ప్రజ్ఞాప్రభాకరుడిగా తెలుగునాట కోటి వెలుగులు వెదజల్లిన మహోన్నతమూర్తి వేటూరి ప్రభాకరశాస్త్రి. కృష్ణాజిల్లా దివిసీమలోని పెదకళ్ళేపల్లిలో 07 ఫిబ్రవరి 1888న జన్మించారు. నేటికి 133 సంవత్సరాలు సంపూర్ణమయ్యాయి. 134 వ జయంతి జరుగుతున్న పుణ్యతిధి నేడు. వీరిది కవి, పండితుల కుటుంబం. సాహిత్యం, సంగీతం, వైద్యం వేటూరివారి ఇంట్లో,వంట్లో ప్రకాశమానమై కోటి ప్రభలు ప్రభవించాయి.
పుట్టుకవి
పన్నెండవ ఏటనే పద్యములల్లిన పుట్టుకవి. పండితుడు,కవి, పరిశోధకుడు, పరిష్కర్త,చరిత్రకారుడు, విమర్శకుడు, నాటక రచయిత. వీటన్నింటిని మించి గొప్ప యోగ సాధకుడు. అటు సాహిత్యంలోనూ, ఇటు యోగాభ్యాసంలోనూ ఎందరికో గురువు, గురువులకే గురువు వేటూరి. జీవించింది ఆరుపదుల కాలమే అయినా, అనంతకాలంలో నిలిచేపోయే అద్భుతమైన కృషి చేసిన ఆంధ్రతేజం. ఆయన ముట్టని కొమ్మలేదు, పట్టిన ప్రతి కొమ్మకు చేవను అందించిన ధీశాలి. సంస్కారణా శీలి. వేటూరి ప్రభాకరశాస్త్రి అనగానే అన్నమయ్య, జాను తెనుగు, చాటువులు గుర్తుకువచ్చి తీరుతాయి.
Also Read : తెలుగు భాషావేత్త పోరంకి దక్షిణామూర్తి అస్తమయం
మహాగ్రంథాల పరిష్కర్త
ఎన్నో మహా గ్రంథాలను వెలికితీసి, పరిష్కరించి, ప్రపంచానికి అందించిన పుణ్యజీవి.ఈరోజు అన్నమయ్య గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, ఆ కీర్తనలు వింటున్నామంటే, పాడుకుంటున్నామంటే.. అదంతా ప్రభాకరశాస్త్రి చలువే. ఈలోకం అన్నమయ్యను దాదాపు 400 ఏళ్ళపాటు మరచిపోయింది. ఆ సాహిత్యం మన స్మృతి పథం నుంచి వెళ్ళిపోయింది. తిరుమలలో నేలమాళిగలలో ఒదిగి వున్న ఆ జ్ఞాన భాండాగారాన్ని, రాగిరేకుల్లో దాగివున్న అన్నమయ్య అనంత సంపదను బయటకు తీసి పుణ్యం కట్టుకున్న ధన్యజీవి.
అన్నమయ్య గీతాల స్వరరచనా యజ్ఞం
వందల ఏళ్లనాటి ఆ కీర్తనలను పరిష్కరించి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వంటి మహనీయులకు అందించారు. వాటిని రాళ్లపల్లివారు స్వరపరచి, ప్రపంచానికి పరిచయం చేశారు. అలా మొదలైన అన్నమయ్య పదాల స్వరరచనా యజ్ఞం అనేకమంది మహామహుల చేతిలో అఖండంగా సాగింది. సాగుతోంది. నేడు ఇంటింటా అన్నమయ్య వినిపిస్తున్నాడు. ఆ సాహిత్యానికి వ్యాఖ్యాన పరంపరలు మొదలయ్యాయి. తరతరాలకు ఆ సారస్వతం చేరువయ్యింది. ఈనాడు పదకవితా పితామహుడిగా అన్నమయ్యను జాతి కొలుచుకుంటోంది. ఈ పుణ్యానికి పునాదులై నిలిచిన ప్రభాకరశాస్త్రిని గుండె గుడిలో నిలుపుకొని కొలుచుకోవాలి.
Also Read : కథాభి`రాముడు`
స్వామి సేవలో తరించిన అన్నారావుకు గురువు
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందరు చైర్మన్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు సేవలందించినా, అందరిలోనూ అగ్రేసరుడు చెలికాని అన్నారావు. తిరుమల నాయకుని సేవలో, అన్నమయ్య ప్రచారంలో వీరి పాత్ర విశిష్టమైంది. ఇంతటి చెలికానివారు వేటూరి ప్రభాకరశాస్త్రిని గురువుగా, మార్గదర్శిగా, హితునిగా , సన్నిహితునిగా భావించి, గౌరవించేవారు. ప్రభాకరశాస్త్రికి గురుపరంపర కూడా చాలా ఎక్కువ. తండ్రి సుందరశాస్త్రి తొలి గురువు. మద్దూరి రామావధాని మలి గురువు. శాస్త్రములలో తీర్చిదిద్దిన గురువు అద్దేపల్లి రామనాథశాస్త్రి. సాహిత్య, కవిత్వ లోకంలో విహరించడానికి ప్రభావితం చేసిన గురువు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి. యోగవిద్యా గురువు మాస్టర్ సి వి వి.
ఎందరో సద్గుగురువులు
ఇందరు సద్గురువుల సన్నిధిలో అభ్యాసం చేసిన కృషి ఊరికే పోలేదు. అబ్బిన ఆ సంస్కారం ఊరికే ఉండనివ్వలేదు. తాను కూడా సద్గురువుగా అవతరించి ఎందరికో మార్గదర్శనం చేసే సౌభాగ్యాన్ని దక్కించింది. జగత్ ప్రసిద్ధులైన తిరుపతి వేంకటకవులను, కొప్పరపు కవులను ఒకరినొకరికి పరిచయం చేసినవారిలో ప్రథమ శ్రేణీయులు ప్రభాకరశాస్త్రి. నాడు మద్రాస్ లో జరిగిన కొప్పరపు కవుల అనేక అవధాన, ఆశుకవిత్వ సభల్లో ప్రభాకరశాస్త్రి పాల్గొన్నారు. కొప్పరపువారి అసమాన శేముషికి అమితాశ్చర్యం చెందారు. బందరులో వున్న తన గురువు చెళ్ళపిళ్ళకు కొప్పరపుకవుల అనన్య ప్రతిభను పద్యాలలో వర్ణిస్తూ, ఉత్తరం రాసి పంపారు.
Also Read : ‘వట్టికోట’ మానవతకు పెట్టినకోట
కొప్పరపు కవులపై చెళ్ళపిళ్ళ నవరత్నాలు
అది చూసిన చెళ్ళపిళ్ళ కొప్పరపువారిపై నాటి పత్రికలకు వ్యాసాలు రాసి పంపారు. పద్య నవరత్నాలు రాసి, కొప్పరపువారికి పంపారు. చెళ్ళపిళ్ళవారి తీరుకు మురిసిపోయిన కొప్పరపువారు కూడా ప్రతిస్పందనగా,నవరత్నాలు రాసి, చెళ్ళపిళ్ళకు పంపారు. సాహిత్యలోకంలో తిరుపతి వేంకటకవులు -కొప్పరపు కవుల వివాదాలు ప్రసిద్ధం. కానీ, ఈ అద్భుతమైన పరిచయ ప్రారంభపర్వం పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఈ జంటల వివాదాల సందర్భంలో ఏ ఒక్కరి పక్కనా నిలువక, ఉభయుల వైపు సమానమైన గౌరవం చూపించినవారిలో ప్రభాకరశాస్త్రి ప్రధానులు.
చాటుపద్య మణిమంజరి
ఇద్దరిని విడదీసేవాళ్లు చాలామంది ఉంటారు. కలిపేవారు అరుదుగా ఉంటారు. ఆ అరుదైన అనురాగమూర్తి ప్రభాకరశాస్త్రి. శ్రీనాథుడు మొదలు ఎందరో మహాకవుల చాటువులను సేకరించి, పరిష్కరించి “చాటుపద్య మణిమంజరి”గా గ్రంథస్థం చేసిన ఘనత వేటూరిదే. ఈ పుణ్య విశేషం వల్ల, ఆ పద్యాలన్నీ మనం చదువుగలుగుతున్నాం. అనర్ఘ పద్యరత్నాలను తరతరాలకు బహుకరించిన జ్ఞానదాత వేటూరి. ముఖ్యంగా, శ్రీనాథుడుపై వీరు చేసిన కృషి విశిష్టమైంది. తెలుగు భాష ప్రాచీనతను మూల్యాంకనం చేయడానికి ప్రభాకరశాస్త్రి చూపిన తోవ గొప్పది. వారు సేకరించిన తాళ పత్రాలు, కనిపెట్టిన శాసనాలు మనకు ఎంతో ఉపకరించాయి.
Also Read : నేను “మనిషి”ని…
చారిత్రక ఆధారాలతో గ్రంథాల పరిష్కారం
అమరావతిలోని ఒక శాసనంలో ” నాగబు” అనే ఒక పదం వుంది. అది రెండువేల ఏళ్లనాటిదని పరిశోధకుల అభిప్రాయం. దీన్ని తొట్టతొలిగా కనిపెట్టింది వేటూరివారే. ఈ పదంపై ఇంకా వివాదాలు ఉన్నాయి. అవి తేలాల్సి వుంది. మద్రాస్ లో ఉపాధ్యాయుడిగా, ప్రాచ్య లిఖిత భాండాగారంలో పండితుడు, పరిష్కర్తగా వీరు చేసిన సేవ అమూల్యం. అనేక తెలుగు గ్రంథాలను చారిత్రక ఆధారాలతో సవివరంగా పరిష్కరించి ప్రకటించారు. తెలుగు సాహిత్యానికే కాక, చరిత్ర, సంస్కృతి పరిరక్షణకు ఒక సైనికుడిలా పనిచేశారు. ఎన్నో అనువాద రచనలు కూడా చేశారు.
దివ్యదర్శనం
సంస్కృతం, పాకృతం, తెలుగులో వీరి పాండిత్యం అమోఘం. అన్నమయ్యతో పాటు తొలి తెలుగు రచయిత్రిగా చెప్పుకునే తిమ్మక్కను కూడా ఈయనే వెలుగులోకి తెచ్చారు. ప్రభాకర స్మారిక, చాటుపద్య మణిమంజరి, క్రీడాభిరామం, శృంగారశ్రీనాథం, రూపక మంజరి, భాసుని ప్రతిమా నాటక అనువాదం, మీగడ తరకలు, ఆంధ్రకామందకం, గౌరీ కళ్యాణం మొదలైనవి ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. వీటితో పాటు వారు రాసిన పీఠికలు కూడా పుస్తకం రూపంలో ఉన్నాయి. కర్ణభారం, నాగానందం మొదలైనవి కూడా ఎన్నో ఉన్నాయి. వీరు రచించిన వాటిలో “దివ్య దర్శనం” అనే లఘుకావ్యం నిజంగానే దివ్య దర్శనం. దుర్గాదేవి దర్శన స్పర్శనలతో ఈ అలఘుకావ్యం రాసినట్లుగా పండిత, ఆధ్యాత్మిక లోకంలో ప్రసిద్ధం.యోగ, ఆధ్యాత్మిక మార్గాలలో నడచినా, మొదటి నుంచీ మూఢ విశ్వాసాలను ఖండిస్తూనే వచ్చారు.
Also Read : ఆదర్శ సభాపతి అనంత శయనం
మర్క్స్ ను మించిన విప్లవకారుడు మహాత్మాగాంధీ
సమతావాదంతోనే నడిచారు. సంఘసంస్కరణలకు పెద్దపీట వేశారు. లెనిన్, మార్క్స్ ను మించిన విప్లవకారుడు మహాత్మాగాంధీ అని ప్రభాకరశాస్త్రి అనేవారు. వేటూరివారు చదివిన,విన్న, పరిష్కరించిన గ్రంథాలలోని విషయాలన్నీ ఆయనకు కరతలామలకమే. అంతటి జ్ఞాపకశక్తి ఆయన సొత్తు. సుప్రసిద్ధుడైన విస్సా అప్పారావు వీరికి వియ్యంకుడే. ప్రభాకరశాస్త్రి బందరులో చదువుకున్నప్పుడు కొండా వెంకటప్పయ్య, వల్లూరి సూర్యనారాయణరావు ఇంట్లో ఉండేవారు. ముక్త్యాల సంస్థానంతో ఎంతో అనుబంధం ఉండేది.
వేటూరి సుందరరామమూర్తికి ప్రేరణ
ప్రఖ్యాత సినిమా గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తికి ప్రభాకరశాస్త్రి సొంత పెదనాన్న. సుందరరామ్మూర్తి తన చిన్ననాట, పెదనాన్న నుండి ఎన్నో అంశాల్లో ప్రేరణ పొందారు. ముఖ్యంగా అచ్చతెనుగుదనం, వాగ్గేయకార ప్రభావం ప్రభాకరశాస్త్రి నుంచి ప్రేరణ పొందినట్లుగా సుందరరామ్మూర్తి చెప్పుకునేవారు. నాటి సమకాలిక మహాకవి, పండితుల విశేషాలు కూడా ప్రభాకరశాస్త్రి నుంచి సుందరరామ్మూర్తి గ్రహించారు. సుందరరామ్మూర్తిపై విశ్వనాథ సత్యనారాయణ ప్రభావం ఎంత ఉందో, అంతకు మించిన ప్రభావం పెదనాన్న నుంచి ఉంది.
Also Read : ఇండో-పెసిఫిక్ పైనే అందరి దృష్టి
నిజంగా ప్రభాకరుడు
యోగిపుంగవుడు, నిత్య పరోపకార చింతనాపరుడు,విజ్ఞాన వటవృక్షం వేటూరి ప్రభాకరశాస్త్రి 29 ఆగష్టు 1950న తన 62వ ఏట ఈ లోకాన్ని భౌతికంగా వదిలి వెళ్లిపోయారు. వీరు తనువు చాలించి కూడా 70ఏళ్ళు దాటింది. వీరు మరణించినప్పుడు నాటి పత్రికలు నెలరోజులపాటు పుంఖానుపుంఖాలుగా వార్తలు, కథనాలు, ప్రత్యేక వ్యాసాలు ప్రచురించాయి.అనంత తేజోమూర్తియైన ప్రభాకరశాస్త్రి లోకానికి పంచిన వెలుగులు అనంతంగా ప్రసరిస్తూనే ఉంటాయి. ప్రభాకరుడు నిజంగా ప్రభాకరుడు.
చాలా బాగుందండి వ్యాసం ఒక మహానుభావుడు గురించి అన్ని వివరాలు సవిస్తరంగా వ్రాసినందుకు ధన్యవాదాలు