• ఇద్దరు సలహాదారులను నియమించిన షర్మిల
• వైఎస్సార్ హయాంలో కీలకం బాధ్యతల నిర్వహణ
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటించిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల పార్టీ పనుల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. పార్టీ ఏర్పాటుపై షర్మిల వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం అత్యంత సన్నిహితులు, ప్రముఖ నేతలతో విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులు, నేతలతో షర్మిల భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాలో జరగబోయే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో ఖమ్మం పర్యటనను వాయిదా వేసుకున్నారు.
Also Read: ‘షర్మిల ఫ్యాక్టర్’: కొన్ని మౌలిక భావనలు!
ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా నాయకులు, సన్నిహితులతో షర్మిల సమాలోచనలు, పార్టీ ఏర్పాటుకు సంబంధించిన మంతనాలు లోటస్ పాండ్ లో యథావిధిగా కొనసాగుతున్నాయి. వరుస భేటీలతో బిజీగా ఉన్న షర్మిల ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రకటన తర్వాత రాజకీయ పోరాటం నిరవధికంగా సాగిపోయేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తను పెట్టబోయే పార్టీకి మాజీ ఐఏఎస్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఐపీఎస్ ఉదయ సిన్హాలను సలహాదారులుగా నియమించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. వీరిద్దరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ హయాంలో సీఎంవోలో అడిషనల్ సెక్రటరీగా ప్రభాకర్ రెడ్డి పని చేయగా, సీఎస్ఓగా ఉదయసిన్హా పని చేశారు. సలహాదారులు, ఆంతరంగికుల నియామకం విషయంలో షర్మిల తన అన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: అన్న వీడిన తెలంగాణ గడ్డపై…అయ్యారే… చెల్లె షర్మిలమ్మ సాము ?