- అమరవీరుల త్యాగాలను మరిచిన కేసీఆర్
- రాజన్న రాజ్యంతోనే తెలంగాణ సుభిక్షం
తెలంగాణలో రాజన్న రాజ్యం రావాల్సిందేనని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా రాఘవ రెడ్డి అన్నారు. షర్మిల కొత్త పార్టీపై ఆయన ఏబీఎన్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సరిగా అమలుకావడంలేదన్నారు. దీనిపై షర్మిల అన్ని జిల్లాల నేతలతో అధ్యయనం చేస్తారని తెలిపారు. అన్ని జిల్లాల నేతలతో అధ్యయనం చేశాక పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. షర్మిల తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమని కొండా రాఘవరెడ్డి జోస్యం చెప్పారు.
Also Read: తెలంగాణలో రాజన్న రాజ్యం
తెలంగాణలో పార్టీ పెట్టాలనుకుంటున్న షర్మిలకు మద్దతు తెలుపుతామని కొండా రాఘవరెడ్డి అన్నారు. పార్టీలు వస్తుంటాయ్ పోతుంటాయ్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కొండా రాఘవరెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ విషయం రుజువైందని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన వందలాది మంది అమర వీరుల త్యాగాలతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కు విశ్వసనీయత లేదని అన్నారు. దుబ్బాకలో బీజేపీ విజయంతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమయిందని రాఘవరెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని అన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటిలో రాజన్న అభిమానులు ఉన్నారన్న రాఘవరెడ్డి షర్మిలకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.