(పాలడుగు రాము)
కూచిపూడి నాట్య కళాకారిణిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన శోభానాయుడు బుధవారం తెల్లవారుఝామున కన్నుమూశారు. నరాల సంబంధిత వ్యాధితో హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
వెంపటి చిన సత్యం దగ్గర శిష్యరికం చేసిన ఆమె పలు దేశాలలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభానాయుడు 12 ఏళ్ల ప్రాయంలోనే కూచిపూడి నృత్యం పట్ల ఆకర్షితులయ్యారు. 1980లో కూచిపూడి డాన్స్ అకాడమీని స్థాపించి దాదాపు 1500 మంది విద్యార్థులకు కూచిపూడిలో శిక్షణ ఇచ్చారు.
2008లో సాధన పేరుతో క్లాసికల్ డాన్స్ శిక్షణా కార్యక్రమాన్ని టిటిడీ ఛానల్ ప్రసారం చేసింది. పలువురు విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు సిరిసిరిమువ్వ పేరుతో సంసృతి ఛానల్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు. కూచిపూడిపై మక్కువతో సినిమా అవకాశాలు వచ్చినా ఆమె తిరస్కరించారు.
శోభానాయుడు విప్రనారాయణ, కళ్యాణ శ్రీనివాసం, శ్రీకృష్ణశరణంమమ, గిరిజా కళ్యాణం ప్రదర్శనలతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ శ్రీనివాసం పేరుతో దేశవ్యాప్తంగా నాట్య ప్రదర్శనల నిచ్చారు. ఇందులో ఆమె పద్మావతి పాత్రలో రాణించారు. ఆమె తన ప్రదర్శనలతో దేశ విదేశాల్లో కూచిపూడి నృత్యానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. See Also: దివికేగిన కూచిపూడి శోభ
శోభానాయుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ‘తానా’ ఆధ్వర్యంలో చేసిన ప్రదర్శనలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. భారత ప్రభుత్వ సహకారంతో విదేశాల్లో పలు ప్రదర్శనలనిచ్చారు. ఆమె మృతి నాట్య రంగానికి తీరని లోటని ప్రముఖ డాన్సర్ సోనా మాన్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు.
గత 5 దశాబ్దాలుగా కూచిపూడి నృత్యానికి చిరునామాగా మారిన శోభానాయుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తన ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమెకు భర్త అర్జున్ రావు, కుమార్తె సాయి శివరంజని ఉన్నారు.తన ప్రతిభకు నిదర్శనంగా ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డుతో పాటు సంగీత నాటక కళా అకాడమీ అవార్డు, హంస అవార్డు, నిత్య చూడామణి లాంటి మరిన్నిఅవార్డులు ఆమెను వరించాయి.