- మేయర్, డిప్యుటీ మేయర్ పదవులు టీఆర్ఎస్ కైవసం
- టీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన ఎంఐఎం
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నిక పూర్తయింది. రెండు పదవులను అధికార టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. మేయర్ గా బంజారాహిల్స్ కార్పొరేటర్ టీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యుటీ మేయర్ గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత విజయం సాధించారు. మేయర్ పదవికోసం బీజేపీ తరపున ఆర్కేపురం డివిజన్ నుంచి ఎన్నికైన రాధ ధీరజ్ రెడ్డి నామినేషన్ వేశారు. దీంతో ఎన్నికల అధికారి శ్వేతామహంతి ఓటింగ్ నిర్వహించారు. అనంతరం విజయలక్ష్మి మేయర్ గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్ ఎన్నికలో ఎంఐఎం పై మొదటనుంచి ఉన్న అనుమానాలను పటాపంచలు చేసింది. అధికార పార్టీ అభ్యర్థికే మద్దతు తెలపడంతో టీఆర్ఎస్ ఊపిరిపీల్చుకుంది.
మేయర్ ఎన్నికకు ముందు జీహెచ్ఎంసీ కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం సభ్యుల కోలాహలం మధ్య జరిగింది. సభ్యులు తమకు అనుకూలమైన భాషలో ప్రమాణం చేసేందుకు అనుమతి నివ్వాలని పలు పార్టీల కార్పొరేటర్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రిసైడింగ్ అధికారి శ్వేతామహంతి నచ్చిన భాషలో ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతినిచ్చారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన 149 సభ్యులు ప్రమాణం చేశారు.