Saturday, November 23, 2024

ఈ హ్రస్వ దృష్టి రాజకీయానికి అంతం ఎప్పుడు?

నివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో జరిపిన ‘నీతి ఆయోగ్’ గవర్నింగ్ కౌన్సిల్ వర్చువల్ మీటింగ్ లో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి ఏ.పి. కి ‘ప్రత్యేక హోదా’ స్థాయి ప్రకటిస్తేనే, ఇక్కడ జరుగుతున్న పారిశ్రామీకరణ వృద్ధి వేగం  పుంజుకుంటుందని నిర్ద్వందంగా స్పష్టం చేసారు. ఈ డిమాండ్ ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న వేదిక మీది నుంచే చేయడం కొత్తగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోసారి అమెరికా ప్రాధాన్యత ‘ఆఫ్రో-ఏసియన్ కేంద్రిత విదేశీ విధానం’ అయ్యాక, భారత్ మారిన తన ‘జియో-పొలిటికల్’ అవసరాలకు తగినట్టుగా కొత్త ప్రణాళికలు రూపొందించుకోవడానికి అనువైన రాష్ట్రంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మారింది! అలా మనం ఉన్నది భౌగోళిక-రాజకీయాల (జియో-పాలిటిక్స్) కాలంలో అని మరోసారి రుజువైంది.

ఇదీ చదవండి: మూలాలను వెతుకుతున్న – ‘జగనిజం’

అమెరికా అధ్యక్షుడిగా జోసఫ్ బైడెన్ అధికారిక విధులు మొదలెట్టిన వెంటనే, డోనాల్డ్ ట్రంఫ్ పాలసీలను కొన్నిటిని పక్కన పెట్టినా ఇండియాకు ఈశాన్యాన, చైనా దక్షణ సముద్ర జలాల్లో అమెరికా మొదట నుంచి అనుసరిస్తున్న వైఖిరిలో ఇకముందు కూడా ఎటువంటి మార్పు ఉండదని అర్ధమవుతున్నది. ఫిబ్రవరి 5న (శుక్రవారం) పలు అంతర్జాతీయ అంశాలపై బైడెన్ చేసిన 20 నిముషాల ప్రసంగంలో తన ప్రభుత్వ వైఖిరిని ఆయన స్పష్టం చేసినా, అందులో ఇండియా,  దక్షణ చైనా సముద్ర జలాలు, అమెరికా ‘ఆసియా-ఫసిఫిక్’ విధానం వంటి మనకు అవసరమైన అంశాలు ఏవీ అందులో లేవు. దానికోసం కనిపెడుతున్న డిల్లీలోని విదేశాంగ రంగ నిపుణులు మాజీ దౌత్యవేత్త విష్ణు ప్రసాద్, ‘కార్నేగి ఇండియా’ రీసెర్చ్ డైరక్టర్ రుద్ర చౌదరి వంటివారు ‘అమెరికా విదేశీ విధానం’ పై భారత్ ‘కనిపెట్టే ధోరణి’ తీసుకోవలసి ఉంటుందని శనివారం ఫిబ్రవరి 6న అన్నారు.  

అయితే, అదే రోజు అనుమతి లేని తమ జలాల్లోకి ప్రవేశించిన అమెరికా యుద్ద నౌక ‘జాన్ ఎస్. మెకైన్’ కదలికలు గురించి చైనా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు, ‘ఏజేన్స్ ఫ్రాన్స్-ప్రెస్’ వెల్లడిస్తే గాని ప్రపంచానికి తెలియలేదు. దాన్ని ఉటంకిస్తూ మన ఆంగ్ల పత్రికలు కూడా వార్తలు ప్రచురించాయి గానీ, అదే రోజు బైడెన్ చేసిన ప్రసంగంలో మాత్రం ఆ ప్రస్తావన లేదు. చైనా, తైవాన్, వియత్నాం, ఉమ్మడి హక్కులు ఉన్న ప్రాంతంగా పరిగణిస్తున్న పెర్సిల్ దీవుల్లో శుక్రవారం ‘మెకైన్’ యుద్ద నౌక నుంచి నావికా, వైమానిక దళాలు ‘రొటీన్’ కవాతు నిర్వహించినట్లు మరిన్ని వివరాలు ‘జపాన్ టైమ్స్’ వెల్లడించింది. దీంతో ‘ఇండో-ఫసిఫిక్’ ప్రాంతంపై అమెరికాకు ఉన్న ఆధిపత్య ప్రయోజనాల దృష్టిలో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టమయింది.

దక్షణ చైనా తీరంలోని పెర్సేల్ దీవుల్లో శుక్రవారం (ఫిబ్రవరి 5) అమెరికా యుద్దనౌక ‘మెకైన్’ కదలికల్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమాండర్ జోసఫ్ గుంట వేరే ‘వెస్సల్’ నుంచి పరిశీలిస్తున్న దృశ్యం (ఫోటో: యు.ఎస్. నేవీ)

డా. మన్మోహన్ సింగ్ యు.పి.ఏ. ప్రభుత్వం కాలంలో (2004-2014) జోసఫ్ బైడెన్ అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడుగా ‘సెనేట్ ఫారెన్ రిలేషన్స్ కమిటీ చైర్మన్’ హోదాలో తీసుకున్న చొరవతో జరిగిన ‘ఇండో-యు.ఎస్. సివిల్ న్యూక్లియర్ ఎగ్రిమెంట్’, ‘ఇండో-యు.ఎస్. స్ట్రాటజిక్ పార్ట్నర్ షిప్’ దృష్ట్యా ప్రాంతీయ భద్రతా ఒప్పందాలు విషయంగా ‘బైడెన్ అమెరికా’ మనతో సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువని; భారత మాజీ భద్రతా సలహాదారు ఎం.కే. నారాయణన్ ఫిబ్రవరి 4 న ‘ది హిందూ’ లో సంపాదక పేజి ప్రధాన వ్యాసంలో రాసారు.

మన దేశ తూర్పుతీర భద్రతా అంశాల్లో ఆగ్నేయ ఆసియాలో చైనా విస్తరణ దృష్టి కారణంగా 2010 తర్వాత పెనుమార్పు మొదలయింది. సెంట్రల్ ఇండియాను ఆనుకొని వున్న తెలంగాణ నుంచి 970 కి.మీ. సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ ను వేరు చేయడం కూడా అందులో భాగమే. ఈ కారణాల వల్ల, ఇప్పటి డిల్లీ ఆగ్నేయ-ఆసియా దృష్ట్యా అయినా, ఒబామా కాలం నుంచే అమెరికా దౌత్యవిధానంలో ‘ఇండో-ఫసిపిక్ రీజియన్’ ప్రాధాన్యాశం కావడం అయినా, స్థూలంగా ప్రపంచ రాజకీయాలు ఆసియా కేంద్రితం కావడంగా మనం చూడాల్సివుంది.

అయితే, మారిన ఈ ‘షిప్ట్’ ను ‘ఎన్.డి.ఏ.’ ప్రభుత్వం ఎంతమేర గుర్తించగలిగింది  అనేది ఇప్పటికీ మనం స్పష్టతకు రాలేని అంశం. విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంటుందనే అంశాన్ని అప్పట్లోనే ప్రస్తావిస్తూ, అప్పటికి దాన్ని ‘పైప్ లైన్’ ఎందుకు ఉంచిందో, దానిపై కసరత్తు చేసిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి తెలుసు. అదే విషయాన్ని నిన్నటి సమావేశంలో జగన్ ప్రస్తావిస్తూ “ప్రత్యేక హోదా ఇవ్వడం ‘ప్రి కండీషన్’ గా ఆ రోజున రాష్ట్రాన్ని విభజించారు” అని తన లిఖితపూర్వక ప్రసంగంలో అన్నారు.

అయితే, ఈ విభజన నిర్ణయం తీసుకునే నాటికి ఉన్న స్పూర్తి ఇప్పుడు తూర్పు తీరప్రాంత రాష్ట్రాల విషయంగా మోడీ ప్రభుత్వానికి ఉన్నాదా?! ఆంధ్రప్రదేశ్ సమాజం కొత్త రాష్ట్రంగా అయ్యాక, తన  ‘థాట్ ప్రాసెస్’ లో నిరంతరం పరిగణనలోకి తీసుకోవలసిన అదనపు దృష్టికోణం మిది. ‘కోవిడ్’ ప్రభుత్వ ప్రాధాన్యతలు తలకిందులు చేయడం నిజమైనప్పటికీ, మళ్ళీ కోలుకొంటున్న దశలో ఈ రోజున కేంద్రం వైఖిరి ఆంధ్రప్రదేశ్ విషయంగా ఎలావుంది? ఈ రోజున ‘వార్తా కేంద్రం’ అయిన స్టీల్ సిటి విశాఖ గురించి చూద్దాం.

