- కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం?
- విజయ్ యాత్రలో బీజేపీలో చేరనున్న శ్రీధరన్
దక్షిణాది రాష్ట్రాలలో తన సత్తా చూపేందుకు బీజేపీ అహర్నిశలు శ్రమిస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు దక్షిణాది రాష్ట్రాల ప్రముఖులకు గాలం వేస్తోంది. సినీ రంగానికి చెందిన ప్రముఖులను ఆకర్షిస్తూనే ఇతర రంగాలలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారిని పార్టీలోకి ఆహ్వానించడంద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రానికి చెందిన మెట్రో శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకోనుంది.
Also Read: పుదుచ్ఛేరిలో పావులు కదుపుతున్న బీజేపీ
మెట్రో మ్యాన్ గా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ ఇంజనీర్ శ్రీధరన్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించనున్నారు. త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఆయన బీజేపీ గూటికి చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ మరో మూడు రోజులలో ప్రారంభించనున్నది. విజయ యాత్ర పేరిట ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దేశానికి బీజేపీ గొప్ప సేవలు అందిస్తోందని శ్రీధరన్ స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయిస్తే ఎన్నికలలో ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధమేనన్నారు. 88 ఏళ్ల వయసులో ఉన్న శ్రీధరన్ బీజేపీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలో పలు మెట్రోరైళ్లకు రూపకల్పన చేసిన అనుభవం శ్రీధరన్ కు ఉంది.
Also Read: 5 రాష్ట్రాలలో అన్ని పార్టీలకూ అగ్నిపరీక్ష