లద్దాఖ్ లోని పాంగాంగ్ సరస్సు వెంట ఉన్న ఉభయ దేశాల సైనిక బలాల ఉపసంహరణ కొన్ని రోజుల క్రితం ప్రారంభమైంది. ఘర్షణాత్మక ప్రాంతాల్లో ఉన్న యుద్ధ ట్యాంకులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇరు ప్రాంతాల్లో ఉన్న తాత్కాలిక నిర్మాణాలను పూర్తిగా కూల్చేయాల్సి ఉంది. ఈ ఉపసంహరణ జరగడానికి ముందు 9 రౌండ్ల చర్చలు జరిగాయి. తదనంతరం రెండు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. బలగాల ఉపసంహరణ తర్వాత కూడా రెండు దేశాల సైనిక కమాండర్ల మధ్య చర్చలు ప్రారంభమవుతాయని వినికిడి.
గల్వాన్ లోయకు పార్లమెంటరీ బృందం
గల్వాన్ లోయ ప్రాంతానికి మే, జూన్ లో పార్లమెంటరీ బృందం కూడా వెళ్లి సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఫింగర్ 3,4,5,8 చాలా ముఖ్యమైనవి. వీటిలో ఫింగర్ 4 చాలా కీలకమైంది. ఇది వ్యూహాత్మకమైంది కూడా. ఇండియా మర పడవలు నిలిపే లుకుంగ్ ప్రాంతం ఇక్కడ నుంచి చైనాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ అనేక శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టివున్నారు. తాజాగా జరిగిన ఒప్పందం నేపథ్యంలో, చైనా తను నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేస్తోంది. గత ఏప్రిల్ లో నిర్మించిన కట్టడాలను కూడా తొలగిస్తున్నారు.
Also Read : ట్రంప్ గెలిచినా ఓడినట్టే
జట్టీని తొలగించిన చైనా సైనికులు
ఫింగర్ 5 దగ్గర పాంగాంగ్ సరస్సులో నిర్మించిన జట్టీని కూడా చైనా సైనికులు తొలగించారు. ఈ ప్రాంతంలోని వివిధ ఫింగర్ ల దగ్గర చైనా నిర్మించిన అతి పెద్ద నిర్మాణాలలో ఇది ఒకటి. చైనా ఉపసంహరణల పర్వాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఉపగ్రహాలు, డ్రోన్ల సహాయంతో పర్యవేక్షణలు సాగుతున్నాయి. ఈ మేరకు మనం బలగాల ఉపసంహరణ చేసుకుంటున్నాం. ఈ మొత్తం ప్రక్రియ మరి కొన్ని రోజుల్లోనే ముగుస్తుంది.
నెహ్రూ హయాంలోనే చైనా దురాక్రమణ
జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే భారత్ భూభాగాన్ని చైనా చాలా మేరకు ఆక్రమించిందన్నది పచ్చి నిజం. ఈ అంశంపై అప్పుడు నెహ్రును పార్లమెంట్ లో నిలదీశారు. నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమయంలోనూ మన భూభాగాలను చైనాకు అప్పచెప్పామనే విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ విమర్శలు చేస్తున్నది అప్పటి ప్రధాని నెహ్రూకు మునిమనమడైన రాహుల్ గాంధీ కావడం గమనార్హం. ఇప్పుడు ఎట్లా ఉన్నా, గతంలో మన భూభాగాలను చైనా ఆక్రమించిందన్నది నూటికి నూరు శాతం వాస్తవం. అది చరిత్ర విదితం.
Also Read : సంపాదక శిఖరం నార్ల
చైనా తీరు ఎప్పుడైనా ఒక్కటే
చైనా తీరు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒకటేనని మనం అర్ధం చేసుకొని తీరాల్సిందే.ఆ కాలంలో జవహర్ లాల్ నెహ్రూ చైనాను పూర్తిగా విశ్వసించారు. దానికి మనం మూల్యం చెల్లించాల్సి వచ్చింది. దెస్సాంగ్ ప్రాంతాన్ని మనం కోల్పోయామని రాహుల్ విమర్శిస్తున్నారు. ఏ భూభాగాన్నీ గోరంత కూడా కోల్పోలేదని, గోగ్రా, దెస్సాంగ్ ప్రాంతాలకు సంబంధించిన కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని మన రక్షణ శాఖ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది.
నమ్మరాని పొరుగు దేశం
చైనాను నమ్మకూడదని 1962లోనే రుజువుయింది. గల్వాన్ లోయలో ఇప్పుడు జరుగుతున్న తీరులోనే అప్పుడు కూడా ప్రవర్తించి, తర్వాత హటాత్తుగా యుద్ధానికి దిగింది. ముందుగా గల్వాన్ లోయలోకి దళాలు పంపింది. అప్పటి ప్రధాని నెహ్రు దీనిని తీవ్రంగా భావించి హెచ్చరికలు జారీచేయడంతో చైనా దళాలను ఉపసంహరించుకుంది. ఆ దేశాన్ని మనం పూర్తిగా నమ్మి, అప్రమత్తంగా లేని సమయాన్ని చూసుకొని, కొన్ని రోజుల్లోనే మనపై దాడి చేసి అక్సాయ్ చిన్ ను ఆక్రమించింది. అప్పుడు జరిగిన యుద్ధంలో మనం చాలా నష్టపోయాం. ప్రాణ నష్టంతో పాటు 38000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్నీ కోల్పోయాం.
