జయలలితకు నమ్మినబంటు,”చిన్నమ్మ”, అని ముద్దుగా పిలుచుకునే శశికళ బెంగళూరు జైలు నుండి విడుదల అయ్యారు. రాణి వచ్చె…రణ తేజములలరగా.. డాల్ కత్తులు మెరయగ…అన్నట్లు, చాలా కోలాహలం మధ్య తమిళనాడులో అడుగుపెట్టారు. చైన్నైలో ఆమెకు భారీ స్వాగతం పలకాలని ఆమె మద్దతుదారులు సన్నాహాలు చేశారు. ఏఐఏడిఎంకె శాశ్వత ప్రధాన కార్యదర్శి శశికళ అంటూ పోస్టర్లు వేసి హడావిడి చేస్తున్నారు. శశికళను పార్టీ నుంచి ఎప్పుడో తొలగించారు.కానీ ఆమె మద్దతుదారులు అవేమీ పట్టించుకోవడం లేదు.
చక్రం తిప్పాలని ఆకాంక్ష
జయలలిత వారసురాలిగా తమిళనాడు రాజకీయాల్లో ఆమె చక్రం తిప్పాలని కోరుకుంటున్నారు. తిప్పుతారనే విశ్వాసంతోనూ కొందరు ఉన్నారు. జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన ఆమె ప్రయాణిస్తున్న కారుపై ఏఐఏడిఎంకె (అన్నా డిఎంకె) పార్టీ జెండాను నిలిబెట్టారు. దీనితో, జెండా రూపంలో తన రాజకీయ ఆలోచనలను బయటపెట్టినట్లుగా భావించాలి. మే నెలలో తమిళనాడులో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో శశికళ విడుదల కావడం, పార్టీ జెండాతో హడావిడి చేయడంతో తమిళనాట రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
Also Read : చెన్నపట్నంలో చిన్నమ్మ… రెపరెపలాడుతున్న రెండాకులు
ఆరేళ్ళపాటు నిషేధం
ఐతే, ఆమెపై 6 సంవత్సరాల పాటు నిషేధం ఉంది. ఇందులో కొన్నేళ్లు ఇప్పటికే గడిచిపోయాయి. ప్రస్తుతం, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఆమె ఈ అంశాన్ని ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాజకీయాలను ప్రభావితం చేయడానికి ఆమె తీవ్ర ప్రయత్నమే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వలె తమిళనాడులో కూడా సామాజిక వర్గాల ప్రభావం బలంగానే ఉంటుంది. ఈమె దేవర్ వర్గానికి చెందినవారు. ఏఐఏడిఎంకెకు ఈ వర్గం కీలక ఓటు బ్యాంకు. కావేరి తీరంలోని తంజావూరు మొదలైన జిల్లాల్లో దేవర్ సామాజిక వర్గంవారు ప్రభావశీలంగా ఉంటారు. మధురై ప్రాంతంలోనూ ఉన్నారు. వీరిపై శశికళ ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తారు.
జయలలిత ప్రియసఖి
జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ప్రియసఖిగా అంతులేని ఐశ్వర్యం సొంతం చేసుకున్నారు. ఇటు ధనబలం -అటు కులబలం పుష్కలంగా ఉంది. జయలలిత జీవించి వున్న కాలమంతా ఆ పార్టీ నేతలంతా ఈమెకు ఒంగి ఒంగి సలాములు చేసినవారే. జయలలిత మరణించిన తర్వాత, ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో సమీకరణలు మారిపోయాయి. ఆన్నీ కలిసి వచ్చి ఉంటే, పన్నీరుసెల్వం, పళనిస్వామి స్థానంలో శశికళ ముఖ్యమంత్రి అయి ఉండేవారు.
Also Read : చిన్నమ్మ పయనం ఎటు?
బీజేపీ పెద్దలకి మంచి అభిప్రాయం లేదు
దిల్లీ బిజెపి పెద్దలకు ఈమెపై మంచి అభిప్రాయం లేదు. అవినీతి, అక్రమార్జన కేసులో జైలుకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. జయలలిత మరణించిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఈమెను పార్టీ నుంచి తొలగించారు. ఈమె సొంత మనిషి, నమ్మినబంటు దినకరన్ “అమ్మ మక్కళ్ మున్నేట్ర కజగమ్” పేరుతో పార్టీని నడుపుతున్నారు. ఏఐఏడిఎంకె పగ్గాలు ఈమె చేతికే వస్తాయనే విశ్వాసాన్ని దినకరన్ వ్యక్తం చేస్తున్నారు. చట్టం ప్రకారం, ఏఐఏడిఎంకేకు ఆమే ప్రధాన కార్యదర్శి అని చెబుతున్నారు. 29 డిసెంబర్ 2016నాడు శశికళను ప్రధానకార్యదర్శిగా జనరల్ బాడీ ఎంపిక చేసింది. జైలు శిక్ష పడడం వల్ల ఆ బాధ్యతలు డిప్యూటీ జనరల్ సెక్రటరీ చేతుల్లోకి వెళ్లాయి. మళ్ళీ జనరల్ బాడీ సమావేశం జరగలేదని, శశికళ బహిష్కరణ అంశం ఇంకా కోర్టులో పెండింగ్ లో ఉందని దినకరన్ అంటున్నారు.
కోర్టులో చిక్కుకున్న పదవి
ఈ నేపథ్యంలో, న్యాయం శశికళ వైపే ఉంటుందనీ,మళ్ళీ శశికళయే పార్టీ ప్రధాన కార్యదర్శి అవుతారని దినకరన్ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి, ఈ అంశం కోర్టులో తేలాల్సి వుంది. పళనిస్వామి బృందం అడ్డుకొనే తీరుతారు. పన్నీరుసెల్వం కూడా ప్రస్తుతానికి శశికళ వ్యతిరేక వర్గంలోనే వున్నారు. బిజెపి ఢిల్లీ పెద్దలు పళనిస్వామి, పన్నీరుసెల్వం మధ్య ఒక అంగీకారాన్ని కుదిర్చి, అధికారం అప్పజెప్పారు. రేపటి ఎన్నికల్లోనూ వీళ్ళు బిజెపి పెద్దలు చెప్పినట్లుగానే నడుచుకోనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : జైలు నుంచి శశికళ విడుదల ఎపుడంటే…?
రజనీ రంగంలో ఉంటే పరిస్థితి వేరే రకంగా
రజనీకాంత్ పార్టీ స్థాపించి ఎన్నికల్లో నిలబడతారనే అంశం ముగిసిపోయిన అధ్యాయం అయ్యింది. రజనీ యాక్టీవ్ గా వచ్చి వుంటే, పన్నీరుసెల్వం రజనీతోనే సాగేవాడు.రజనీకాంత్ మద్దతు బిజెపికి ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఆరోగ్య రీత్యా, ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశాలు తక్కువే.ఐనప్పటికీ, రజనీ ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉంది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం డిఎంకె. దానికి స్టాలిన్ ప్రధానమైన నాయకుడు. కమల్ హసన్ కూడా పార్టీ స్థాపించాడు. స్టాలిన్ తోనే కమల్ నడిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలపై కమల్ ప్రభావం అంతంత మాత్రమేనని తమిళనాట వినిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో బిజెపి వుంది. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో లేకపోయినా, అక్కడ బిజెపియే చక్రం తిప్పుతోంది.
సమ్మోహన నాయకత్వం నిన్నటి మాట
నిజం చెప్పాలంటే, తమిళనాడులో సమ్మోహన నాయకుడు ఒక్కడూ లేరు. జయలలితతోనే ఆ శకం ముగిసింది.పళనిస్వామి, పన్నీరు సెల్వం ముఖ్యమంత్రులుగా పనిచేసినా, వారిని ఊరుపేరు లేనివారిగానే (అగస్త్య భ్రాతలు) చెప్పాలి. కాస్త ఆకర్షణ ఉన్న నాయకుడు స్టాలిన్. వారి సొంత కుటుంబంలోనే, అన్నదమ్ముల మధ్యనే ఎన్నో విభేదాలు వున్నాయి. కరుణానిథి స్థాయిని అతను అందుకోలేకపోయాడు. ఇంతకాలం ఏఐఏడిఏంకెకు అవకాశం ఇచ్చిన ప్రజలు, ఈసారి మార్పుకోరుతూ, డిఎంకెకు పట్టం కడతారా? తేలాల్సి వుంది.రేపటి పరిణామాల్లో,శశికళ మద్దతు స్టాలిన్ కు దక్కినా ఆశ్చర్యపడక్కర్లేదు. బిజెపి పెద్దలు శశికళను లొంగదీసుకుంటే, వార్ ఒన్ సైడ్ అవుతుంది. డిఎంకె ఆశలకు గండి పడతాయి. అప్పుడు,బిజెపి అభ్యర్థి లేదా బిజెపి బలపరిచే అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుంది. మొత్తంమీద, శశికళ రాక, తమిళనాడు రాజకీయాల్లో కొత్త కాక పుట్టిస్తోంది.