హైదరాబాద్: తాను ఏ విషయంలోనూ తొందరపడటం లేదనీ, తాను పార్టీ పెట్టిన తర్వాత కూడా ఇతర పార్టీల నాయకులను తన పార్టీలోకి ఆహ్వానించే ఉద్దేశం తనకు లేదనీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల స్పష్టం చేశారు. శనివారంనాడు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి తనను కలుసుకోవడానికి వచ్చిన వైఎస్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తన తండ్రి అభిమానులు ఎక్కడ ఉన్నా తామంతట తాము తన పార్టీలోకి రావాలనీ, ఎవ్వరినీ ప్రత్యేకించి ఆహ్వానించే ఉద్దేశం లేదనీ అన్నారు. సుమారు 750 మంది నాయకులు ఈ ఆత్మీయ సమావేశానికి హాజరైనారు. ఇద్దరు మాజీ ఎస్ పీలూ, సీనియర్ ప్రభుత్వాధికారులుగా పని చేసి ఉద్యోగవిరమణ చేసినవారూ, ఇతర ఉద్యోగులూ, న్యాయవాదులూ, విద్యార్థులూ ఈ సభకు హాజరైనారు. దాదాపు 60 మంది ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక సలహాలు ఇచ్చారు. వైఎస్ హయాంలో అమలు జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికీ, ఇప్పుడు అమలు చేస్తామని చెబుతున్న డబుల్ బెడ్ రూం పథకానికీ మధ్య తేడా గురించి కొందరు మాట్లాడారు.
ఇదీ చదవండి: అన్న అడుగుజాడల్లో చెల్లెలు షర్మిల
షర్మిల కొన్ని అంశాలతో ఒక ప్రశ్నావళిని రూపొందించి వాటికి సమాధానాలు సేకరించాలని అభిమానులను కోరారు. షర్మిల అడిగిన ప్రశ్నలు ఇవి:
1) తెలంగాణలో వైఎస్ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలు ఏమిటి? వాటి పరిష్కారం ఏమిటి?
2) మీ అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేసిన మంచి పనులు ఏమిటి?
3) రాజకీయ పార్టీ పెట్టాలని మనం తీసుకున్న నిర్ణయం గురించి ప్రజల స్పందన ఎట్లా ఉంది.
4) ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ నీ, టీఆర్ఎస్ నీ ఎట్లా ఎదుర్కోవాలి? అందుకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?
5) రాష్ట్రంలో బీజేపీని ఏ విధంగా ఎదుర్కోవాలి? మీ సలహా ఏమిటి?
6) తెలంగాణ సమాజం నుంచీ, ఉద్యమకారుల నుంచీ ఎటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? వాటికి సమాధానాలు ఏమి చెప్పాలి?
7) రాష్ట్రంలో బలమైన ప్రత్యమ్నాయ పార్టీగా అవతరించాలంటే జిల్లా స్థాయిలో ఏయే అంశాలపైన కొత్త పార్టీ పోరాడాలి?
8) కార్యకర్తలను సమీకరించుకొని, వారికి కార్యక్రమాలు ఇవ్వడం, వారి బాగోగులు చూడటం ఎలా?
9) తెలంగాణలో మళ్ళీ సంక్షేమ పాలన తీసుకొని రావాలంటే ఏమి చేయాలి?
ఇదీ చదవండి: త్వరలో వైఎస్సార్ స్వర్ణయుగం- షర్మిల
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల లోటుపాట్లపైన పలువురు వక్తలు మాట్లాడారు. అందరూ మాట్లాడిన తర్వాత షర్మిల చివరగా మాట్లాడి పైన పేర్కొన్న ప్రశ్నలకు ప్రస్తావించారు. లోటస్ పాండ్ లో జరిగిన ఈ సమావేశానికి హాజరైన వారిని తన పార్టీ భవిష్యత్తు చిత్రం ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారో చెప్పవలసిందిగా షర్మిల కోరారు.