Sunday, November 24, 2024

సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత పొన్నాల ధ్వజం

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ చేసిన హామీలపట్ల కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నల్గొండ నివేదన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ కార్యక్రమాలను కేసీఆర్ ఏకరువు పెట్టారు. కొత్తగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రైతులందరిని సమీకరించి సంక్షేమ పథకాల గురించి చెబుతున్నారు. ఇటీవలి దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం పరువు పోగొట్టుకుంది. పోయిన పరువును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇచ్చిన వాగ్దానాలు ఏవీ ఇప్పటివరకు అమలు కాలేదు. సాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో పోడు భూముల గురించి మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలయింది. పోడు భూములు ఇపుడు ఎందుకు గుర్తుకొచ్చాయో మాకు తెలియదా అంటూ పొన్నాల చురకలంటించారు.

ఫామ్ హౌస్ సీఎం:

సాగర్ నియోజకవర్గ పరిథిలో దాదాపు 45 వేలకు పైగా గిరిజనులు ఉన్నారు. భద్రాచలంలో మహిళా గిరిజన రైతులను చెట్లకు కట్టేసి కొడితే ఏం చేశావు అప్పుడు ఎందుకు స్పందించలేదని కేసీఆర్ ని ప్రశ్నించారు. 2014లో 12 శాతం అన్నావ్ రాజ్యాంగబద్ధంగా ఇప్పుడున్న రిజర్వేషన్ శాతం కంటే ఎక్కువ వచ్చే అవకాశాన్ని కూడా పక్కనపెట్టి అంతకంటే ఎక్కువ 12 శాతం ఇస్తానని ఏడు సంవత్సరాలు కాలేదా..? మొఖం ఎక్కడ పెట్టుకుంటావ్ కేసీఆర్. గిరిజనులమీద నీకుంది కపట ప్రేమ. బహిరంగ సభలో కొంతమంది తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చారు. ప్రగతి భవన్ లోకి ప్రవేశం లేదు. ఫామ్ హౌస్ కి రానివ్వరు. సీఎం ప్రజల్ని కలవడు. క్యాబినెట్ మీటింగ్ లలో, ఎన్నికల కోసం ఏర్పాటుచేసిన పబ్లిక్ మీటింగ్ లో మత్రమే సీఎం మాట్లాడుతారు. మొన్న ఏమో ముఖ్యమంత్రి పదవి నా ఎడమకాలి చెప్పుతో సమానం అని అంటావ్. ఇపుడు తమ బాధల్ని చెప్పుకోవడానికి వచ్చిన అమాయకులను కుక్కలంటూ సంబోధిస్తావ్. నీకు ప్రజలంటే అంత చులకనా అంటూ కేసీఆర్ ని పొన్నాల ప్రశ్నించారు. సభకు వచ్చిన వారిని పోలీసులతో బయటికి నెట్టివేయిస్తావు.

Also Read: ఎన్నికల్లో కుస్తీ..ఆనక దోస్తీ

ప్రజలకు దూరంగా కేసీఆర్:

కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ముఖ్యమంత్రి నివాసానికి ఉదయం 8 గంటల నుండి వేలాది మంది ప్రజలు వస్తుండేవారు. ఇపుడు అటువంటి అవకాశం లేదు. ముఖ్యమంత్రి బయటకు రాడు. ప్రజలు వస్తే లోపలికి రానీయరు. లిఫ్ట్ ఇరిగేషన్ 13 ప్రాజెక్టులకు దాదాపు మూడు వేల కోట్లు ఏడు సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చిందా. ఏడాదిన్నరలో చేస్తామని చెబుతున్నావు. 2018 ఎన్నికలకు ముందు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పలేదా. అవి ఇప్పటికీ కాలేదు ఇంకా. ఏం మొహం పెట్టుకుని వాగ్దానాలు చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు. ఈయన గారు అటు ఫ్లోరైడ్ రూపు మార్చింది అంట.. ఎక్కడున్నావ్ కేసీఆర్ 2004 నుండి 2014 వరకు కృష్ణా నీళ్ళని దాదాపు 95 శాతం గ్రామాలకు కృష్ణా ఫేజ్ – 1, 2 & 3 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు హైదరాబాద్ తో పాటు ఇచ్చిన చరిత్ర లేదా. మూడు నాలుగు కోట్ల తో ఒక పైలాన్ ను ఆవిష్కరించి ఫ్లోరైడ్ నేనే రూపు మాపాను అంటే అది చరిత్రలో నిలిచిపోతుంది అనుకుంటున్నావా అంటూ పొన్నాల ఎద్దేవా చేశారు.

ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల దోపిడీ:

తెలంగాణ వచ్చేనాటికి మరో 8500 కోట్లు ఖర్చుపెడితే 34 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది మీరే కదా. మీరు ఇప్పటి వరకు లక్ష కోట్లు ఖర్చు పెట్టారు ఏమైంది ఇప్పటివరకు 8500 కోట్లు కాలేదా. నల్గొండ కి ఏ మొహం పెట్టుకుని వచ్చావు. కృష్ణా నీళ్లు గ్రావిటీ ద్వారా జాలు ద్వారా 35 టీఎంసీల నీళ్లు వచ్చే కార్యక్రమాన్ని ఏడేళ్లలో ఒక అంగుళం కూడా కదల్లేదు. ఇప్పుడు కొత్తగా 13 ప్రాజెక్టులను పెట్టి నేను ఇక్కడే ఉండి చేస్తాను అని చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పొన్నాల అన్నారు. ఇవన్నీ ఎలక్షన్ కోసం కాదా. నల్గొండకు నాగార్జునసాగర్ తెచ్చింది కాంగ్రెస్ కాదా. నాగార్జున సాగర్ ని ఆధునీకరణ చేసింది కాంగ్రెస్ కదా. నాగార్జునసాగర్ ఎడమ కాలువ మీద మరింత ఆయకట్టు తీసుకురావడానికి 40 లిఫ్ట్ ఇరిగేషన్ లు వేసింది కాంగ్రెస్ కాదా ..? ఏడేళ్ల తర్వాత లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఒక చుక్క నీరు రాకుండా ఒక ఎకరానికి తెలంగాణలో నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో టీఆర్ఎస్ ఉందని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి కి 50 వేల కోట్లు ఖర్చు పెట్టావు కదా ఏమైంది ఆ ప్రాజెక్టు ఎక్కడుంది ఆ ప్రాజెక్టు.

Also Read: కేటీఆర్ సి.ఎం ఆశలు సజీవమే!

పెన్షన్ ల పేరుతో ఓట్లు దండుకున్న కేసీఆర్:

మేము 2 వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెప్తున్నాడు కేసీఆర్. తెలుగుదేశం హయాంలో మీరు మంత్రిగా ఉన్నారు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు మీరు ఎంత ఇచ్చారు ?గుర్తుందా ? మీకు ఇప్పుడు గుర్తు ఉండదు.. గుర్తు లేనట్లు నటిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు లక్షల మంది కే ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 74 లక్షల మందికి 75 రూపాయల నుండి పెంచి 200 రూపాయల పెన్షన్ ఇవ్వలేదా..? 2000 రూపాయలు ఇచ్చామని జోరుగా చెబుతున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మందికి పెన్షన్లు తీసేసారు తెలియదా..? ఓటమి భయంతో అర్హులైన వారందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పుకొస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రేషన్ కార్డు ఇస్తాడట. పెన్షన్ ఇస్తాడట మీ నాటకం ప్రజలకి తెలియంది కాదు. పంట బీమా ఎందుకు తీసేసారు. కేసీఆర్ అది వదిలేసి నీళ్లు అంటున్నావ్ ఏం మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావ్ కేసీఆర్. ఒక రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నామని చెప్పుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది రకాల అత్యవసర సరుకులను ఇవ్వలేదా కేసీఆర్. మీరు ఎందుకు బంద్ చేశారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎక్కడ:

మేము బియ్యంతో పాటు మిగతా నిత్యవసర సరుకులు ఇవ్వలేదా కేసీఆర్ ఏం మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని చెబుతున్నావ్. గ్రామాల కి పోదాం వస్తావా. నీవు ఎందుకు వస్తావు ఫామ్ హౌస్ కి తప్ప పబ్లిక్ మీటింగ్ కి తప్ప. ఏ గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు కనబడటం లేదా. నీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కన పడుతున్నాయా కేసీఆర్..? ఛాలెంజ్ చేస్తున్నాను వస్తావా ఇందిరమ్మ ఇల్లు చూపిస్తానంటూ పొన్నాల సవాల్ విసిరారు. ఉమ్మడి రాష్ట్రంలో 55 లక్షల మంది పేద ప్రజలకు ఇల్లు కట్టి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకుంది. నల్గొండ కి నీళ్ళు తీసుకు వస్తాను అని చెప్తున్నావ్ ఎక్కడినుంచి వస్తున్నాయి. నీ కాలేశ్వరం నుండి వస్తున్నాయా కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సహకార సంఘాలు, మార్కెట్ యార్డ్ లను బలోపేతం చేసి మద్దతు ధర వచ్చే విధంగా చేశామని పొన్నాల గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల చేత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే నిన్నటివరకు ప్రో క్యూర్ మెంట్లు చేశానని గొప్పలు పోయావు. కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఎత్తేసావు ? సమాధానం చెప్తావా కేసీఆర్..? మద్దతు ధరలు దొరుకుతున్నాయా..? మద్దతు ధరకు కొంటున్నారా కొనడం లేదే.. కాంగ్రెస్ పార్టీనే కదా ఉచిత విద్యుత్తు , వైద్య సౌకర్యాలు కల్పించింది, ప్రాజెక్టులను ప్రారంభించింది. ఫామ్ హౌస్ లో పడుకొని మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావా.. ఎవరైనా చర్చకు వస్తే మాట్లాడుతాను చర్చకు సిద్ధమా మీరు..?

Also Read: ఇష్టంలేకుండానే కొనసాగుడా…?

ప్రజల్ని కుక్కలని సంబోధిస్తావా?

ప్రజల్ని కుక్కలు అన్నావు. నువ్వే కదా కుక్కలా ఉండి పరిపాలన చేస్తాను అని చెప్పావు కేసీఆర్. ప్రజలు మర్చిపోలేదు. కాపలా కుక్క అని ఒక నియంతలా పరిపాలన చేస్తున్నావ్. కానుకలు ఇస్తారు అంట ఎప్పుడు ఇస్తావ్ నీ మాటలు తెలంగాణ ప్రజలకి కొత్త నా కేసీఆర్..? అవకాశం అధికారం వచ్చేదాకా ఒక మాట. అధికారం వచ్చాక ఆకాశం మీద ఉండి ప్రజలను కలవకుండా నీకు ముఖ్యమంత్రి పదవి ఎడమ కాలి చెప్పు తో సమానం ముఖ్యమంత్రి పదవికి అర్హుడవా కేసీఆర్..? కాంగ్రెస్ వాళ్ళని అవినీతిపరులు అన్నావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడ ఉన్నావు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి కేసీఆర్. కాళేశ్వరం పాలమూరు-రంగారెడ్డి మీద లక్ష కోట్లు దేనికి ఖర్చు పెట్టావో తెలియదా. మాటలు కట్టిపెట్టు కేసీఆర్ నీ మాటలను ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ ని ప్రజలు ఆదరిస్తారని పొన్నాల విశ్వాసం వ్యక్తం చేశారు.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles