Sunday, December 22, 2024

జో రూటే సెపరేటు

భారత్ తో రూట్ కు ప్రత్యేక అనుబంధం

చెన్నై వేదికగా రూట్ వందో టెస్ట్ మ్యాచ్

భారత గడ్డకు ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ కు ఏదో విడదీయరాని అనుబంధమే ఉంది. భారత గడ్డపై తన తొలిటెస్టుమ్యాచ్ ఆడిన రూట్…అదే భారత్ వేదికగా..తన వందో మ్యాచ్ సైతం ఆడనున్నాడు. ఆధునిక టెస్ట్ క్రికెట్ అసాధారణ బ్యాట్స్ మెన్ లో ఒకడిగా ఉన్న 4వ ర్యాంకర్ జో రూట్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా టెస్టు మ్యాచ్ ల సెంచరీ పూర్తి చేయనున్నాడు.

నాగపూర్ నుంచి చెన్నై వరకూ

తొమ్మిదిసంవత్సరాల క్రితం నాగపూర్ విదర్భ స్టేడియం వేదికగా తన 20వ ఏట టెస్టు అరంగేట్రం చేసిన జో రూట్ నాటినుంచి నేటి వరకూ వెనుదిరిగి చూసింది లేదు. వైగా రూట్ అసాధారణ రికార్డులన్నీ భారత్ తోనే ముడిపడి ఉన్నాయి. భారత్ ప్రత్యర్థిగా 2012 సిరీస్ లో నాగపూర్ వేదికగా తన తొలి టెస్టు ఆడిన రూట్ తన 50వ టెస్టును విశాఖ వేదికగా భారత్ ప్రత్యర్థిగానే ఆడటం విశేషం. అంతేకాదు వందో టెస్టు మ్యాచ్ ను సైతం  భారత గడ్డపై ,భారత్ ప్రత్యర్థిగానే ఆడటానికి సిద్ధమయ్యాడు. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 5న ప్రారంభంకానున్న తొలిటెస్టుమ్యాచ్ రూట్ కెరియర్ లో 100వ టెస్టుగా రికార్డుల్లో చేరనుంది.

ఇదీ చదవండి:ఆ రికార్డు తమీమ్ ఇక్బాల్ కే సాధ్యమైంది

15వ ఇంగ్లీష్ క్రికెటర్ రూట్

 144 సంవత్సరాల ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ వంద టెస్టులు ఆడిన ఆటగాళ్లు కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు జో రూట్ 15వ క్రికెటర్ గా వారి సరసన నిలువనున్నాడు. ఇంగ్లండ్ క్రికెటర్లలో అలీస్టర్ కుక్ 161 టెస్టులు, జేమ్స్ యాండర్సన్ 157 టెస్టులు, స్టువర్ట్ బ్రాడ్ 144 టెస్టులు, అలెక్ స్టెవార్ట్ 133, ఇయాన్ బెల్ 118 టెస్టులు ఆడటం ద్వారా మొదటి ఐదుస్థానాలలో నిలిచారు.  శ్రీలంకతో ఇటీవలే ముగిసిన రెండుమ్యాచ్ ల సిరీస్ లో 228, 186 పరుగుల స్కోర్లు సాధించిన రూట్  ఇప్పటి వరకూ ఆడిన మొత్తం 99 టెస్టుల్లో 8 వేల 249 పరుగుల నమోదు చేశాడు. ఇందులో 19 శతకాలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం కళ్లు చెదిరే ఫామ్ లో ఉన్న జో రూట్ కు భారత్ ప్రత్యర్థిగా 16 టెస్టులు ఆడిన రికార్డు ఉంది. ఇందులో నాలుగు సెంచరీలు,9 అర్థశతకాలతో సహా 1421 పరుగులు, 56.84 సగటుతో ఉన్నాయి. భారత్ ప్రత్యర్థిగా భారత గడ్డపై ఆడిన గత సిరీస్ లోనూ జో రూటే అత్యధిక పరుగుల ఇంగ్లీష్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. రూట్ 500కు పైగా పరుగులు సాధించినా భారత్ చేతిలో 0-4తో బ్రౌన్ వాష్ తప్పలేదు. స్పిన్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొనడంలో మొనగాడిగా పేరుపొందిన రూట్ భారత ముగ్గురు స్పిన్నర్ల ముప్పేటదాడిని ఏవిధంగా ఎదుర్కొంటాడో వేచిచూడాల్సిందే.  ప్రస్తుత సిరీస్ లో ఇంగ్లండ్ కెప్టెన్ గా మాత్రమే కాదు…టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ గానూ 30 ఏళ్ల జో రూట్ నిర్ణయాత్మకపాత్ర పోషించనున్నాడు

ఇదీ చదవండి:సిరీస్ నెగ్గితేనే భారత్ కు ఫైనల్స్ బెర్త్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles