- గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన విజయ సాయి
- స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని హామీ
- కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద బహిరంగ సభ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరుగుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవటీకరణను వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనల్లో భాగంగా ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న విజయసాయిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావుతో విజయసాయిరెడ్డి వెంట ఉన్నారు. పాదయాత్ర సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు పోరాటానికి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ యాత్రతో నాంది పలికామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జగన్ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు పార్లమెంట్ లోనూ పోరాడతామన్నారు. 32 మంది త్యాగాలు చేస్తే స్టీలు ప్లాంట్ ఏర్పడిందని స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కుపై నాయకుల తుప్పు రాజకీయాలు
పాదయాత్రలో ఉపముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన యాత్ర ఐదు నియోజకవర్గాల మీదుగా 25 కిలోమీటర్ల మేర కొసాగనుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, డైమండ్ పార్క్, దొండపర్తి, మర్రిపాలెం, ఎన్‌ఏడీ జంక్షన్, ఎయిర్ పోర్ట్, షీలానగర్ మీదుగా స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వరకు యాత్ర కొనసాగుతుంది. అనంతరం కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు అమ్మకం మరణ శాసనమే