- వేలం జాబితాలోచోటు దక్కని శ్రీశాంత్
- 50 లక్షలతో పూజారా, 20 లక్షల ధరతో చోటా సచిన్
ఐపీఎల్ 14 వ సీజన్ మినీ వేలానికి మరో వారం రోజులు మాత్రమే గడువు మిగిలిఉండగా ఫ్రాంఛైజీల అవసరాలు, సలహాలు, సూచనల మేరకు 292 మంది ఆటగాళ్లతో ఐపీఎల్ బోర్డు తుదిజాబితాను సిద్ధం చేసింది. ఏడేళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్లోకి పునరాగమనం చేసిన భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ వేలానికి తన పేరును నమోదు చేయించుకొన్నా తుదిజాబితాలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధానికి గురైన శ్రీశాంత్ న్యాయపోరాటం తర్వాత ఏడేళ్ల నిషేధం శిక్ష అనుభవించి ఈ మధ్యనే తిరిగి దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మరోవైపు మాస్టర్ సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ముంబై జట్టులో చోటు దక్కించుకోడంలో విఫలమైనా ఐపీఎల్ వేలం తుదిజాబితాలో మాత్రం చేరగలిగాడు.
అర్జున్ వేలం ధర 20 లక్షలు :
అర్జున్ టెండుల్కర్ కనీస వేలం ధరను 20 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఓపెనర్ గా, లెఫ్టార్మ్ పేస్ బౌలర్ గా జూనియర్ స్థాయిలో భారత్ కు, ముంబయి జట్టుకు ఆడిన అర్జున్ టెండుల్కర్ ముంబయి సీనియర్ జట్టులో మాత్రం చోటు ఖాయం చేసుకోలేకపోయాడు. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలలో అర్జున్ టెండుల్కర్ ను ముంబయి ఫ్రాంచైజీ తమజట్టులో చేర్చుకొనే అవకాశాలు లేకపోలేదు.
Also Read: ఐపీఎల్ కు వీవో గుడ్ బై
1114 మంది నుంచి 292 మంది:
చెన్నై వేదికగా ఈనెల 18న జరిగే మినీ వేలం కోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 1114 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిష్టర్ చేయించుకొన్నారు. అయితే ఐపీఎల్ బోర్డు మాత్రం వీరినుంచి 292 మంది ఆటగాళ్ళను ఎంపికచేసి వేలం తుదిజాబితాలో చేర్చింది. మొత్తం 292 మంది ఆటగాళ్ళలో 164 మంది భారత్, 125 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.
వేలంలో గరిష్టంగా 61 స్థానాలు మాత్రమే ఖాళీలు కాగా, ఇందులో 22 మంది వరకు విదేశీ ఆటగాళ్లను ఎనిమిది జట్లు ఎంచుకోనే వీలుంది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో అత్యధికంగా 13 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టులో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
2 కోట్ల వేలం ధరతో హర్భజన్:
Also Read: భారత్ తొలి ఓటమికి కారణాలు ఎన్నెన్నో!
భారత మాజీ స్పిన్నర్ , వెటరన్ హర్భజన్ సింగ్ కనీసవేలం ధరను 2కోట్లుగా నిర్ణయించారు. భజ్జీతో పాటు కేదార్ జాదవ్ సైతం 2 కోట్ల రూపాయల జాబితాలో ఉన్నాడు. కాగా భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా కనీస వేలం ధరను 50 లక్షలరూపాయలుగా ఖరారు చేశారు. 2014 ఐపీఎల్ లో చివరిసారిగా పాల్గొన్న టెస్టు స్పెషలిస్ట్ పూజారాను ఆ తర్వాత నుంచి ఫ్రాంచైజీలు పక్కనపెట్టాయి. 2కోట్ల రూపాయల వేలం ధర జాబితాలో చేరిన విదేశీ ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్, మాక్స్ వెల్ ఉన్నారు. వేలం కోసం కింగ్స్ పంజాబ్ ఫ్రాంచైజీ దగ్గర అత్యధికంగా 53 కోట్ల 20 లక్షల రూపాయలు అందుబాటులో ఉన్నాయి. తొమ్మిదిమంది ఆటగాళ్లను వేలం ద్వారా కింగ్స్ జట్టు సమకూర్చుకోవాల్సి ఉంది. కోల్ కతా, హైదరాబాద్ ఫ్రాంచైజీలు మాత్రం 10 కోట్ల 75 రూపాయల మొత్తం తో వేలం బరిలోకి దిగబోతున్నాయి.