోస్ కూడా తన గాంధీ వ్యతిరేక స్వరాన్ని వినిపించాడు… అది మొదలు చివరిదాకా బోస్ కాంగ్రెస్‌లో గాంధీకి సమాంతర పాయనొకదాన్ని ప్రవహింప చేస్తూ వచ్చాడు…
Also Read: రాజకీయ రణ’తంత్రం’ గా మన ప్రజా ‘గణతంత్రం’!
నెహ్రూతో పటేల్ విభేదాలు:
స్వాతంత్య్రానంతరం ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో, అప్పటి సెంట్రల్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కు విదేశాంగ, అంతర్గత హోంశాఖ విధానాల విషయాల్లో ఎన్నో విభేదాలు ఉండేవి… కానీ ఆయన రాజ్యాంగానికి లోబడి, పార్టీ క్రమశిక్షణకు లోబడి ఎంతో హుందాగా అయన అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు. మార్గాలు వేరైనా అసమ్మతి, ప్రతిపక్షం ప్రతిపార్టీకీ, ప్రభుత్వానికీ అత్యంత అవసరం… ఆత్మావలోకనం చేసుకోలేని బానిస భావజాలం ఆత్మహత్యసదృశం…
మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ కూడా ఎన్నో కొన్ని మంచిపనులు చేసినప్పటికీ కూడా కేవలం ఒక్క ఎమర్జెన్సీ వల్ల, నియంతృత్వంవల్ల ఆమెను ఇప్పటికీ ఒక నియంతగానే చరిత్రలో మిగిలిపోయారు… ఆమెను తరచూ విమర్శించేవారు తమను,తాము కూడా ఆత్మావలోకనం చేసుకోవడం ఎంతైనా మంచిది…!
మోదీ కంటే రాజీవ్ కి ఎక్కువ మెజారిటీ:
ఇప్పటి బీజేపీ కంటే, ప్రధాని మోదీ కంటే కూడా గతంలో అప్పటి కాంగ్రెస్ పార్టీకి, మాజీప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీకి లోక్‌సభలో అత్యధిక మెజారిటీ ఉండేది… అయినప్పటికీ అప్పట్లో ఏకమైన ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీని, రాజీవ్ గాంధీని గడగడలాడించాయి…
అప్పట్లో కాకలుతీరిన కమ్యూనిస్ట్ నాయకులూ, ఉద్దండులు ఇంద్రజిత్ గుప్తా, సోమనాథ్ ఛటర్జీ, గురుదాస్ దాస్ గుప్తా, నంబూద్రిపాద్, వీపీసింగ్, అటల్ బిహారీ వాజపేయి, ఎల్ కే అద్వానీ… వంటి యోధానుయోధులైన ప్రతిపక్ష నాయకులతో అప్పట్లో పార్లమెంట్, భరత ప్రజాస్వామ్యం పులకించిపోయేది…
ప్రజాసమస్యల పట్ల ఎంతో శ్రద్ధ, దేశం పట్ల ఎంతో అపేక్ష, భక్తి ఆ రోజుల్లో అన్ని పార్టీల్లో, నేతల్లో తొణకిసలాడేవి. ఇప్పటి ప్రతిపక్షాల్లో అలనాటి వారసత్వం, దేశభక్తి, పోరాట పటిమ, నిబద్ధత ఏ మాత్రం కనపడడం లేదు… ఇది చాలా దురదృష్టకరం… ఎంతో ఆందోళనకరం…
అంతర్గత ప్రజాస్వామ్యం:
అంతర్గత ప్రజాస్వామ్యం లేని ఇప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి గతకొన్నిసంవత్సరాలుగా దేశ ప్రజల పక్షం వహించే నైతికత, ప్రజాబలం, మానసిక స్థైర్యం కొరవడింది… నియంతృత్వపోకడలతో, ఏకపక్షంగా ఆంధ్రా ప్రజలకు సోనియా నాయకత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసానికి, నీచ-నికృష్ట, వంచక, రాజకీయ కుట్రలకు, కుతంత్రాలకు ఆ పార్టీ ఎప్పటికైనా సమాధానం చెప్పాలి…?
ప్రజాపక్షం వహించి, ప్రజలసమస్యల్ని ఉపయోగించుకోగలిగి, ప్రజాపోరాటాలకు సారధ్యం వహించే రాజకీయ చాతుర్యం, నాయకత్వం, తెలివితేటలూ, శక్తియుక్తులు ఇప్పటి ప్రతిపక్షాలకు లేవు… వందిమాగధులు, చెంచాలు, భజనపరులు, భట్రాజులు దండిగా ఉన్న సోనియా-రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రాభవం రోజు రోజుకూ క్షీణిస్తోంది..
ఇప్పుడు రాజకీయం మరీ దారుణం:
దేశంలో ఎవరైనా ఎక్కడైనా విజయం సాధించినా, ఏమాత్రం నిలదొక్కుకున్నా, ఏ నేత అయినా ఏ పార్టీ అయినా బలపడినా ఆ నేతల్ని, ఆ పార్టీని సమూలంగా సామ, దాన, బేధ, దండోపాయాలతో ఆర్థిక మూలాలు కూడా దెబ్బతీసి మరీ నిర్మూలించే రాజకీయ విధానాలు ఈరోజుల్లో దేశవ్యాప్తంగా అమలవుతున్నాయనే వార్తలు తరచూ వింటున్నాము… ఇదే నిజమైతే, ప్రజాస్వామ్యానికీ, ప్రజలకూ నిజంగా ఇది ఎంతో గడ్డుకాలం… కష్టకాలం…
ఎక్కువశాతం అన్నిపార్టీల్లోనూ కుటుంబ నాయకులూ, ఆశ్రితులూ, వందిమాగధులు, చెంచాలు, భజనపరులు, భట్రాజులు తప్ప బలమైన, సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం ఇప్పుడు లేదు… ఇవాళ దేశంలో ధీటైన నాయకులూ, ప్రతిపక్షం అంటూ లేని పరిస్థితి ఏర్పడింది… ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజలకూ ఏమాత్రం మంచిది కాదు…!
Also Read: నేను “మనిషి”ని…
ప్రశ్నించలేని పక్షాలు దండగ:
ప్రశ్నించలేని ప్రజలు, ప్రజాపక్షాలు, ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం… భారత రాజ్యాంగానికీ, ప్రజలకూ, దేశానికీ ఎంతో హానికరం… కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రాల్లోనూ, కేవలం అసెంబ్లీల్లోనే కాదు, భారత పార్లమెంట్‌లో కూడా ఎన్నో సందర్భాల్లో పార్టీలను, నేతలను గొంతెత్తకుండా, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రజాస్వామిక ప్రమాణాలను కూడా పాటించకుండా, రాజ్యాంగాన్ని కూడా విస్మరించి, ప్రతిపక్షాలను పూర్తిగా అదుపుచేసి, నిర్మూలించి, నశింపచేస్తున్నారు… వారు అనుకున్నవి సాధించుకొంటున్నారు.
దేశంలో ప్రజల ఆందోళనకు బలమైన స్వరాన్ని ఇచ్చే నాయకులూ, పార్టీలు, ప్రజలు, మేధావులు, ప్రతిపక్షాలూ, ప్రజాపక్షాలూ లేకపోతే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడే ప్రమాదం ఎల్లపుడూ పొంచివుంది… ఉంటుంది…
ప్రజారక్షణకు, ప్రజాస్వామ్య – రాజ్యాంగ పరిరక్షణకు, ఫెడరల్- సమైక్య స్ఫూర్తికి దీటైన ప్రతిపక్షం ఒక ప్రధాన అవసరం… దయచేసి మన పవిత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడండి…
జై హింద్ … భారత మాతకు జై…