- త్వరలో కోచింగ్ సెంటర్ లో మరిన్ని సౌకర్యాలు
- విద్యార్థులకు మోటివేషన్ తరగతులు
విద్యార్థులు పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కౌటాల మండలంలో కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు అందిస్తున్న శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరిశీలించి అభ్యర్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధ్యాపకులు చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్దగా విని అర్థం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులంతా సమయాభావాన్ని పాటించాలని కోరారు. అభ్యర్థుల పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మెరిట్ అభ్యర్థుల కన్నా మార్కులు తక్కువగా వచ్చిన అభ్యర్థులపై దృష్టి పెట్టి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు.
విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యేందుకు వీలుగా త్వరలోనే ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అభ్యర్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించడం కోసం త్వరలో ప్రముఖ ప్రొఫెసర్లను శిక్షణా కేంద్రానికి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. కోచింగ్ సెంటర్ లో పక్క నియోజకవర్గాల అభ్యర్థులు కూడా రావటానికి ఉత్సాహం చూపుతున్నారని మానవతా థృక్పథంతో వారికి కూడా కోచింగ్ సెంటర్ లో చోటు కల్పించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల శిక్షణా కేంద్రంలో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల కోసం స్థానికంగా హాస్టల్ వసతి కల్పించడం జరిగిందని, అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. శిక్షణా తరగతుల అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే స్వయంగా భోజనం వడ్డించారు.