Also Read : విశాఖ ఉక్కు ఆంధ్రులకు దక్కుతుందా?
కార్గిల్ యుద్ధ సమయంలో రోడ్డు నిర్మాణం
మనం కార్గిల్ యుద్ధ సమయంలో బలగాలను కొంత తరలించిన సందర్భంలో, అదే అదనుగా భావించి ఫింగర్ 4 ప్రాంతంలో రోడ్ల నిర్మాణం ప్రారంభించింది. గత సంవత్సరం నుంచీ సరిహద్దుల్లో మనతో దాగుడుమూతలు ఆడుకుంటోంది. రెండు దేశాల మధ్య ఏర్పరచుకున్న శాంతి ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కి, మన సైనికులపై అనేక సార్లు మెరుపుదాడులు చేసింది, మన జవాన్లను పొట్టన పెట్టుకుంది. మనం కూడా దీటైన సమాధానం చెప్పి, మన ఉనికిని మనం కాపాడుకున్నాం.
వివిధ స్థాయిల్లో అనేక దఫాల చర్చలు
ఈ సంవత్సర కాలంలో ఆందోళనల విరమణపై, శాంతి పునఃస్థాపనపై రెండు దేశాల మధ్య అనేక స్థాయిల్లో అనేక చర్చా సమావేశాలు జరిగాయి. ఒప్పందాలు జరిగాయి.వీటన్నింటినీ అతిక్రమిస్తూనే ఉంది. దీనికి తోడు, ఒక పక్క మనతో చర్చలు జరుపుతూ – ఇంకొక పక్క పాకిస్తాన్ ను రెచ్చకొడుతూ వచ్చింది. రష్యాకు, మనకు విభేదాలు సృష్టించి, రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న బంధాలను దెబ్బతీయలనీ చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పిల్లి లాంటి నేపాల్ ను కూడా మనపై వదిలింది.
Also Read : ఉత్తరాఖండ్ హెచ్చరిక
భారత సరిహద్దు దేశాలను దువ్వుతున్న చైనా
మన సరిహద్దు దేశాలన్నింటికీ అనేక ఆశలు చూపించి, తన చెప్పు చేతల్లో ఉంచుకోడానికి, మనకి శత్రు దేశాలుగా మార్చడానికి అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. భారతదేశం సహజంగా శాంతి కాముక దేశం. విలువలకు కట్టుబడి ఉన్న పుణ్యభూమి. అన్ని దేశాలతో స్నేహపూర్వకంగా నడవాలనే చిత్తశుద్ధి కలిగిన సంస్కారవంతమైన దేశం. చైనా విషయంలో భారత్ ఎంతో సహనంగా ప్రవర్తిస్తోంది. ఎందుకంటే, అది పొరుగున ఉన్న దేశం.
పరస్పర సహకారం ఉండేది
గతంలో, చీనీచీనాంబరాలు అక్కడ నుంచే మనం తెచ్చుకోనే వాళ్ళం. వాళ్ళకు కావాల్సింది మన దగ్గర నుంచి వాళ్లు తీసుకెళ్లేవారు. ఇలా,ఎన్నో వందల సంవత్సరాల నుండి రెండు దేశాల మధ్య వాణిజ్య ప్రయాణం ఉంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జిన్ పింగ్ వచ్చినప్పటి నుంచే, రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బ తిన్నాయి. గడచిన సంవత్సరాల కాలంలోని పరిణామాలను గమనిస్తే, రెండు దేశాల మధ్య యుద్ధం అనివార్యమనే ఘటనలు అనేకం జరిగాయి. ఏ సమయం లో యుద్ధం వచ్చినా, ఎదుర్కోడానికి కూడా మనం సిద్ధమయ్యాం.
చేదు అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకున్నాం
గత చేదు అనుభవాలు నేర్పిన పాఠాల నుంచి మనం అప్రమత్తం అయ్యాం. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ, శాంతి స్థాపనకు మన ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే వుంది. ఇప్పుడు జరుగుతున్న ఉపసంహరణల పర్వం మంచి పరిణామామే. కాకపోతే, చైనాను ఎట్టి పరిస్థితుల్లో నమ్మ కూడదు. శాంతి స్థాపన, ద్వైపాక్షిక బంధాల పునః నిర్మాణం రాజనీతిలో భాగం. నమ్మినట్లు నటిస్తూ, అప్రమత్తంగా ఉండడం యుద్ధనీతిలో భాగం.
Also Read : చైనాతో వేగడం ఎలా?