ఇదీ చదవండి:మూలాలను వెతుకుతున్న – ‘జగనిజం’

బరాక్ ఒబామా (డెమోక్రటిక్ పార్టీ) పాలనలో ‘యు.ఎస్. ఇండియా బిజినెస్ కౌన్సిల్’ జనవరి 2015లో విశాఖపట్టణం నగరాన్ని ‘స్మార్ట్ సిటీ’ గా అభివృద్ధి చేస్తామని అన్నది. మళ్ళీ అదే పార్టీ నుంచి బైడెన్ ప్రసిడెంట్ అయ్యారు, అటువంటప్పుడు ట్రంఫ్ విస్మరించిన ‘వైజాగ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు’ ను తిరిగి చేపట్టే విధంగా మన చొరవ ఉండాలా? లేక, రాజ్యసభలో మన బి.జే.పి. తెలుగు ఎం.పి. ఒకరు గొంతెత్తిన 400 ఏళ్ల నాటి రామతీర్థం గుడికి జరిగిన అపచారం గురించి ప్రస్తావించాలా? ఈస్ట్రన్ నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అయిన విశాఖ – విజయనగరం జిల్లాల మధ్య ఒక బలమైన జంట నగరాల్ని నిర్మించుకోవలసిన తరుణంలో ఇవా మన ప్రాధాన్యతలు!

  ఇది ఇలా వుంటే, ఒక నగరమా? పలు నగరాలా? అనే మీమాంస నెలకొన్న దశలో, ఇప్పటికైనా మనం స్థిమితంగా యోచన చేయవలసిన అవసరాన్ని ఇదే ‘నీతి-ఆయోగ్’ జనవరి చివరిలో కల్పించింది. ‘ఇన్నోవేషన్స్’ రాష్ట్రాలవారీ ‘ర్యాంకింగ్’లో దక్షణాది రాష్ట్రాల్లో చివరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ వుంది. తెలంగాణ 33.23 శాతంతో నాల్గవ స్థానంలో ఉంటే, ఏడవ స్థానంలో 24.19 శాతంతో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ జాబితాలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క ఏ.పి. తప్ప మిగతా పెద్దరాష్ట్రాలు అన్నీ అరవై ఏళ్ళ క్రితం ఏర్పడ్డవి. కనుక, ఏ.పి. ఇప్పుడు తాను వేసే ప్రతి అడుగు రాబోయే మరో యాభై ఏళ్ల కోసం అన్నట్టుగా వేస్తే, దీనికి సహజంగా ఉన్న నైసర్గిక అనుకూలతలు దృష్ట్యా మెరుగైన అవకాశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఈ ‘కాన్వాస్’ పై ఏడాది ఆందోళనకు చోటెక్కడ?

అందుకే, శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో జరిపిన ‘నీతి ఆయోగ్’ గవర్నింగ్ కౌన్సిల్ వర్చువల్ మీటింగ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి, విభజనతో ‘టైర్ వన్’ నగరం లేని రాష్ట్రంగా ఏ.పి. మిగిలిందన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏ.పి. కి ‘ప్రత్యేక హోదా’ స్థాయి ప్రకటిస్తేనే ఇక్కడ జరుగుతున్న పారిశ్రామీకరణ వృద్ధి వేగం  పుంజుకుంటుందని ఆయన నిర్ద్వందంగా స్పష్టం చేసారు. అమెరికా ప్రాధాన్యత ఆఫ్రో-ఏసియన్ కేంద్రిత విదేశీ విధానం అయ్యాక, ఆగ్నేయాసియాలో భారత్ తన ‘జియో-పొలిటికల్’ అవసరాలకు తగినట్టుగా ‘ప్లాన్’ చేసుకోవడానికి అనువైన రాష్ట్రంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మారింది! దేశంలో ఆర్ధిక సంస్కరణల అమలు పూర్తయిన పాతికేళ్ళ తర్వాతి అనుభవం, ఈ దశలో ‘ప్లానింగ్ -ఏ.పి.’ కి మేలు చేస్తుంది. అయితే, కేంద్రం అందుకు సహకరించి, సి.ఎం.గా జగన్మోహన రెడ్డిని స్థిమితంగా తన పనిని తాను  చేసుకోనివ్వగలిగితే, అది రాష్ట్రానికి మేలు అవుతుంది.

ఇదీ చదవండి: డిల్లీ చూపు ఏ.పి. కేంద్రితం ఎందుకయింది?

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles