Sunday, November 24, 2024

కథాభి`రాముడు`

`సంపాదన, తిండి, దుస్తుల వంటి వాటి పట్ల అపేక్ష లేకపోవడమే ఆనందమయ జీవితం. ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఆ లక్షణాలు కలిగిన నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను` ఇవి ప్రముఖ రచయిత  భమిడిపాటి రామగోపాలం (భరాగో) మనసులోని మాటలు. `బతికినన్నాళ్లు పనిచేయాలన్నదే నా లక్ష్యం. పనిచేయడానికి పేదరికం ఉపకరిస్తుంది. అది పనిచేయాలనే సంకల్పాన్ని కలిగిస్తుందని కూడా అన్నారు. చిన్నతనంలో విజయనగరంలో సత్రంలో ఉచిత భోజనం చేస్తూ, పిల్లలకు ప్రైవేట్లు చెప్పగా వచ్చిన సొమ్ముతో  కుటుంబానికి బాసటగా నిలిచిన అనుభవం నుంచి  ఆయన  ఈ మాటలు అన్నారని భావించాలి. సాహిత్య రంగంలో తనకంటే గొప్పవారు చాలా మంది ఉన్నారని, అదే సమయంలో తనకూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని  చెప్పేవారు.

రచయితగా ప్రస్థానం

భరోగా `నేను – మా ఆవిడ` కథతో  (1949)లో  రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. `భారతి`లో ప్రచురితమైన కథను  గురువు రోణంకి అప్పలస్వామి బీఏ   తరగతి  గదిలో చదివి వినిపించిన వేళ కలిగిన ఆనందం, పులకింత వర్ణనాతీతం.

పాత్రికేయుడిగా..

ప్రఖ్యాత పత్రికా సంపాదకుడు నార్ల వేంకటేశ్వరరావు ప్రోత్సాహంతో `ఆంధ్రజ్యోతి`లో ఉపసంపాదకుడిగా కొంతకాలం పనిచేశారు. అక్కడి నుంచి సర్కారీ ఉద్యోగానికి మారినా  ఆ తర్వాత వివిధ  పత్రిలకు కాలమిస్టుగా సేవలు అందించారు.

Also Read: అచ్చ తెలుగు ఆణి ముత్యం మన వేటూరి

హాస్య రచయితగానే….  

`మన దగ్గర ఏదైనా సందేశం లాంటిది ఉంటే దానిని చిల్లర నాణేలంతా ఇంపైన స్వల్పధ్వనితో అందించాలి కానీ దుడ్డుకర్రతో బాదినట్లు బలమైన వేటుగానూ, మాంత్రికుడి వేపమండల ఊపులా, విసురుగా చెప్పడం  సాహితీ న్యాయం కాదు`అని విశ్వసించే ఆయన దానిని పాటించారని కథా విశ్లేషకులు అంటారు. సామాజిక సమస్యలు ఇతివృత్తంగా సమాజానికి పనికొచ్చే రచనలు చేసినా ఆయనకు హస్య రచయితగనే ముద్రపడింది. ఆ  మాటకొస్తే హాస్య రచనలు చేయడమే కష్టమని, మనిషిని ఆరోగ్యంగా ఉంచేది హాస్యమే కనుక  దానిపై రాసి మెప్పించడం గొప్పతనమే అయినా, హాస్యానికి, `సీరియస్`  రచనలుకు తేడా గమనించలేకపోవడమే విచిత్రమని వ్యాఖ్యానించేవారు.  విషాదనుభవాలను  వినోదాలుగా భావించి  హాస్యాన్ని సృష్టించారు. హాస్య కథల్లో విషాదం, విషాద రచనల్లో హాస్యం అంతర్లీనంగా కనిపిస్తాయి.

చమత్కారి

భరాగో సంభాషణ ప్రియుడు, చమత్కారులు, వ్యంగ్యాలు, అధిక్షేపణలతో కూడిన కబుర్లతో నవ్విస్తారు. చమత్కృతికి ఓ  ఉదాహరణ. ఈ వ్యాసకర్త గురువు,`ముత్యాలముగ్గు` నిర్మాత ఎమ్వీయల్ విశాఖలో ఒక సినిమాకు వెళ్లారు. కొంతసేపటికి ఈ సినిమా మీద  మీ అభిప్రాయం ఏమిటనే అనే  ఎమ్వీయల్  ప్రశ్నకు, ఆయన కళ్లజోడు ను ముఖం మీద నుంచి తీసి మడత పెట్టి జేబులో పెట్టుకున్నారు. ఉత్తమాభిరుచిగల సాహిత్యం,  మంచి రకం సంగీతం, వినోదం, చమత్కారం ఉన్న చోట ప్రత్యక్షమయ్యేవారు. ముందే చెప్పినట్లు ఎమ్వీయల్, డాక్టర్ తోలేటి  చంద్రశేఖర్ (తంబు) తదితరులతో హాస్యప్రియుల  బృందం ఉండనే ఉండేది. మనసైన స్నేహితులకు ఎంతవిలువనిచ్చి, ఎంత స్నేహం పంచుతారో చెప్పేందుకు ఓ ఉదాహరణ. తరచూ ఆయన ఇంటిని సందర్శించి భోజనం చేసే ఎమ్వీయల్ కోసం ప్రత్యేకంగా పీట ఉండేదట. ఆయన భోజనానికి ఉన్నా, లేకున్నా దానిని  `ఎమ్వీయల్ పీట`గా ప్రత్యేకించారట. ఆ పీట మీద ఎవరు కూర్చోకుండా భరోగా గారి కూతురు (1970 దశకంలో మాట) కాపలా కాసేదట. ఇదీ  మా గురువు గారు చెప్పిన అనుభవమే.

కేంద్ర పురస్కారం

ఒక రచయిత  అన్నట్లు `జాతీయ స్థాయిలో తెలుగు కథలకు  గుర్తింపు లేని స్థితిలో `ఇట్లు భవదీయుడు` కథల  సంపుటి తొలి ఆంధ్రుడిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొంది ఢిల్లీలో బావుటాను ఎగరేశారు`. అలా అని  సాహిత్యం ద్వారా తానేదో సమాజసేవచేస్తున్నానని చెప్పుకోలేదు. `మీరు కథలు ఎందుకు రాస్తున్నారు`అనే ప్రశ్నకు `అచ్చు వేసే పత్రికలు ఉన్నాయి కనుక, డబ్బులు కూడా వస్తాయి కనుక`అని  నిక్కచ్చిగా చెప్పిన రచయిత. అందులో హాస్యం ఉందనిపించినా, సమాజానికి మన సందేశాలతో  పనిలేదన్న భావనా  దాగి ఉంది. `సామాజికి స్పృహ కలగడం నా రచనా వ్యాసంగ చరిత్రలో ఒక కిలోమీటర్  రాయిగా చెప్పుకోవచ్చు`అనడంలో  ఆ అంశాన్ని  చమత్కరించిన తీరును గమనించవచ్చు.  `ఆరామ గోపాలమ్` పేరుతో ఆత్మకథను వెలువరించారు. `నేనెందుకు వ్రాస్తున్నాను` వ్యాస సంపుటి పులుపుల శివయ్య సాహితీ పురస్కారాన్ని అందుకుంది.

పారితోషికం కోసం దావా

పారితోషికం తక్కువా?ఎక్కువా? అనే  దానికంటే రచయితలు, కవులకు గుర్తింపు ముఖ్యమన్నది ఆయన భావన. కథకుడిగా ప్రారంభదశలో ఆయన కథను ప్రచురించిన  పత్రిక పారితోషికం పంపడంలో మాత్రం తాత్సారం చేయడంతో న్యాయస్థానానికి వెళ్లారట. `రచయిత ఎంతో  సమయం వెచ్చించి, ఆలోచించి చేసిన రచనను అచ్చేసి అమ్ముకొని ఆర్జించేటప్పుడు  మూడు రూపాయల పారితోషికాన్ని పంపలేరా? అతను కొత్త రచయిత అయితే మాత్రం  అంత నిర్లక్ష్యమా? అని వ్యాఖ్యానించిన  న్యాయస్థానం  కోర్టు ఖర్చులనూ ఆ పత్రికా యాజమాన్యంతో ఇప్పించింది. దాంతో కొన్ని  పత్రికలు  పారితోషికం  సంప్రదాయాన్ని `కొంతవరకు  పాటించాయనే వారు.

Also Read: తెలుగు సినిమా ఉమ్మడి ఆస్తి ‘గుమ్మడి’

సహ రచయితలకు  వెన్నదన్ను

సాహిత్య రంగంలో తనకంటే గొప్పవారు చాలా మంది ఉన్నారని, అదే సమయంలో తనకూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పేవారు. సొంత రచనలతో  ఇతరుల రచనలను  సంపాదకుడుగానో, సంకలన కర్తగానో  ప్రచురించి మురిసిపోయేవారు. ప్రముఖులు, సంస్థలప ప్రత్యేక సంచికలు తెచ్చారు. బాగున్నాయనుకున్న వారి రచనలను  సందర్భానుగుణంగా ప్రస్తావిస్తూ పది మందికి తెలియచెప్పిన నిష్కామ కథకుడు. అనంతర కాలంలో అనారోగ్య పరిస్థితులు చుట్టుముట్టినా తమకిష్టమైన సాహితీ వ్యాసంగాన్ని పక్కనపెట్టలేదు. `బతికినంత కాలం పనిచేస్తూ ఉండడమే నా లక్ష్యం`అన్న తన మాటలను  సాహితీపరంగా అక్షరాలా పాటించారు.  శారీరకంగా అవయవాలు అంతగా సహకరించకపోయినా,  మెదడు పని చేస్తే చాలనే తత్త్వంతో చక్రాల కుర్చీకే పరిమితపై కూడా సహాయకులకు చెబుతూ  రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే 78వ ఏట `కథ` ముగించుకొని వెళ్లిపోయారు.

(ఈ నెల 6న భరాగో జయంతి)

Dr. Aravalli Jagannadha Swamy
Dr. Aravalli Jagannadha Swamy
సీనియర్ జర్నలిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles