Sunday, December 22, 2024

న్యాయవాదుల హత్యకేసులో టీఆర్ఎస్ నాయకులపై అనుమానం

పెద్దపల్లి: పట్టపగలు, నడిరోడ్డుమీద కారును ఆపు చేసి న్యాయవాద దంపతులపైన దుండగులు దాడి చేసి దారుణంగా చంపిన ఉదంతం తెలంగాణ ప్రజలకు దిగ్భ్రాంతి కలిగించింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద బుధవారం జరిగిన ఈ ఘాతుకాన్ని రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న ఆర్ టీసీ బస్సులలోని ప్రయాణికులూ, ఇతరులూ ప్రత్యక్షంగా చేశారు. దాడి దృశ్యాలను తమ సెల్ ఫోన్ లలో బంధించారు. ఒక కారులో మంథని నుంచి హైదరాబాద్ వెడుతున్న న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణిలను కారులో నుంచి లాగి కత్తులతో, గొడ్డలతో నరికిన దారుణమైన దృశ్యాలను సీసీ కెమరాలు కూడా బంధించాయి. భార్యాభర్తలు ఇద్దరూ హైకోర్టులో న్యాయవాదులు. అధర్మానికీ, అరాచకానికీ, అన్యాయానికీ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సాహసవంతులు. బుధవారం ఉదయం మంథని వెళ్ళి అక్కడి కోర్టులో దాఖలు చేయవలసిన పిటిషన్ పైన తండ్రి గట్టు కిషన్ రావు, సోదరుడు గట్టు ఇంద్రశేఖరరావు, మేనల్లుడు శ్రీనాథ్ చేత సంతకాలు చేయించుకొని వారిని ఇంటికి పంపించి, మంథని కోర్టులో పని ముగించుకొని తమ కారులో మధ్యాహ్నం రెండు ప్రాంతంలో హైదరాబాద్ కు బయలుదేరారు. కారు డ్రైవర్ పేరు సతీష్.

కారును ఓవర్ టేక్ చేసిన హంతకులు:

కల్వచర్ల దాటిన తర్వాత ఒక కల్వర్టు దగ్గర నెమ్మదిగా వెడుతున్న వామనరావు కారుని మరో పెద్ద కారు దాటుకొని ముందుకు వెళ్ళి కారుకు అడ్డంగా పెట్టారు. పెద్ద కారులోనుంచి దిగిన దుండగులు కత్తులతో, గొడ్డళ్ళతో కారులో ఉన్న వామనరావును బయటకు లాగి దాడి చేసి నరికివేశారు. కారులోనే ఉన్న ఆయన భార్య నాగమణిని కూడా నరికి చంపివేశారు. దంపతులు ఇద్దరిపైనా విచక్షణారహితంగా దాడి చేసిన దుండగులు తమ కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఈ ఘటన చూసిన కొందరు వ్యక్తులు 108కి పోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న న్యాయవాదులను పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి చేరడానికి ముందే వారు ప్రణాలు విడిచారు.

Also Read: యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్

కుంట శ్రీనివాసరావు పేరు చెప్పిన హతుడు:

తమపైన కుంట శ్రీనివాసరావుతో పాటు మరికొందరు దాడి చేశారని ప్రాణాలు విడిచే ముందు న్యాయవాది చెప్పినట్టు చూపించే వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనాయి. మంథని మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడు కుంట శ్రీనివాసరావు, మరికొందరు దుండగులు కలిసి ఈ హత్య చేశారని అర్థం అవుతున్నది. హత్య చేయడానికి కొద్దిసేపతి క్రితమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినవేడుకలలో శ్రీనివాసరావు పాల్గొన్న చిత్రాలను వార్తాపత్రికలు ప్రచురించాయి. తన కుమారుడినీ, కోడలిని కుంట శ్రీనివాసరావు, అతడి అనుచరులు హత్య చేశారని వామనరావు తండ్రి, విశ్రాంత ఉపాధ్యాయుడు గట్టు కిషన్ రావు చెప్పారు. ఈ హత్య వెనుక జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధుకర్, గుంజపడుగుకు చెందిన రిటైర్ట్ డీఈఈ వసంత్ రావు హస్తం ఉన్నదని మృతుడి తండ్రి ఆరోపించారు. పెద్దపల్లి ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలపైన కేసులు వేయడం వల్లనే వామనరావుపైన దాడి జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

కీలకమైన కేసుల్లో న్యాయవాదులు:

కొన్ని కీలకమైన కేసుల్లో హనుమంతరావు, నాగమణి న్యాయవాదులుగా ఉన్నారు. ఇసుక వివాదంలోనూ, కులాంతర వివాహం చేసుకున్న ఒక దళిత యువకుడి హత్య ఉదంతంలో ఒక రాజకీయ నాయకుడి హస్తం ఉన్నదని ఆరోపించే కేసులోనూ, కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపించే కేసులోనూ పిటీషన్లు వేయించి ఈ దంపతులు వాదిస్తున్నారు. మాజీ ఎంఎల్ఏ పుట్ట మధుకు ఎన్నికల ప్రకటనలో (అఫిడవిట్ లో) చూపించిన ఆస్తుల కంటే కొన్ని వందల రెట్లు ఆస్తులు ఉన్నాయని కూడా ఆరోపిస్తూ వారు పిటిషన్ వేయించారు. 2019లో శీలం రంగయ్య అనే దళితుడిని లాకప్ లోనే చంపివేశారంటూ మరో కేసు దాఖలు చేశారు.

Also Read: ” రాతి ” బతుకును తిరగరాసిన డాక్టర్ రాయలింగు !!

లాక్ అప్ డెత్ కేసు విచారణ:

ఈ కేసులో పోలీసు కమిషన్ స్వయంగా విచారణ జరిపి నివేదిక దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ లాకప్ డెత్ కేసుపైన ఈ నెల 8వ తేదీన కూడా విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ వామనరావు హైకోర్టు ప్రదాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ కేసు వేసినందుకు తమను పోలీసులు కూడా వేధిస్తున్నారనీ, మంథని పోలీసు స్టేషన్ లో తమపైన తప్పుడు కేసులు బనాయించారని కూడా మామనరావు ప్రధాన న్యాయమూర్తికి తెలియజేశారు. మంచిర్యాలలో తమపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టారని చెప్పారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఏ కేసులోనూ వామనరావు దంపతులను విచారణకు పిలవరాదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సెప్టెంబర్ 9 వ తేదీ వరకూ పొడిగించింది.

న్యాయవాదలు కోర్టు బహిష్కరణ:

గట్టు వామనరావు, నాగమణి హత్యోదంతాన్ని తెలంగాణ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ, నరసింహారెడ్డి, పలు బార్ అసోసియేషన్లూ, న్యాయవాదులూ నిర్ద్వద్వంగా ఖండించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు కోరారు. ఈ జంట హత్యలకు నిరసనగా గురువారంనాడు విధులను బహిష్కరించాలని న్యాయవాదుల సంఘం ఐచ్ఛికంగా నిర్ణయించింది. జంటనగరలలోనూ, చుట్టపక్కల ఉన్న కోర్టులన్నిటిలోనూ న్యాయవాదులు గురువారం విధులకు హాజరు కారు.

Also Read: కమ్యూనిస్టు రాజయ్యకు జోహార్లు

హంతకుల కోసం ఆరు పోలీసు బృందాల గాలింపు:

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు మహేందరరెడ్డి స్వయంగా రామగుండం పోలీసులతో మాట్లాడారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దంటూ హోమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. నిందితులను పట్టించేందకు ఆరు ప్రత్యేక బృందాలను పోలీసు అధికారులు రంగంలోకి దింపారు. రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. వ్యక్తిగత విభేదాలే హత్యకు కారణమనీ, న్యాయవాద దంపతులు ఉపయోగించిన నల్లకారు దర్యాప్తులో కీలకంగా మారిందనీ, స్థానికులో హత్య చేశారని అనుమానిస్తున్నామనీ పోలీసు వర్గాలు అంటున్నాయి. వామనరావు డ్రైవర్ సతీష్ కోవర్టుగా మారి హంతకులతో సహకరించి ఉండవచ్చునని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles